calender_icon.png 29 August, 2025 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్మాల వరద బాధితుల ఎయిర్‌లిఫ్ట్

29-08-2025 05:28:52 AM

  1. ఐదుగురిని కాపాడిన ఆర్మీ
  2. వరదల్లో గలంతైన కుటుంబానికి బండి పరామర్శ
  3. రూ. లక్ష సాయం అందజేత
  4. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం: బండి సంజయ్

సిరిసిల్ల, ఆగస్టు 28(విజయక్రాంతి): సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో వరదల్లో చిక్కుకుపోయిన ఐదుగురిని ఆర్మీ కాపాడింది. ఆర్మీ హెలికాప్టర్లను ప్రత్యేకంగా రప్పించి బాధితులను ఎయిర్ లిఫ్ట్ చేసి కాపాడారు. మరోవైపు ఆర్మీ హెలికాప్టర్లు వస్తున్నాయనే సమాచారం అందుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్  గురువారం మధ్యాహ్నం నర్మాలకు చేరుకోవడం, అప్పటికే ఆర్మీ హెలికాప్టర్లు బాధితుల ను బయటకు తీసుకువచ్చాయి.

ఈ నేపథ్యంలో తమ ప్రాణాలు కాపాడడానికి కృషి చేసిన సంజయ్‌కు బాధితులు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు నర్మాల గ్రామస్థులతోపా టు అక్కడికి వచ్చిన జనమంతా బండి సంజయ్‌ను “రియల్ హీరో” అంటూ అభివర్ణించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని  సూచించా రు.

బుధవారం నుంచి రెస్క్యూ ఆపరేషన్లలో నిమగ్నమైన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది చేసిన కృషి మరువలేనిదన్నారు. నర్మాలలో రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించిన ఎన్డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దామోదర సింగ్‌ను అభినందించి శాలువాతో సన్మానించారు.

ఆర్థిక సహాయం

మరోవైపు వరదల్లో గల్లంతైన నర్మాలకు చెందిన పంపుకాడి నాగయ్య నివాసానికి కేంద్రమంత్రి బండి సంజయ్ వెళ్లారు. ఆయ న కుటుంబసభ్యులను పరామర్శించారు. మనోధైర్యం కోల్పోవద్దని, అండగా ఉంటామని ఓదార్చారు. నాగం కుమారుడు సాయి కి రూ.లక్ష ఆర్థికసాయం అందించారు. 

రాష్ట్రప్రభుత్వంతో కలిసి పని చేస్తాం

 అంతకుముందు మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ ‘భారీ వర్షాలు, వరదలతో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నా రు. నర్మాల వరదల్లో బాధితులు చిక్కుకుపోయారని తెలిసిన వెంటనే కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కోరిన వెంటనే ఆర్మీ హెలికాప్టర్లను పంపారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో నిన్న రాలేకపోయాయి. గురువారం కొద్దిసేపు తెరిపి ఇచ్చిన వెంటనే హెలికాప్టర్లు వచ్చి బాధితులను ఎయిర్ లిఫ్ట్ చేశారు.

రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు. బాధితుల ప్రాణాలను కాపాడేందుకు నిన్నటి నుంచి కష్టపడి పనిచేస్తున్న వారందరికీ ధన్యవాదాలు’ తెలిపారు. ‘ప్రత్యేకించి ఆర్మీ చాపర్లను తెచ్చి బాధితుల ప్రాణాలు కాపాడిన రక్షణ శాఖ అధికారులకు అభినందనలు. ముఖ్యంగా ఎయిర్ కమాండర్ వీఎస్.శైనీ చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఆయనకు హ్యాట్సాఫ్ చెబుతున్నా. ప్రస్తుతమున్న రెండు హెలికాప్టర్లతోపాటు అదనంగా మరో రెండు హెలికాప్టర్లు సిరిసిల్లకు వచ్చాయి.

వరద బాధిత ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ టైంలో దయచేసి రాజకీయాలు వద్దు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సరికాదు. బాధితులను కాపాడేందుకు రాష్ర్ట ప్రభుత్వంతో పూర్తిగా సమన్వయంతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నాం. ముఖ్యమంత్రి, మంత్రులతో నిరంతరం మాట్లాడుతూ పరిస్థితిని అంచనా వేస్తున్నాం.” అని తెలిపారు.