29-08-2025 05:50:55 AM
మహబూబాబాద్/ కొండపాక/ మంచిర్యా ల/ దౌల్తాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): యూరియా కోసం రాష్ట్రంలో అన్నదాతల ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయి. కొరత ఏర్పడి రోజులు గడుస్తున్నా, రైతుల సమస్యల పట్ల ప్రభుత్వాలు పట్టనట్టు వ్యవహరిస్తున్నా యి. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా ఆయా ప్రాంతాల్లో రైతులు యూరి యా కోసం పడిగాపులు కాస్తున్నారు. అదను దాటుతోంది సార్.. యూరియా ఎప్పుడు ఇస్తారు.. ఎప్పుడొస్తుందని అన్నదాతలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు, తొర్రూరు డివిజన్ కేంద్రం లో గురువారం యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. సొసైటీ వద్దకు వచ్చి అధికారుల నుంచి సరైన సమాధానం లేకపోవడంతో రాస్తారోకో నిర్వహించారు. పంట వేసి యూరియా వేయడానికి అదను దాటుతోందని, రోజుల తరబడి లైన్‌లో నిలబడితే ఒకటి రెండు యూరియా బస్తాలే ఇచ్చారని, కొందరికి అది కూడా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తొర్రూర్‌లో రైతుల రాస్తారోకోతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్‌ఐ ఉపేంద ర్, ఏవో రామ్ నరసయ్య అక్కడికి చేరుకొని రైతుల గోడు విన్నారు. ప్రస్తుతం యూరియా స్టాక్ లేదని, స్టాక్ రాగానే సొసైటీ పరిధిలోని సోమారం, హరిపిరాల, తొర్రూరు ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద అందజేస్తామని హామీ ఇచ్చారు. వారి హామీతో రైతులు శాంతించారు. మహబూబాబాద్‌లో రైతుల ఆందోళ నకు మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మద్దతు పలికారు.
వ్యవసాయానికి ఊతమైన యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సిద్దిపేట జిల్లా కొండపాక ప్రాథమిక సహకార సం ఘం ముందు రైతులు బారులు తీరారు. యూరి యా వచ్చిందంటూ అధికారులు సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించడంతో సుమారు వెయ్యికి పైగా మంది రైతులు కేంద్రానికి చేరుకున్నారు. కానీ 550 బస్తాలే రావడంతో రైతుకు ఒక్కోటి చొప్పున పంపిణీ చేశారు.
మిగతా రైతులు ఖాళీ చేతులతో వెనక్కిపంపారు. మంచిర్యాల జిల్లాలో యూరియాతో పాటు ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నూరు మండలంలోని దుగ్నేపల్లి హాకా సెంటర్ వద్ద రైతులు ఉదయం నుంచి యూరియా కోసం క్యూ కట్టగా ఓ రాజిరెడ్డి అనే రైతుకు ఫిట్స్ వచ్చి కింద పడిపోయాడు. అతన్ని తోటి రైతులు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే
రాష్ర్టంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతోందని, అన్నదాతలకు యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయపోల్ మండల కేంద్రంలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 560 యూరియా బస్తాలు రాగా, దాదాపు వెయ్యి మంది రైతులు వానకు తడుస్తూ క్యూ లైన్ లో నిల్చున్నారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. పంటల సీజన్‌లో రైతులకు యూరియా అత్యవసరమని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల రైతులు రాత్రింబవళ్లు, వర్షానికి తడుస్తూ క్యూల్లో నిలబడి ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి సరిపడా యూరియా తెప్పించాల్సింది పోయి, కేవలం ప్రకటనలకే పరిమితమైపోతోందని ఆయన మండిపడ్డారు.