29-08-2025 12:30:43 PM
ఆగస్టు 30 లోపు డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల పై అభ్యంతరాలు అందించాలి
పెద్దపల్లి,(విజయక్రాంతి): సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీ తుది ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్, పోలింగ్ కేంద్రాల లిస్ట్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా అప్ డేట్ చేయడం జరుగుతుందని అన్నారు. పెద్దపల్లి జిల్లాలోని 263 గ్రామ పంచాయతీల పరిధిలోని 2432 వార్డులలో 4,04,209 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ఆగస్టు 28న విడుదల చేయడం జరిగిందని,
జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ వారిగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితా తయారు చేశామని, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు ఈ జాబితా పరిశీలించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 30 లోపు తెలియజేయాలని , ఆగస్టు 31 లోపు వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి సెప్టెంబర్ 2న తుది ఓటర్ జాబితా ప్రచురించడం జరుగుతుందని, ప్రతి మండలం పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 2432 డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితా ఎంపీడీవో ఆగస్టు 28న తయారు చేశారని, వీటిపై అభ్యంతరాలను ఆగస్టు 30 లోపు ఎంపిడిఓ కార్యాలయంలోఅందించాలని అన్నారు. సెప్టెంబర్ 2న తుది పోలింగ్ కేంద్రాల జాబితా తయారు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.