‘ఉచితాల’తో ఆర్థిక ప్రమాద ఘంటికలు
- కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై హైకోర్టు ఆగ్రహం
- ఉద్యోగుల పెన్షన్లు, బెనిఫిట్స్ చెల్లింపుల్లో జాప్యంపై ఆందోళన
హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి ఉచిత పథకాల చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పథకాలకు సంబంధించి విధించిన స్టేను తొలగించేందుకు ధర్మాసనం నిరాకరించింది. గురువారం విచారణ సందర్భంగా ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌ను పరిశీలించిన కోర్టు.. అందులో సరైన వివరాలు లేవంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరిమితి లేకుండా ఉచిత పథకాలకు నిధులు కేటాయించడం వల్ల ఇతర అత్యవసర రంగాలపై ప్రభావం పడుతోందని అభిప్రాయపడింది. ఆర్థిక పరిస్థితిని మించి సంక్షేమ పథకాలకు నిధులు మళ్లించడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత వారికి అందాల్సిన పెన్షన్లు, ఇతర బెనిఫిట్స్ సకాలంలో చెల్లించలేని పరిస్థితి ఎందుకు ఏర్పడుతోందని కోర్టు ప్రశ్నించింది.
బెనిఫిట్స్ అందక నిరాశకు గురైన పలువురు ఉద్యోగులు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తున్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. నిర్బంధ భూసేకరణలో భూములు కోల్పోయిన బాధితులకు చెల్లించాల్సిన పరిహారాలను పక్కనపెట్టి ఉచిత పథకాలకు నిధులు ఎలా కేటాయిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ముందుగా భూబాధితులకు సకాలంలో పరిహారం చెల్లించడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని సూచించింది.
ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇటువంటి ఉచిత పథకాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు ఆర్జిస్తే ఆ నిధులను సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించవచ్చని పేర్కొంది. అయితే రాష్ట్ర ఆర్థిక సామర్థ్యాన్ని మించి ఉచితాలు పంచడం సరైంది కాదని స్పష్టం చేసింది. ఉచిత పథకాల అమలుకు సంబంధించిన ఆర్థిక, పరిపాలనా అంశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర వివరాలను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. సరైన వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ విచారణను కొనసాగించింది.






