పోలింగ్‌కు హైదరాబాద్ సిద్ధం
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం
పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది
వెబ్ కాస్టింగ్‌తో ఓటింగ్ పర్యవేక్షణ
జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు
ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో పార్లమెంటు ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఉపఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా 1,675 ప్రాంతాలలో 3,986 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పరిధిలో మొత్తం 45.70 లక్షల మంది ఓటర్లు ఉన్నా రు. లోక్‌సభ ఎన్నికల కోసం 8,713 బ్యాలెట్ యూనిట్లు, 5,383 కంట్రోల్ యూనిట్లు, 6,217 వీవీ ప్యాట్‌లను ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ ఉపఎన్నిక కోసం 493 బ్యా లెట్ యూనిట్లు, 497 కంట్రోల్ యూనిట్లు, 495 వీవీ ప్యాట్‌లను సిద్ధం చేశారు. ఈ కేం ద్రాలలో మొత్తం 28,721 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. నగంరలో 18 ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించిన సమస్యలు ఏమై నా ఉంటే టోల్ ఫ్రీ 1950, 1800 599 నంబరుతో పాటు సీ విజిల్ యాప్ ద్వారా పౌరులు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు.
సిబ్బంది తరలింపు..
డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల నుంచి ఎన్నికల సిబ్బంది మెటీరియల్ తీసుకుని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. పోలింగ్ బూత్‌లలో కనీసం ఇద్దరు ఏజెంట్ల సమక్షంలో ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో పోలింగ్ ఏజెంట్లు రాకుంటే మరో 15 నిమిషాలు ఎదురుచూడాల్సి ఉంటుంది. అప్పటికీ ఏజెంట్లు రాకుంటే పోలింగ్ అధికారే మాక్ పోలింగ్ జరపనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్‌తో కలిసి చార్మినార్, యాకత్‌పుర అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏర్పాటు చేసిన డీఆర్‌సీ కేంద్రాలను పరిశీలించారు. అంతకముందు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ల, సికింద్రాబాద్ వెస్లీ కళాశాలలో కంటోన్మెంట్ సెగ్మెంట్ డీఆర్‌సీ కేంద్రాలను రోనాల్డ్ రోస్ పర్యవేక్షించారు.
వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పర్యవేక్షణ
పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రక్రియను సీసీ కెమెరాలలో బంధించనున్నారు. పోలింగ్ కేంద్రాల్లోని కెమెరాలకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కెమెరాలకు అనుసంధానం చేశారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచే ప్రతి పోలింగ్ కేంద్రాలలోని ఓటింగ్‌ను ఎన్నికల అధికారులు వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాలు చేశారు. ఒక్కో సెగ్మెంట్‌కు ఆరుగురు కంప్యూటర్ ఆపరేటర్లు చొప్పున షిఫ్టులవారీగా విధులు నిర్వహిస్తారు. రోనాల్డ్ రోస్ ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు కంట్రోల్ రూం నుంచి పరిశీలన చేయనున్నారు. పోలింగ్ కేంద్రాల పరిస్థితులను ఈ కేంద్రంలోని సిబ్బంది జిల్లా ఎన్నికల యంత్రాంగానికి గంటగంటకు అప్‌డేట్ అందజేస్తారు. పోలింగ్ కేంద్రాలలో లోపల మాత్రమే కాకుండా, బయట జరిగే సంఘటనలను కూడా వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తారు. పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు 200 మంది సిబ్బంది పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తిస్తారు. ఏదైనా సంఘటన చోటు చేసుకుంటే, తక్షణమే సంబంధిత పోలింగ్ కేంద్రం అధికారికి, పోలీసులకు ముందస్తు చర్యల కోసం సమాచారం అందించనున్నారు.
అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం : రోనాల్డ్ రోస్
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి లైటింగ్, టాయిలెట్ సౌకర్యంతో పాటు భోజనం, జ్యూస్, మజ్జిగ తదితర వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా షామియానా, డ్రింకింగ్ వాటర్, ఓటర్ అసిస్టెంట్ బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారన్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంటాయన్నారు. ఒకవేళ పోలింగ్ సిబ్బందికి అనారోగ్య సమస్యలు వస్తే 108 అంబులెన్స్‌కు, జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూంకు తెలియజేయాలన్నారు.




