వారిద్దరికీ చావో రేవో
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, సీఎం రేవంత్‌కు జీవన్మరణ సమస్యలా లోక్‌సభ ఎన్నికలు
ఫలితాలపైనే వారి రాజకీయ భవిష్యత్తు
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): ఎన్నికల్లో పోటీపడిన ప్రతి అభ్యర్థికీ ఎన్నికలు ముగిసిన తరువాత గెలుపా.. ఓటమా అనే దానితోనే ఆగిపోతుంది. కానీ ఇద్దరి పరిస్థితి ప్రత్యేకం. ఈ ఎన్నికల్లో వారు పోటీచేయలేదు. అయినా ఆ నేతలకు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు చావో.. రేవో అన్నట్టుగా మారాయి. పైగా ఆ ఇద్దరు నేతలు సామాన్యులు కాదు.. అసామాన్యులు. ఆ ఇద్దరు రెండు పార్టీలకు రథసారధులు. ఒకరు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. మరొ కరు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి. లోక్‌సభ ఎన్నికలు వారికి జీవన్మరణ సమస్యలా పరిణమించాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇద్దరూ ఇద్దరే..
వాస్తవానికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించి.. రాష్ట్ర ప్రజలం దరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి.. దేశంలోని మెజారిటీ పార్టీలను ఒప్పించి.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వక తప్పని పరిస్థితిని కల్పించిన నేత కేసీఆర్. తెలంగాణ కోసమే ఆయన ప్రత్యేకంగా తెలం గాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)ని స్థాపించారు. దాదాపు ౧౪ ఏండ్లు పోరాడి తెలం గాణ ప్రజల మద్దతుతో లక్ష్యాన్ని చేరుకున్నారు.
అదే ప్రజల మద్దతుతో రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి పదేండ్లపాటు రాష్ట్రాన్ని నడిపారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చెందారు. దీంతో కేసీఆర్ శకం ముగిసిందనే ప్రచారం మొదలయ్యింది. ఇదే సందర్భంలో ఏబీవీపీ నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన రేవంత్‌రెడ్డి... ఒక్కో అడుగు వేసుకుంటూ జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా తనదైన ముద్ర వేస్తూ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేజిక్కించుకుని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఛాలెంజ్ చేసి మరీ గెలుపొందారు.
సీఎంగా రేవంత్‌రెడ్డి తనదైన మార్గంలో పయనిస్తున్నారు. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న ఇద్దరు నేతలకు.. ఈ లోక్‌సభ ఎన్నికలు చావో రేవోగా మారాయి. ఈ ఇద్దరు ముఖ్యనేతల రాజకీయ భవిష్యత్తును లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిర్ణయించనున్నాయి. భవిష్యత్తులో వారి పార్టీలు.. వారేం చేయాలనేది ప్రస్తుత ఎన్నికల్లో వచ్చే ఫలితాలే శాసించనున్నాయి.
పార్టీ.. పదవి.. భుజకీర్తులేనా..
కేసీఆర్‌ను గుర్తుపట్టని వ్యక్తి మన రాష్ట్రంలోనే లేడు. అలాంటి నేతకు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు ఛాలెంజ్‌గా మారాయి. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్‌ఎస్ పార్టీపై, ఆ పార్టీ అధినేత కేసీఆర్ భవిష్యత్తుపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక రాజకీ యాలకు స్వస్తిచెప్పి ఫాంహౌజ్‌కే పరిమితం అవుతారని కాంగ్రెస్ నేతలు జోస్యం చెప్పారు. అలాగే బీఆర్‌ఎస్ నుంచి భారీగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరనున్నారని.. అందుకు సాక్ష్యంగా ఇద్దరు, ముగ్గురిని చేర్చుకున్న కాంగ్రెస్ నేతలు.. ఇకపై బీఆర్‌ఎస్ తుడిచిపెట్టుకు పోతుందని ప్రకటనలు చేశారు.
అయితే అనూహ్యంగా కేసీఆర్ ప్రచారాస్త్రాలను భుజంపై వేసుకుని ప్రజలను కదిలించారు. వారి నుంచి మంచి స్పందనను రాబట్టారు. అయితే ఇవన్నీ ఓట్లు రాల్చుతాయా.. ఎన్ని సీట్లు వస్తాయనేది ఇప్పుడు ముఖ్య అంశంగా మారింది. కనీసం ౩టైన౪ సీట్లునా రాకపోతే.. భవిష్యత్తులో రాజకీయంగా ముందుకు సాగలేని పరిస్థితి. అదీగాక.. ఎన్నికలు ముగిసిన వెంటనే భారీగా ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం కూడా ఉండనే ఉంది. ఒకవేళ అదే జరిగితే బీఆర్‌ఎస్ పార్టీ భవిష్యత్తుకు, కేసీఆర్ రాజకీయ భవిష్యత్తుకు కూడా పెద్ద దెబ్బలాగే చెప్పవచ్చు.
అలాంటిదే జరిగి రాజకీయంగా కోలుకోలేని పరిస్థితి తలెత్తితే.. ఆయనకు రాజకీయ సన్యాసం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లను దక్కించుకోవడంతో పాటు.. ఫరవాలేదనే స్థాయిలో సీట్లను కూడా గెలుచుకోవడం ఇప్పుడు కేసీఆర్‌కు తప్పనిసరి. అలా అయితేనే భవిష్యత్తులో దీటుగా పోటీపడే అవకాశమూ.. పదవిని అధిష్టించే పరిస్థితులు కూడా దక్కవచ్చు. లేకపోతే అంతే. పదవులు, పార్టీ కూడా భుజకీర్తులుగా మారుతాయి. అందుకే లోక్‌సభ ఎన్నికలు బీఆర్‌ఎస్ అధినేతకు చావో.. రేవోలాగా పరిణమించాయి. అందుకే తన ప్రచారాస్త్రాలతో కేసీఆర్ చమటోడ్చారు. ప్రజలను మరోసారి ఆకట్టుకుంటూ ముందుకు సాగారు.
పదవికి.. ప్రభుత్వానికి ప్రమాదం
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది కూడా అదే పరిస్థితి. లోక్‌సభ ఎన్నికలు అయిపోగానే.. ప్రభుత్వం పడిపోతుందని.. లేదు.. రేవంత్‌రెడ్డే పార్టీ మారుతారంటూ.. ఇటు బీజేపీ, అటు బీఆర్‌ఎస్ నేతలు బలంగా చెప్తున్నారు. పైగా పాతిక మందికిపైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని కేసీఆరే స్వయంగా చెప్పడంతో.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై అనుమానాలు మొదలయ్యాయి.
ఒకవేళ ఈ రెండింటిలో ఏది జరిగినా.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. అయితే పదేండ్లపాటు ఆయనే సీఎం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు గట్టిగా చెప్తున్నారు. అయితే ఇదంతా లోక్‌సభ సీట్లు ఎన్ని వస్తాయనేదానిపైనే ఆధారపడి ఉందనేది వాస్తవం. అనూహ్యంగా వ్యతిరేక ఫలితాలు వస్తే మాత్రం అటు ప్రభుత్వంతోపాటు.. ఇటు రేవంత్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తు కూడా డోలాయమానంంలో పడుతుంది.
రెండువైపులా బీజేపీ, బీఆర్‌ఎస్ కాచుక్కూ ర్చున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు చెప్పిందే నిజమవుతుంది. అలా కాకుం డా ఉండాలంటే కచ్చితంగా సగం కంటే ఎక్కువ సీట్లను చేజిక్కించుకోవాల్సిందే. అప్పుడే ప్రతిపక్షాల నోళ్లు మూతపడతాయి. నాయకుడిగా అటు రేవంత్, ఇటు ప్రభుత్వం మరింత బలపడుతుంది. అందుకే రేవంత్‌రెడ్డి అంతగా చెమటోడ్చుతున్నారు. రాష్ట్రమంతా కలియదిరిగి ఒకేఒక్కడుగా ప్రచారం చేశారు.




