15 April, 2026 | 12:45 AM

చలాన్ల మాఫీ అంతా ఉత్తిదే

05-12-2025 12:00 AM
  1. సోషల్ మీడియా ప్రచారం నమ్మొద్దు 
  2. వైరల్ వీడియోలు, మెసేజ్‌లు చూసి మోసపోవద్దు 
  3. స్పందించిన రాచకొండ ట్రాఫిక్ పోలీసులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 4 (విజయక్రాంతి): పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం భారీ రాయితీలు ఇస్తోందంటూ, 100 శాతం మాఫీ వర్తిస్తుందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పోలీసులు స్పందించా రు. ఇదంతా పచ్చి అబద్ధమని, వాహనదారులు ఇలాంటి వదంతులను నమ్మవద్దని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పాత వీడియోలు, ఫేక్ మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయని, వాటిని చూసి ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ చలాన్ల మాఫీకి సంబంధించి పోలీ సు శాఖ నుంచి గానీ, లోక్ అదాలత్ నుంచి గానీ ఎలాంటి నోటిఫికేషన్ వెలువడలేదు. 100 శాతం మాఫీ అనేది పూర్తిగా అవాస్తవం అని అధికారులు తేల్చిచెప్పారు.

తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసేవారిపై నిఘా ఉంచామని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారిక ప్రకటనలు వచ్చే వరకు వాహనదారులు ఎలాంటి పుకార్లను విశ్వసించవద్దని కోరారు.