calender_icon.png 17 December, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ నెల 19న ఎల్లారెడ్డి బంద్

17-12-2025 04:10:24 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): సోమార్పేట్ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులపై 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఈ నెల 19శుక్రవారం ఎల్లారెడ్డి బందుకు పిలుపునిస్తున్నట్లు అఖిలపక్షం నాయకులు తెలిపారు. బుధవారం ఎల్లారెడ్డి శివాజీ చౌరస్తాలో అఖిలపక్షం నాయకులు, సోమార్పేట్ గ్రామస్తులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల ఫలితాల అనంతరం ఎల్లారెడ్డి మండలం, సోమార్పేట్ గ్రామానికి చెందిన సర్పంచ్ కుర్మ పాపయ్య తమ్ముడు కురుమ చిరంజీవి తన ప్రత్యర్థి వర్గం, ఓటమిపాలైన బిట్ల బాలరాజు తో పాటు వారి కుటుంబ సభ్యులపై ట్రాక్టర్ తో ఢీ కొట్టిన సంఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మరో ముగ్గురు గాయలతో చికిత్స పొందుతున్నట్లు వారు తెలిపారు. పాపయ్య తమ్ముడు కురుమ చిరంజీవి ఉద్దేశపూర్వకంగానే బిట్ల బాలరాజు కుటుంబ సభ్యులు వారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ట్రాక్టర్ తో ఢీ కొట్టి హత్యాయత్నం చేశాడని తెలిపారు..

నిందితులందరిపై చర్యలు తీసుకోవాలి

ఈ సంఘటనకు బాధ్యులైన కుర్మ చిరంజీవిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్ చేశారని, తమ ఫిర్యాదులో పేర్కొన్నటువంటి కురుమ సాయిబాబా, కురుమ పాపయ్య తో పాటు ఇతరులపై కేసులు నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ట్రాక్టర్ తో ఢీ కొట్టి హత్యాయత్నం కి పాల్పడేలా ప్రేరేపించిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు.

వీరిపై 24 గంటల్లో పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఈనెల 19 శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణ బందుకు పిలుపునియ్యనున్నట్లు అఖిలపక్షం నాయకులు తెలిపారు. నిందితులను రిమాండ్ కు తరలించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు జనార్దన్ రెడ్డి, ఆదిమూలం సతీష్, పెద్ద ఎడ్ల నర్సింలు, చిరంజీవులు, పృథ్వీరాజ్, బర్కత్, అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.