17-12-2025 04:13:31 PM
హనుమకొండ,(విజయక్రాంతి): శాయంపేట, దామెర మండల కేంద్రాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం పరిశీలించారు. శాయంపేట మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించి పోలింగ్ సరళి, ఓటింగ్ శాతం గురించి ఎన్నికల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా దామెర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి వివరాలను ఎన్నికల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఆయా మండలాల్లో రెండువేలకుపైగా ఓటర్లు ఉన్న పెద్ద గ్రామపంచాయతీలు ఉన్నచోట్ల నాలుగు టేబుల్స్ వేసి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి కౌంటింగ్ కేంద్రాలలో ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియను అధికారులు పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ కు సంబందించిన అంశాలపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిఆర్డిఓ మేన శ్రీను, పరకాల ఆర్డిఓ డాక్టర్ కన్నం నారాయణ, మండల ప్రత్యేకాధికారులు జయంతి, బాలరాజు, ఎంపీడీవోలు ఫణి చంద్ర, కల్పన, తహసిల్దార్లు ప్రవీణ్ కుమార్, జ్యోతి వరలక్ష్మి దేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.