05-08-2025 01:39:03 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 4 (విజయక్రాంతి): తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తన ప్రధాన ఆర్థిక వనరులను కాపాడుకునేందుకు టెక్నాలజీని ఆయుధంగా ప్రయోగించనుంది. క్షేత్రస్థాయి లో సిబ్బంది చేతివాటానికి, అవినీతికి చెక్ పెట్టి, ఖజానాకు పారదర్శకంగా ఆదాయం చేరేలా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను పటి ష్టం చేయనుంది.
ఇందులో భాగంగా టెక్ దిగ్గజం గూగుల్‌తో జీహెచ్‌ఎంసీ కీలక ఒ ప్పందం కుదుర్చుకుంది. కమిషనర్ ఆర్వీ కర్ణ న్ ఆధ్వర్యంలో సోమవారం గూగుల్ బృం దంతో జరిగిన సమావేశం ఫలప్రదం కావడంతో, ఇకపై చెల్లింపులన్నీ యూపీఐ ఆధారంగా స్వీకరించేందుకు రంగం సిద్ధమైంది.
సిబ్బంది చేతివాటానికి చెక్
జీహెచ్‌ఎంసీలో డిజిటల్ చెల్లింపుల వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతే. ప్రజల నుంచి నగదు రూపంలో వసూలు చేసిన పన్నులను కొందరు బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్ట ర్లు వెంటనే ఖజానాలో జమ చేయకుండా తమ సొంత అవసరాలకు వాడుకుని నెలాఖరులో జమ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.
ఈ సొమ్ముతో కొందరు భూములు, ఇళ్లు కొనుగోలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పేటీఎం, మై జీహెఎంసీ యాప్ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు జరుగుతున్నా, వాట్సాప్, గూగుల్ పే వంటివి అందుబాటులోకి వస్తే సిబ్బంది ప్రమేయం తగ్గి, కలెక్షన్ మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
వాట్సాప్‌తో రిమైండర్లు: బకాయిల రిమైండర్లు, చెల్లింపు గడువులు, ఓటీపీల కోసం జీహెఎంసీ ఏటా దాదాపు 20 లక్షల ఎస్‌ఎంఎస్‌లు పంపుతోంది. ప్రతి వెయ్యి ఎస్‌ఎంఎస్‌లకు రూ.52 చొప్పున అవుతున్న భారీ ఖర్చు, వాట్సాప్ బిజినెస్ ఖాతా ద్వారా ఆదా అవుతుంది.
‘పే నౌ’ ఆప్షన్: బకాయిదారులకు రిమైండర్ పంపడంతో పాటు, అక్కడే “పే నౌ” ఆప్షన్ ఇవ్వడం ద్వారా కేవలం క్షణాల్లోనే పన్నులు చెల్లించే వెసులుబాటు కలుగుతుంది.
ఎస్టేట్ విభాగంపై ప్రత్యేక దృష్టి
వసూళ్లలో అక్రమాలకు కేరాఫ్ అ డ్రస్‌గా మారిన ఎస్టేట్ విభాగంలో కూ డా పూర్తిస్థాయిలో డిజిటల్ వసూళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ విభాగంలో పేరుకుపోయిన సుమారు రూ.3 కోట్ల బకాయిలను కొత్త విధానంలో రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1400 అద్దె ఆస్తులకు నోటీసులు జారీ చేయగా, మరో 945 మాలిగలను అద్దె కు ఇచ్చేందుకు త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు.
ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్సులు, భవన నిర్మాణ అనుమతుల ఫీజులన్నీ డిజిటల్ బాట పట్టడం ద్వారా, ఒకవైపు ప్రజలకు చెల్లింపులు సులభతరం అవుతాయని, మరోవైపు బల్దియా ఖజానాకు గండి కొడుతున్న అక్రమాలకు శాశ్వతంగా అడ్డుకట్ట పడుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.