05-08-2025 01:32:15 AM
కాళేశ్వరం కమిషన్ నివేదికను ఆమోదించిన రాష్ట్ర క్యాబినెట్
ఓవర్ టు అసెంబ్లీ
శాసనసభలో చర్చించిన తర్వాత చర్యలు
బరాజ్‌ల నిర్మాణంలో అవినీతి
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. విచారణకు సంబంధించిన వివరాలను కమిషన్ విశ్లేషణాత్మకంగా 665 పేజీల నివేదికను పొందుపరిచిందని సీఎం వెల్లడించారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికను శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెడతామని ప్రకటించారు.
ఈ కమిషన్ నివేదికపై అన్ని పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించేందుకు అవకాశం ఇవ్వాలని క్యాబినెట్‌లో నిర్ణయించినట్టు సీఎం చెప్పారు. మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సచివాలయంలో మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. కమిషన్ నివేదికపై అందరి అభిప్రాయం తీసుకున్నాక భవిష్యత్ కార్యాచరణతో పాటు కమిషన్ సూచనలను అమలు చేసేందుకు ముందుకెళ్తామని, ఎవరిపైనా రాజకీయ కక్ష సాధింపుగానీ, వ్యక్తిగత ద్వేషం గానీ ఉండదని స్పష్టం చేశారు.
మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్లలోనూ లోపాలున్నాయని ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఇచ్చిందని సీఎం గుర్తు చేశారు. ‘ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ రీడిజైనింగ్ పేరుతో మార్పులు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు నిర్మించారు. అవినీతికి పాల్పడుతూ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు.. నిర్మాణం జరిగిన మూడేళ్లల్లోనే మేడిగడ్డ కుంగి, అన్నారం పగిలింది. ప్రణాళిక, నిర్మాణ, నిర్వహణ లోపాలు ఉన్నాయని ఆనాడు కేసీఆర్‌కు నిపుణులు నివేదిక అందించారు.
రూ.లక్ష కోట్లుపెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోవడంపై.. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ చేపడతామని ప్రజలకు ఆనా డు మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం 2024, మార్చి 14న అపార అనుభవం ఉన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ చైర్మన్‌గా జ్యుడీషియల్ ఎంక్వురై కమిషన్‌ను నియమించాం. కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో సహా అధికారులు, నిపుణులతో చర్చించాక.. 16 నెలల తర్వాత 2025, జూలై, 31న 665 పేజీల నివేదికను పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అందించింది.
ఆ నివేదిక సారాంశాన్ని సంక్షిప్తంగా తయారు చేసి క్యాబినెట్‌కు అందించాలని ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశాం. ఊరు, పేరు మార్చి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం కూలిపోయింది. రాబోయే రోజుల్లో అసెంబ్లీలో ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలను తీసుకొని ముందుకెళ్తాం. అంతకు ముందే సభ్యులకు నివేదిక కాపీని అందజేస్తాం. బీఆర్‌ఎస్ పార్టీ ఈ కమిషన్ రిపోర్ట్‌ను తప్పుపట్టడం సహజమే. ఈ నివేదిక వారికి అనుకూలంగా ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా మాట్లాడటం వారికి అలవాటే.
కమిషన్ నివేదికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు. ఈ నివేదిక రాజకీయ పార్టీనో.. ప్రభుత్వం ఇచ్చిన నివేదికనో కాదు.. ఇండిపెండెంట్ జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చిన నివేదిక. నివేదిక సారాంశం, అందరి సూచనల ప్రకారమే చర్యలు ఉంటాయి. ఎవరు ఏ రకంగా మాట్లాడిన వారి విజ్ఞతకే వదిలేస్తాం. తప్పులను ఒప్పుకోకుండా మొండి వాదన చేసే వారిని ప్రజలే మళ్లీ తగిన విధంగా బుద్ధి చెబుతారు.
రాజకీయ కక్షపూరిత చర్యలకు మేం పాల్పడం. నివేదికపై అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును అప్పటి కాంగ్రెస్ ప్రభు త్వం, నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. పీసీ ఘోష్ కమిషన్‌పై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా, కవిత పీసీ ఘోష్ కమిషన్‌కే నివేదిక ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు.
మూడు బరాజ్‌ల దుస్థితికి కేసీఆరే కారణం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై క్యాబినెట్‌లో చర్చ జరిగిందని మాజీమంత్రి, ఎంపీ ఈటల రాజేందర్ పీసీఘోష్ కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. మూడు బరాజ్‌ల దుస్థితికి కేసీఆరే కారణమని పీసీ ఘోష్ కమిషన్ నివేదిక స్పష్టం చేస్తోందన్నారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల నిర్మాణం కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావుల నిర్ణయమేనని, క్యాబినెట్ ఆమోదం లేదని పీసీ ఘోష్ కమిషన్ స్పష్టంగా చెప్పిందన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కాపాడటంలో నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ విఫలమయ్యారని భట్టి ఆరోపించారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు సంబంధించి బ్యాక్ వాటర్ స్టడీస్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ వంటి అధ్యయనాలు జరగలేదని, క్షేత్రస్థాయిలో అధ్యయనాలు జరగకుండానే డిజైన్లు తయారు చేశారని డిప్యూటీ సీఎం వివరించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించిన తుమ్మడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదనడం వాస్తవం కాదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై వడ్డీల భారం మోపారు
తెలంగాణకు లైఫ్‌లైన్‌గా భావించిన ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రస్తుతం పనిచేయకుండా పోయింది. రూ.84 వేల కోట్ల నిధులను అధిక వడ్డీకి తీసుకొచ్చి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. వాస్తవానికి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు రూ. 38 వేల కోట్ల అంచనా, 16.5 లక్షల ఎకరాల ఆయకట్టుతో ప్రారంభమైనప్పటికీ సరైన కారణాలు లేకుండానే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చింది.
మేడిగడ్డ కుంగిపోయినప్పుడు బీఆర్ ఎస్ పార్టీనే అధికారంలో ఉంది. ప్రాజెక్టు కుంగిపోవడానికి గల కారణాలపై ఎన్డీఎస్‌ఏ రిపోర్టు ఇచ్చింది. ఫైనల్ రిపోర్టులో కూడా ప్రాజెక్టు ప్లానిం గ్, డిజైన్, నిర్మాణం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో లోపాలున్నాయని వెల్లడించింది.