05-08-2025 12:59:58 AM
రెండు వేలకుపైగా కంపెనీలు హైదరాబాద్‌లోనే..
ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిలో 40 శాతం తెలంగాణ నుంచే ఎలీ లిల్లీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
హాజరైన ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): భారతదేశ లైఫ్ సెన్సైస్ కంపెనీ లకు రాజధానిగా హైదరాబాద్ ఇప్పటికే గుర్తింపు పొందిందని, తెలంగాణను ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలకు నంబర్ వన్ హబ్‌గా తీర్చిది ద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే 2000కు పైగా లైఫ్ సెన్సైస్ కంపెనీలు ఇక్కడ ఉన్నాయని, అందులో 200కి పైగా ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ లు హైదరాబాద్ నగరం నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.
భారత్‌లో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిలో సుమారు 40 శాతం తెలంగాణలోనే జరుగుతోందన్నారు. అంతేకాకుం డా ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్రతి 3 టీకాలలో ఒకటి హైదరాబాద్‌లో అభివృద్ధి చేయడం లేదా తయారవుతుండటం తమకు గర్వకారణమన్నారు. సోమవారం అమెరికాకు చెందిన ప్రము ఖ ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యా లీ.. భారతదేశంలోని అతిపెద్ద లైఫ్ సెన్సైస్ పరిశోధన- అభివృద్ధి సముదాయంగా నిలిచిందని సీఎం చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఈ రోజు హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి గ్లోబల్ జీసీసీ రాజధానిగా ఎదిగిందన్నారు. తమ ప్రభుత్వ చిత్తశుద్ధి, దృ ష్టికోణం, కృషి ఫలితంగానే ఇది సాధ్యమైంద ని, ఇది తెలంగాణ రైజింగ్-2047 దిశగా తా ము వేసిన మరోక ముఖ్యమైన అడుగన్నారు.
తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమిగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుదంని సీఎం చెప్పారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ, ఇన్నొవేషన్ సెంటర్, ప్రపంచవ్యాప్తంగా రోగులకు పరిష్కారాల కోసం పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఎలీ లిల్లీ సంస్థను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడమంటే ఈ నగరం ఘనతను మీరు ప్రపంచానికి చాటి చెప్పినట్లేనన్నారు.
హైదరాబాద్ నగరంలో టాలెంట్ ఉంది, లీడర్‌షిప్ ఉంది, విజన్ ఉంది, మంచి పాలసీ ఉంది, మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అందుకే ఎలీ లిల్లీ లాంటి గ్లోబల్ లీడర్‌కు ఇది అనుకూలమైన కేంద్రంగా మారిందన్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ సంస్థల కోసం హైదరాబాద్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రపంచ గమ్యస్థానంగా మారిందని తెలిపారు.
మధుమేహం, ఆంకాలజీ, ఇమ్యునాలజీ, న్యూరోసైన్స్ రంగాల్లో ఎలీ లిల్లీ సంస్థ కృషి ఒక గేమ్-చేంజర్‌గా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పారదర్శకత, అభివృద్ధి, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం కల్పిస్తామన్నారు. హైదరాబాద్ నుంచి గ్లోబల్ హెల్త్‌కేర్ భవిష్యత్తును తీర్చిదిద్దాలని కంపెనీ నిర్వాహకులకు సూచించారు.
మనమందరం కలిసి కొత్త ఆవిష్కరణలు చేద్దాం, ప్రజల జీవితాలను మారుద్దామని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణపై నిరంతర నమ్మకం ఉంచి, అండగా నిలిచి అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నందుకు పారిశ్రామిక వేత్తలు, -పెట్టుబడిదారులు, ప్రపంచ శ్రేణి కార్పొరేషన్లకు, కంపెనీలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు.
త్వరలోనే కొత్త లైఫ్ సెన్సైస్ పాలసీ: మంత్రి శ్రీధర్‌బాబు
2024--25లో హైదరాబాద్‌లో 70 జీసీసీ(గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)లు ప్రారంభమ య్యాయని, ఇది దేశంలోనే ఒక రికార్డని, తమకు ఇతర రాష్ట్రాలకు పోలికే లేదని, మాకు మేమే పోటీ అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. 2025--26లో 100 జేసీ సీలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ దిశగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
మెడ్ టెక్ రంగంలో తెలంగాణ అవకాశాల గని అని, లైఫ్ సెన్సైస్, డిజిటల్ హెల్త్, ఏఐ ఇన్ హెల్త్ కేర్, తెలంగాణ డేటా ఎక్స్‌ఛేంజ్ తో ఇండస్ట్రీ పాలసీని అనుసంధానం చేసిన ఏకైక రాష్ర్టం తెలం గాణ మత్రమే అన్నారు. ఏటా 3 లక్షల మంది స్టెమ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారని, జీనోమ్ వ్యాలీ, మెడ్ టెక్ పార్క్ లాంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదు పాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
త్వరలోనే కొత్త లైఫ్ సెన్సైస్ పాలసీని అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణను మెడ్ టెక్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు చిత్త శుద్ధితో కృషి చేస్తున్నామని, ఇప్పటికే మన దగ్గర దిగ్గజ సంస్థలు నోవార్టిస్, ఆస్ట్రజేనేకా, మెడ్ ట్రానిక్ లాంటివి ఎన్నో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని, ఈ జాబితాలో ఎలీ లిల్లీ కూడా చేరడంతో మెడ్ టెక్ రంగంలో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అవుతుందన్నారు.
లైఫ్ సెన్సైస్ రంగంలో ఆర్ అండ్ డీ ల్యాబ్స్, మాన్యుఫాక్చరింగ్ స్పేస్, మెడ్ టెక్ పార్కుల కోసం తెలంగాణలో 1.1 కోట్ల చదరపు అడుగుల స్పేస్‌ను సంబంధిత సంస్థలు లీజుకు తీసుకున్నాయని, ఇది దేశంలోనే అత్యధికమన్నారు. మెడ్ టెక్ రంగంలో దేశానికి దిక్సూచిగా మారిన తెలంగాణ ప్రగతికి నిదర్శనమన్నారు.
ఏఐ లీడ్ డ్రగ్ డిస్కవరీ, క్లౌడ్ బేస్డ్ క్లినికల్ ప్లాట్ఫామ్స్, ఆటోమేటెడ్ రెగ్యులేటరీ సిస్టమ్స్ తదితర అంశాలపై దృష్టి సారించనున్న ఎలీ లిల్లీ జీసీసీ మెడ్ టెక్ రంగంలో అద్భుతాలను ఆవిష్కృస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని, ‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వామ్యం కావాలని అంతర్జాతీయ, జాతీయ సంస్థలకు ఆయన ఆహ్వానం పలికారు.