05-08-2025 01:36:07 AM
తృటిలో తప్పిన విమాన ప్రమాదం
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నాకు హాజరయ్యేందుకు పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. పీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యే క రైలులో సోమవారం చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి వందలాది మంది కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవ హారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ప్రయాణించారు.
వీరితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలు కూడా ఆలేరు వరకు రైలులో వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడు తూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఉద్యమం తరహాలోనే ఉద్యమిస్తామని అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ‘చలో ఢిల్లీ’ కార్యక్రామానికి బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు కూడా తమతో పాటు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామని అన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమిద్దామని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. బీసీ కోటాలో పెంపుపై బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అందుకే ముస్లింలను తెరపైకి తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యబద్ధంగా బీసీ రిజర్వేషన్లపై చట్టాన్ని చేసి గవర్నర్ ఆమోదానికి ఆర్డినెన్స్ పంపామని.. కానీ, విపక్షాలు తమది డ్రామా అంటూ కామెంట్స్ చేయడం శోచనీయమన్నారు. బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ చేస్తున్న పోరాటంలో అన్ని పార్టీలు పాల్గొని మద్దతు ఇవ్వాలని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
తృటిలో తప్పిన విమాన ప్రమాదం
మరోవైపు కాంగ్రెస్ నేతలకు తృటిలో వి మాన ప్రమాదం తప్పింది. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు 6న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నాకు హాజరయ్యేందుకు సోమవారం శంషాబాద్ ఏయిర్‌పోర్టు నుంచి 6 ఈ 6049 నెంబర్ గల ఇండిగో విమానంలో మధ్యాహ్నాం 1:30 గంటలకు ఢిల్లీకి బయల్దేరారు.
మధ్యాహ్నం 3:30 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉండగా.. విమానం ముందు టైర్లు ఓపెన్ కాకపోవడంతో వెంటనే ఫైలెట్ తిరిగి పైకి తీసుకెళ్లి 20 నిమిషాల వరకు గాల్లోనే తిప్పారు. ఆ తర్వాత సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవ్వగా.. విమానంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌తో పాటు కాంగ్రెస్ నేతలు 15 మంది వరకు ఉన్నారు.