05-08-2025 01:56:38 AM
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 700 పేజీల నివేదిక రాష్ర్ట రాజకీయాలను ఊపేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో వ్యవస్థపరమైన వైఫల్యాలు, అవినీతిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, అప్పుడు బాధ్యత వహించిన ముఖ్య నాయకులు, ఉన్నత అధికారులు, నిర్మాణ సంస్థల పాత్రలను స్పష్టంగా వెల్లడించినట్లుగా సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన ఐఏఎస్ అధికారు కమిటీ నివేదిక తెలియచేస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కమిటీ తమ అధ్యయనంలో ఎన్నో అవకతవకలు, సాంకేతిక లోపాలు, వ్యక్తిగత నిర్ణయాలు, రాజకీ య దౌర్జన్యం స్పష్టంగా ఉన్నాయని సూచించించింది. ఇందుకు ప్రధాన కారణంగా అప్పటి సీఎం కేసీఆర్, అప్పటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు,
అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు, ఈఎన్‌సీ లు, ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థల వైఖరే కారణంగా స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తర్వాతి అడుగులు ఎటువైపు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఆర్థిక అవకతవకలు, పద్ధతుల విరుద్ధంగా వ్యవహరించిన నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాతి చర్యల్లో భాగంగా సీఐడీకి కేసును అప్పగించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇప్పటికే చాలా ఆలస్యమైంది...
అయితే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేసే అవకాశాలు కూడా కొట్టివేయలేమని పలువురు ఇంజనీరింగ్ నిపుణులు అంటున్నారు. సిట్ లేదా సీఐడీకి కేసును అప్పగిస్తే కేసీఆర్, హరీశ్‌రావు, ఈటలతో పాటు కీలకమైన అధికారులను కూడా అరెస్టు చేసే అవ కాశం ఉందని సాగునీటి రంగ నిపుణులు భావిస్తున్నారు. కాళేశ్వరం అక్రమాల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ఇప్పటికే చాలా ఆలస్యమైందని,
ఇంకా తాత్సారం చేస్తే ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వసనీయత దెబ్బతినే అవకాశం కూడా ఉంటుం దని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్లు కాళేశ్వరం కమిషన్ విచా రణ నివేదిక అందలేదని చెప్పేందుకు సర్కారుకు ఓ అవకాశం లభించిందని, ఇప్పుడు ఆ నివేదిక వచ్చినందున ఇకపై చర్యలకు ఆలస్యమైతే ప్రభుత్వం అవినీతిపై మెతకవైఖరి అవలంబించినట్లుగా ప్రజలు భావించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
నీటి లభ్యత లేని ప్రాంతంలో బ్యారేజీలు నిర్మించారని, నిపుణుల నివేదికలను పక్కనపెట్టారని కమిషన్ పేర్కొన్న నేపథ్యంలో అన్ని వేళ్లు కేసీఆర్, హరీశ్‌రావు వైపే చూపిస్తున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు స్వయంగా తీసుకున్న నిర్ణయాల ని, ఆ నిర్ణయాలే బ్యారేజీల నష్టాలకు మూలమని నివేదిక స్పష్టం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.