05-08-2025 01:55:02 AM
- ప్రజల్లోకి వెళ్లి ప్రాజెక్ట్ ప్రయోజనాలను వివరించాలి
- ఫాంహౌస్‌లో నేతల భేటీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ముఖ్యలతో సమావేశమయ్యారు. కమిషన్ నివేదికపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరంపై విచారణకు వేసింది కాదని, అది కాంగ్రెస్ కమిషన్ అని ఆయన మండిపడ్డట్టు సమాచారం.
ఈ వ్యవహారం లో కాంగ్రెస్ కుట్రలను గమనిస్తూ ఎప్పటికప్పుడు తిప్పికొట్టేలా ప్రజలకు వివరించాలని కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది. కాళేశ్వరంపై జరుగుతున్న చర్చలో బీఆర్‌ఎస్‌కు వచ్చే నష్టమేమీ ఉండదని, కాళేశ్వరం మీద, పార్టీ మీద, పార్టీ నేతలపైన జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎదుర్కోవాలని, కమిషన్ మీద ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూద్దామని కేసీఆర్ అన్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం కోసమే ఈ వ్యవహారమంతా జరుగుతుందని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజేంటేషన్
కాళేశ్వరం కమిషన్ నివేదికతో తమపై వస్తున్న విమర్శలు, ఆరోపణలకు కౌంటర్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. దీనిలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో మాజీమంత్రి హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇవ్వనున్నారు. దీన్ని తెలంగాణలోని అన్ని బీఆర్‌ఎస్ కార్యాలయాల్లో ప్రదర్శించేందుకు పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లను సైతం ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. కాళేశ్వరం నివేదక అంశాలు, ప్రభుత్వం నుంచి వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పేలా ఈ పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.