05-08-2025 01:13:15 AM
ఎస్‌కే జోషి, స్మితా సబర్వాల్ నిర్లక్ష్యమూ ఉంది
పూర్తిగా తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారు
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): మేడిగడ్డ బరాజ్ కూలిన పాపం ముమ్మాటికీ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులదేనని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కూలిపోయిన మేడిగడ్డ ఉందతంపై అధికారంలోకి వస్తే న్యాయ విచారణ జరిపిస్తామని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు సమ గ్ర న్యాయ విచారణ జరిపించామన్నారు.
సోమవారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశం అనంతరం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు లైఫ్‌లైన్‌గా భావించిన ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రస్తుతం పనిచేయకుండా పోయిందని, రూ.84 వేల కోట్ల నిధులను అధిక వడ్డీకి తీసుకొచ్చి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందన్నారు. వాస్తవానికి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు రూ.38 వేల కోట్ల అంచనా, 16.5 లక్షల ఎకరాల ఆయకట్టుతో ప్రారంభమైనప్పటికీ సరైన కారణాలు లేకుండానే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చిందని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చే వరకు తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అంచనా వ్యయంలోని 32 శాతమైన రూ.11 వేల కోట్లు వెచ్చించి పను లు చేపట్టారు. అయినా కేసీఆర్ ప్రాజెక్టును వేరే చోటుకు మార్చారు. పవర్ కార్పొరేషన్, ఆర్‌ఈసీ సంస్థలు దేశంలో ఏ ప్రాజెక్టుకు గతంలో రుణాలు ఇవ్వలేదని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ వాళ్లే చేశారు.. నిర్మా ణం వాళ్లే చేశారు.. ప్రారంభం కూడా వాళ్లే చేశారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఎన్నికల సమయం లో తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకు న్నా మని చెప్పారు. అధికారంలోకి రాగానే జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి సమగ్రమైన దర్యాప్తు చేయించామని వెల్లడించారు.
రాజకీయాలకు తావులేకుండా..
కాళేశ్వరం విచారణకు ఎలాంటి రాజకీ య అంశాలు జోడించకుండా న్యాయబ ద్ధం గా విచారణ జరిపించామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రాజెక్టుపై కమిషన్ ఇచ్చిన 650 పేజీల రిపోర్ట్ అందజేసిందన్నారు. 2016లో మేడిగడ్డ ప్రాజెక్టు అగ్రిమెంట్ కాగా, 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైంది, 2023లో మేడిగడ్డ బరాజ్ కుంగి పోయిందని చెప్పారు. మేడిగడ్డ కుంగిపోయినప్పుడు బీఆర్‌ఎస్ పార్టీనే అధికారంలో ఉందని, కేసీఆరే సీఎం, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారని వివరించారు.
వారి హయాంలోనే ప్రాజెక్టు కుంగిపోవడానికి గల కారణాలపై ఎన్డీఎస్‌ఏ రిపోర్టు ఇచ్చిందన్నారు. ఫైనల్ రిపోర్టులో కూడా ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో లోపాలున్నాయని వెల్లడించినట్టు గు ర్తు చేశారు. అత్యంత అనుభవమున్న నిపుణులతో హైలెవర్ కమిటీని ఎన్డీఎస్‌ఏ నియ మించి డ్యామ్‌ను పరిశీలించిందన్నారు.
మూడు బరాజ్‌ల ఫౌండేషన్‌లో లోపాలున్నాయని, వాటిలో నీటిని నిల్వ చేసేందుకు అవకాశం లేదని, ఒకవేళ నీటిని నిల్వచేస్తే కూలిపోయే ప్రమాదం ఉందని లిఖిత పూర్వకంగా, స్పష్టంగా ఎన్డీఎస్‌ఏ నివేదికలో వెల్లడించినట్టు గుర్తు చేశారు. ప్రాజెక్టుపై ఆరోపణలు, అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం వంటి అంశాలపై న్యాయ విచారణ చేపట్టేందుకు 2024, మార్చిలో సుప్రీం రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీఘోష్ కమిషన్‌ను కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ కింద తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
అధికారుల నిర్లక్ష్యమూ ఉంది..
అప్పటి సీఎస్ ఎస్‌కే జోషి, ఇంజినీర్ ఇన్ చీఫ్ (నీటిపారుదల) సీ మురళీధర్‌రావు, చీఫ్ ఇంజినీర్ (పీఎస్‌ఎస్ ప్రాజెక్ట్) బీ హరి రాం నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ఉద్దేశపూర్వకంగా బయటపెట్టలేదని, కేసీఆర్, హరీశ్‌రావు ఆదేశాల మేరకు మేడిగడ్డ బరాజ్ నిర్మాణం చేపట్టారని కమిషన్ నివేదికలో పేర్కొన్నదని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శాశ్వతంగా ప్రమాదంలో పెట్టేలా మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం చేశారని కమిషన్ నివేదికలో ఉందన్నారు.
బరాజ్ నిర్మా ణానికి మేడిగడ్డ అనువైన ప్రాంతం కాదని దేశంలోని నిపుణులందరూ హెచ్చరించారని చెప్పారు. బరాజ్ పొడవు, నది వెడల్పులకు తేడా ఉంటే ఒకటి, రెండు బ్లాకుల మధ్యలో మరొక బ్లాకు నిర్మించారు, ఇంతకంటే సాంకేతికంగా మరొక తప్పు ఉండదన్నారు. క్యాబినెట్ ఆమోదం లేకుండానే నాటి సీఎం కేసీఆర్, అప్పటి మంత్రి హరీశ్‌రావు రూ. 2,591 కోట్లతో మేడిగడ్డ నిర్మాణానికి ఆమో దం తెలిపారు.
ఇది చట్ట వ్యతిరేకమని ఘోష్ కమిషన్ వెల్లడించిందన్నారు. అదనపు పనులను కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్ధతిలో ఇచ్చారని, క్యాబినెట్ ముందుకు రావాల్సిన అంశాన్ని కేవలం కేసీఆర్ మాత్రమే నిర్ణయం తీసుకున్నారని తేలిందన్నారు. కాంట్రాక్టర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజాధనానికి నష్టం ఏర్పడిందని నివేదికలో ఉందన్నారు.
పబ్లిసిటీ కోసమే బరాజ్‌లు నింపారు..
బరాజ్‌లకు, డ్యాములకు తేడా ఉంటుందని, బరాజ్‌లు నీటిని నియంత్రిస్తాయని, ని ల్వ చేయవని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్రపంచంలో ఎక్కడైనా బరాజ్‌లలో 2 నుం చి 3 టీఎంసీల కంటే ఎక్కువగా నీరు నిల్వ ఉండకూదన్నారు. బరాజ్‌ల ప్రారంభ సమయంలో ఆనాటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పబ్లిసిటీ కోసం అనుమతించిన దానికంటే ఎక్కువ నీటిని స్టోర్ చేశారని, బరాజ్ లలో పూర్తిస్థాయిలో నీటిమట్టాన్ని నిల్వ చే యడమే కుంగుబాటుకు ప్రధాన కారణమని నివేదికలో ఘోష్ కమిషన్ వెల్లడించిందన్నారు.
ఆనాటి సీఎం కేసీఆర్ ప్రతిచిన్న విష యంలోనూ రాజకీయ జోక్యం చేసుకోవడంతోనే బరాజ్‌లు కూలిపోయాయని కమిషన్ తెలిపినట్టు చెప్పారు. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం మార్పు కేసీఆర్ సొంత నిర్ణయమని తేల్చిన ట్టు పేర్కొన్నారు. ఆనాటి ఇరిగేషన్ శాఖమంత్రి కూడా నిపుణుల కమిటీ రిపోర్టును పరిగణనలోకి తీసుకోలేదన్నారు. నిపుణుల కమిటీ నివేదికను అనుసరించి ఉంటే మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణం జరగకపోయేదని కమిషన్ అభిప్రాయపడిందన్నారు.
మేడిగడ్డకు మార్పు జరిగినప్పుడు ఇరిగేషన్ శాఖ కార్యదర్శి, మంత్రి హరీశ్‌రావు, సీఎం కేసీఆర్ సంతకం చేసి ఆమోదం తెలిపారని, ఆ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం లేకపోవడం చట్టవిరుద్ధమని కమిషన్ ప్రస్తావించిందన్నా రు. ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను చక్కబెట్టడంలో నిబద్ధత, సమగ్రత ప్రదర్శించలేదని కమిషన్ వెల్లడించింద న్నారు. కానీ కమిషన్ విచారణ సందర్భంగా కీలకమైన ఆర్థిక నిర్ణయాల గురించి తమకు తెలియదని సమాధానమిచారని స్పష్టం చేసిందన్నారు.
రుణభారం లక్షకోట్లకు పైనే..
బీఆర్‌ఎస్ హయాంలోనే ప్రాజెక్ట్‌కు రూ. 1.10 లక్షల కోట్లకు పరిపాలనా అనుమతు లు ఇచ్చారు. కానీ కాగ్ రిపోర్టు ప్రకారం రూ.1.47 లక్షల కోట్లు దాటింది. కేఐపీసీఎల్ నుంచి రుణంగా తీసుకున్న రూ.87,449 కోట్లను తిరిగి చెల్లించే క్రమంలో రాష్ట్ర బడ్జెట్‌పై భారం పడిందని మంత్రి ఉత్తమ్ వివ రించారు. 2024, సెప్టెంబర్ వరకు అసలు, వడ్డీ కలిపి రూ.29,737 కోట్లు ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఇంకా అసలు రూ. 64,212 కోట్లు, అదనంగా రూ.41,638 కో ట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.
నిరుపయోగంగా ఉన్న ప్రాజెక్టుపైన ఇప్పటికే ఇం త భారీ మొత్తం ఖర్చు చేసినట్టు స్పష్టమవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సం బంధించి రుణాల చెల్లింపులే లక్ష కోట్లకు పైగా ఉన్నాయన్న విషయం తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కేఐపీసీఎల్ ద్వారా చాలా అవకతవకలు జరిగాయని, దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చే యాలని కమిషన్ ప్రభుత్వానికి సూచించిందన్నారు. ప్రాజెక్టులో అవకతవకలు, అవినీతి, నిధుల దుర్వినియోగం జరిగిందని కమిషన్ నిర్ధారించిందని స్పష్టం చేశారు.
కేసీఆరే బాధ్యుడు..
2024, ఏప్రిల్‌లో కమిషన్ బాధ్యతలు చేపట్టిందని, మాజీ సీఎం కేసీఆర్, అప్పటి మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లతో సహా మొత్తం 119 మందిని కమిషన్ విచారించిందని పేర్కొన్నారు. విచారణలో భాగంగా ఎన్డీఎస్‌ఏ రిపోర్టు, కాగ్ రిపోర్టు, విజిలెన్స్, ఈడీ రిపోర్టులు, ఇరిగేషన్ నిపుణుల రిపోర్టులు, ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు జరిగిన అన్ని క్యాబినెట్ నిర్ణయాలు కమిషన్‌కు అందించినట్టు తెలిపారు.
జస్టిస్ పీసీ ఘోష్ మూడు బరాజ్‌లను పరిశీలించడంతోపాటు నిపుణులతో, నిర్మాణ సంస్థలతో, ఇతరులతోనూ సమావేశం కూడా నిర్వహించారని పేర్కొన్నారు. మూడు బరాజ్‌ల ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యత అప్పటి సీఎం కేసీఆర్‌దేనని, మూడు బరాజ్‌ల దుస్థితికి ఆయన ప్రమేయం, ఆదేశాలే కారణమని కమిషన్ నివేదికలో పొందుపర్చిందని వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ నిర్ణయం ప్రభుత్వానిది కాదని, కేవలం వ్యక్తులది మాత్రమేనని తెలిపినట్టు చెప్పారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడం నిజాయతీతో కూడుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేసిందన్నారు. ఆనాటి కేంద్రమంత్రి ఉమాభారతి ప్రాణహిత ప్రాజెక్టుకు హైడ్రోలజీ మంజూరు చేస్తున్నామని, ఆ ప్రాంతంలో 205 టీఎంసీల లభ్యత ఉందని స్పష్టంగా చెప్పినా రాజకీయ దురుద్దేశంతోనే నీటి లభ్యతపై మరోసారి పరిశీలించాలని అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు తిరిగి లేఖ రాశారని ఆరోపించారు.
తుమ్మిడిహట్టి వద్ద నీటిలభ్యత లేదనేది అబద్ధమని కమిషన్ స్పష్టం చేసినట్టు వివరించారు. మూడు బరాజ్‌ల నిర్మించాలనే నిర్ణయం కేవలం మాజీ సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం వేసిన ఐదుగురు నిపుణుల కమిటీ కూడా మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణం సరైనది కాదని, ప్రాజెక్టు నిర్మాణం చేపడితే నిధులు దుర్వినియోగమవుతాయని సూచించడంతోపాటు మేడిగడ్డకు బదులు వేమనపల్లి వద్ద ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మించాలని సూచించినట్టు కమిషన్ నివేదిక తేలిందన్నారు.
నిపుణుల కమిటీ ఏర్పాటు గురించి అసెంబ్లీలో అప్పటి సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రస్తావించారని, హరీశ్‌రావు కూడా ఈ కమిటీ రిపోర్టు ఇవ్వలేదని ఎక్కడా చెప్పలేదన్నారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని, మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ చెప్పిందనడం పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు.
కారకులెవరో కమిషన్ స్పష్టం చేసింది..
ఎవరి నిర్లక్ష్యం, లోపాల కారణంగా బరాజ్‌లు కూలిపోయాయో కమిషన్ స్పష్టంగా తెలిపిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టుకు 2016లోనే అనుమతి ఇచ్చి పనులు మొదలుపెట్టారు, కానీ ప్రాజెక్టు అంచనా వ్యయం పరిశీలించేందుకు 2018లో సీడబ్ల్యూసీకి పంపించారని విచారణలో స్పష్టమైందన్నారు. పరిపాలనా అనుమతులు ఇచ్చిన తర్వాత వాప్కోస్ నుంచి డీపీఆర్ వచ్చింది, వాప్కోస్ నుంచి డీపీఆర్ రాకముందే నాటి సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి లేఖ రాశారని తెలిపారు. ఆ లేఖలో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ.71,436 కోట్లు అని పేర్కొన్నట్టు కమిషన్ నివేదికలో స్పష్టం చేసిందన్నారు. పలుమార్లు అంచనాలు వేశారని, పదేపదే అంచనా వ్యయాన్ని పెంచారని వెల్లడించారని తెలిపారు.
రాజకీయ, అధికారులందరి పేర్లు ప్రస్తావన..
ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో పూర్తి విఫలమయ్యారని ఘోష్ కమిషన్ పేర్కొందన్నారు. ప్రారంభం కాగానే బరాజ్‌లలో నీరు నింపేశారని, మేడిగడ్డ బరాజ్ కూలిపోయిన రోజు పదిన్నర టీఎంసీల నీరు బరాజ్‌లో ఉన్నాయని తెలిపారు. నిరంతరం అధిక మొత్తంలో నీటిని స్టోర్ చేసినందుకే బరాజ్ కూలిపోయిందని కమిషన్ స్పష్టం చేసిందని వెల్ల డించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాన్యువల్ లేదన్నారు.
క్వాలిటీ కంట్రోల్ చేయలేదని పేర్కొన్నారు. డిజైన్‌లో, నిర్మాణంలోనూ లోపాలున్నాయని కమిషన్ తెలిపిందన్నా రు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల్లో రాజకీయ పెద్దలు, ఐఏఎస్ అధికారులు, ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలు, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ బాధ్యులేనని తెలిపారు.
బరాజ్‌లకు ప్రమాదకరంగా మారే వరకు నీరు నింపి ఉంచడం వల్ల కూలిపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకత వకలు రాజకీయ కారకులుగా ఆనాటి సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, ఈ టల రాజేందర్‌లను కమిషన్ గుర్తించిందని పేర్కొన్నారు.
అధికారవర్గాల నుంచి ఇరిగేషన్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, స్మితా సబర్వాల్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి, కేఐపీసీఎల్ సభ్యులు, ఈఎన్సీ సీ మురళీధర్, హైపవర్ కమిటీ సభ్యలు, ఈఎన్సీ ఎన్ వెంకటేశ్వర్లు, సీఈ బీ హరిరాం, సీఈలు టీ శ్రీనివాస్, కే ఎస్‌ఎస్ చంద్రశేఖర్, ఈఈ బసవరాజు, సీఈలు జే శ్రీదేవి, జీ రమేశ్, ఏ ఆశీర్వాదం, బరాజ్ ఈఈలు, ఎస్‌ఈలు, స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఈఎన్సీ జీ అనిల్‌కుమార్, ఈఎన్సీ బీ నాగేందర్‌రావు, టీ ప్రమీల, శంకర్‌నాయక్, టీ శ్రీనివాస్, సర్దార్ ఓంకార్ సింగ్, ఏ నాగేందర్ రెడ్డిలను వారి పరిధిలోని విధులను నిజాయతీగా నిర్వర్తించనందుకుగానూ బాధ్యత వహించాల్సిందిగా కమిషన్ నివేదికలో పొందుపర్చిందన్నారు. ప్రాజెక్టులో లోపాలను గుర్తించకపోవడం, ప్రాజెక్టు పూర్తయిందని తప్పుడు నివేదికలను ఇవ్వడం కారణంగా ఎల్‌అండ్‌టీ, ఆఫ్కాన్స్, నవయుగ సంస్థలు బాధ్యత వహించాలని కమిషన్ అభిప్రాయపడిందన్నారు.
కమిషన్ గుర్తించిన కీ పాయింట్స్..
* సరైన ప్రణాళిక లేకపోవడం, తప్పుడు అంచనాలు, చట్ట విరుద్ధమైన ఆమోదాలు
* చట్టవిరుద్ధంగా ఇచ్చిన కాంట్రాక్టులు
* సవరించిన అంచనాలు
* ప్రాజెక్టు సమయం పొడగింపు
* ప్రాథమికంగా లోపభూయిష్టంగా ఉన్న డిజైన్లు
* నాణ్యత నియంత్రణ సరిగా లేకపోవడం, లోపభూయిష్టమైన నిర్మాణం
* ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లేదు. మాన్యువల్స్ లేవు. ఒప్పందాలు లేవు
* అక్రమ పూర్తి సర్టిఫికెట్లు, బ్యాంక్ గ్యారెంటీ విడుదల
* ఆర్థిక దుర్వినియోగం, కేఐపీసీఎల్ నుంచి ఆదాయం లేకపోవడం