సర్వేలన్నీ నివేదితకే అనుకూలం
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (విజయక్రాంతి) : కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో సర్వేలన్నీ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి నివేదితకే అనుకూలంగా ఉన్నాయని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కంటోన్మెంట్ అభివృద్ది బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని, 30 ఏళ్లు కంటోన్మెంట్‌కు సేవ చేసిన సాయన్న కుమార్తె నివేదితను గెలిపించుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీకి లీడర్లు, క్యాడర్ లేదు కాబట్టే బీఆర్‌ఎస్ నేతలను ప్రలోభాలకు గురిచేసి బలవంతంగా ఆ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని, ప్రజలందరి ఆశీర్వాదం నివేదితకే ఉందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ కంటోన్మెంట్ ఇంచార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ చరిత్ర ప్రజలందరికీ తెలుసని, గద్దర్ కూతురు వెన్నెలకు టికెట్ ఇవ్వకుండా ఒక ఆడబిడ్డను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు.
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బులను పంపిణీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కంటోన్మెంట్‌లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విజయానికి దరిదాపుల్లో కూడా లేవని ఆయన తేల్చిచెప్పారు. ప్రజలంతా తమ సొంత ఆడబిడ్డలా భావించి తనకు ఓటు వేయాలని కోరారు. సాయన్న లాగే తాను ప్రజాసేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, తనను మనస్పూర్తిగా దీవించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, సాయన్న అభిమానులు తదితరులు పాల్గొన్నారు.






