3 July, 2026 | 2:37 AM

అసలే ఆలస్యం.. ఆపై నాసిరకం

03-07-2026 01:50 AM
  1. కడ్తాల్ చెరువు పనులపై రైతుల ఆందోళన
  2. ఖరీఫ్ సాగుపై అయోమయం

నిర్మల్ జులై ౨( విజయ క్రాంతి)సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని పెద్ద చెరువు కట్ట మరమ్మత్తు పనులు అసలే ఆలస్యంగా నిర్వహిస్తుండగా పనుల నాణ్యతపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం ముంచుకొస్తున్న ఇప్పటికీ కట్ట పనులు పూర్తి కాకపోవడంతో ఈ వర్షాకాలం సాగుపై రైతులు ఆందోళన చేస్తున్నారు. గత వాహనాకాలం సీజన్లో కురిసిన భారీ వర్షానికి చెరువు కట్టకు భారీ గండి పడింది.

చెరువులో నీరు వృధా పోగా ఆయకట్టు కింద ఉన్న వ్యవసాయ భూములు కోతకు గురయ్యాయి. ప్రభుత్వం కట్ట అభివృద్ధి పనుల కు నీటిపారుల శాఖ ఆధ్వర్యంలో రూ.14. 50 లక్షల నిధులను మంజూరు చేసింది . పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ మరో సబ్ కాంట్రాక్టర్కు పనులు అప్పగించినట్లు గ్రామస్తులు తెలిపారు. సదరు కాంట్రాక్టర్ పనులు చేయడంతో మధ్యలోనే పనులు నిలిచిపోయాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాకాలం ప్రారంభమైనప్పటికి చెరువు కట్ట, తూము మరమ్మత్తు పనులు పూర్తికాకపోవడం వల్ల భారీ వర్షా లు కురిస్తే చెరువుకు నష్టం వాటిల్లే ప్రమా దం ఉందని రైతులు చెబుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్ట తెగిపోయి రైతులు, మత్స్యకారులకు అపార నష్టం కలిగింది. చేపట్టిన పనులు కూడా నాసిరకంగా ఉన్నాయని కట్టపై మొరం ఎత్తు పల్లాలుగాపోయడం మళ్లీ కట్టకు ప్రమాదం పొంచి ఉందని రైతు లు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తిచేసి నాణ్యతగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 

కాంట్రాక్టర్ ఒకరు.. పనులు చేసేది మరొకరు.

అయితే చెరువు కట్ట మరమత్తులకై ప్రభుత్వం రూ. 14.50 లక్షల నిధులు మంజూరు చేసింది. ఈ పనులను టెండర్ లో చిట్యాల గ్రామానికి చెందిన అనిల్ అనే కాంట్రాక్టర్ దక్కించుకొని సబ్ కాంట్రాక్టర్ కు అప్పగించారు. సదరు వ్యక్తికి అనుభవం లేకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నా యి. చెరువు కట్ట, తూము మరమ్మత్తు పనులు వేసవికాలంలో పూర్తి కావాల్సినప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు నిలిచిపోయాయి. చెరువు కట్ట వద్ద ఉన్న తూము నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు, కట్టకు గండ్లు పడకుండా మట్టి పనులు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు పనులు పూర్తికాలేదని రైతులు ఆరోపిస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో రూ. 75 లక్షలతో పనులు.

సమైక్య రాష్ట్రంలో చెరువులను నిర్లక్ష్యం చేసారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం 2015లో మిషన్ కాకతీయ పథకంలో ఈ గ్రామ పెద్ద చెరువుకు రూ. 75 లక్షల నిధులు కేటాయించింది. పూడికతీత, కట్ట, తూములు, మత్తళ్లను బలోపేతం చేయాల్సినప్పటికి పనులు నాణ్యతతో చేయకపోవడంతోనే భారీ వర్షాలకు చెరువు కట్ట మళ్ళీ తెగిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువు కింద ఉన్న ఆయకట్టు రైతుల పంట పొలాల్లోకి ఇసుక మేటలు పెట్టడంతో సుమారు 500 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.

పనులు త్వరగా పూర్తి చేయాలి

గ్రామంలోని పెద్ద చెరువు కట్ట తెగిపోవడంతో రైతులకు, మత్స్యకారులకు తీవ్ర నష్టం కలిగింది. పంట పొలాల్లోకి వెళ్లే రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పొలాల్లోకి చెరువు నీరు చేరడంతో పూర్తిగా నష్టపోయారు. వ్యవసాయ అధికారులు సర్వే చేసినప్పటికీ నష్ట పరిహారం ఇప్పటివరకు ప్రభుత్వం అందించలేదు. చెరువుకట్ట మరమ్మత్తు పనులు, రహదారి పనులు వెంటనే పూర్తి చేయాలి.

 గుర్రం రాము, సర్పంచ్