3 July, 2026 | 1:56 AM

బడా భీమ్!

03-07-2026 01:22 AM

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్టు

  1. నివాసం, బినామీల ఇండ్లు సహా 20 చోట్ల ఏసీబీ సోదాలు
  2.   2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, 43 లక్షల నగదు స్వాధీనం 
  3. తెలంగాణ, కర్ణాటకలో 44 ఎకరాల భూములు 
  4. పలు చోట్ల ఖాళీ స్థలాలు, ప్లాట్లు 
  5. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆస్తుల విలువ 7 కోట్లు 
  6. బహిరంగ మార్కెట్‌లో రూ.200 కోట్లకు పైమాటే..

రంగారెడ్డి, జూలై 2 (విజయక్రాంతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డిని ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఆయన ప్రస్తుతం డీజీపీ ఆఫీసులో కంప్యూటర్ సర్వీసెస్‌లో పనిచేస్తున్నారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణల మేరకు గురువారం తెల్లవారుజా మున 5 గంటల నుంచే 15 బృందాలు ఆయన నివాసంతో పాటు బినామీల ఇళ్లు సహా రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతా ల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఇంట్లో సుమారు 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, 43 లక్షల నగదు లభ్యమైంది. విల్లా, ఇళ్లు, ఫ్లాట్లు, కమర్షియల్ స్పేస్‌లు, ఓపెన్ ప్లాట్ల డాక్యుమెంట్లను అధికారులు సీజ్ చేశారు. తెలంగాణ, కర్ణాటకలో 44 ఎకరాల భూములు, 75 లక్షల పెట్టుబడి పత్రాలు గుర్తించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం గుర్తించిన ఆస్తుల విలువ సుమారు రూ. 5 కోట్ల నుంచి రూ. 7 కోట్ల వరకు ఉం టుంది. బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ. 150 నుంచి రూ. 200 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు లెక్కగట్టారు.

నిందితుడి ఇంట్లో 3.60 లక్షల నగదు, 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువు లు, 23 విదేశీ మద్యం సీసాలు గుర్తించారు. బినామీ ఇంట్లో రూ. 40 లక్షల నగదు, వివిధ బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ. 19.91 లక్షల నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. కర్ణాటకలో 44 ఎకరాలు, బెంగళూరులోని దేవనహల్లిలో ఎకరం, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాలు, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటో 2 ఎకరాలు, సీసీ కుంట ముచింతల గ్రామంలో 4.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

హైదరాబాద్ ఐరాంబాగ్‌లో వెసెల్లా మెడోస్‌లో విల్లాను గుర్తిం చారు. టెలికాం నగర్‌లో రెండంతస్తుల ఇల్లు, సాయి ప్రభా రెసిడెన్సీలో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలోని క్రాంతి సియాన్ అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్, తెల్లాపూర్‌లోని అభినంద రెసిడెన్సీలో రెండు ప్లాట్లు ఉన్నట్టు గుర్తించారు. మణికొండ లాంకో హిల్స్ రోడ్డులో 500 గజాల స్థలంలో జీ+5 కమర్షియల్ కాంప్లెక్స్‌లో వాటా కలిగి ఉన్నట్టు గుర్తించారు. మణికొండ మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో 3 వేల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ ఉన్నది.

ప్రగతి రిసార్ట్స్‌లో 500 చదరపు గజాల ఓపెన్ ప్లాట్, నాగోల్ కామినేని హాస్పిటల్ సమీపంలో 200 చదరపు గజాల ఓపెన్ ప్లాట్, పటాన్‌చెరు జీపీఆర్ హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 చదరపు గజాల ఓపెన్ ప్లాట్, పటాన్చెరులో మరో 200 చదరపు గజాల ఓపెన్ ప్లాట్, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో వెయ్యి గజాల భూమి ఉన్నది. అలాగే మెసర్స్ శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్ సంస్థలో రూ.75 లక్షల పెట్టుబడి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 

సీఐ నుంచి కోటీశ్వరుడి వరకు

2011లో మియాపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసినప్పటినుంచే ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత 2022లో పటాన్‌చెరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. పారిశ్రామిక ప్రాంత మైన పటాన్‌చెరులో ల్యాండ్ సెటిల్మెం ట్లు, మైనింగ్, ఇసుక అక్రమ రవాణాదారుల నుంచి, పలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఏసీబీకి పక్కాగా ఫిర్యాదులు అందాయి. పదోన్నతులు, లూప్‌హోల్ పోస్టింగ్‌ల కోసమే ఈ వసూళ్ల పర్వం సాగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం భీమ్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.