3 July, 2026 | 1:46 AM

బ్లాక్ మనీ మార్చుకుంటాం!

03-07-2026 12:58 AM
  1.   10 లక్షలు ఇస్తే.. 40 లక్షలు ఖాతాలో వేస్తాం
  2. అమాయకులను దోచుకుంటున్న ముఠా అరెస్ట్
  3.   12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
  4. నిందితుల్లో ఆర్‌ఎస్సై, కానిస్టేబుల్
  5.   17 లక్షల నగదు, మూడు కార్లు, నకిలీ నోట్లు స్వాధీనం

ఖమ్మం/సత్తుపల్లి, జూలై 2 (విజయక్రాంతి): ‘మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం.. బ్లాక్ మనీ చాలా ఉంది. వైట్ మనీ రూ.10 లక్షలు ఇస్తే రూ.40 లక్షలు మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాం’ అంటూ అమాయకులను నమ్మించి మోసం చేసిన 14 మంది ముఠాలో 12 మందిని ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒక ఆర్‌ఎస్సై, 15వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ కూడా ఉన్నారు.

గురువారం సత్తుపల్లిలో మీడియా సమావేశంలో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ వివరాలు వెల్లడించారు. ఈ ముఠా చేతిలో మోసపోయిన ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కుర్రా గంగాధర్‌రెడ్డి జూన్ 25న సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్రమార్జనకు అలవాటు పడిన నిందితులు నకిలీ నకిలీ కరెన్సీతో అమాయక ప్రజల ను మోసం చేస్తున్నారని కనిపెట్టారు.

బుధవా రం ఉదయం గంగారంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ముందుగా సిమ్ కార్డులను తీసుకొని, ఏదో ఒక నంబర్‌కు ఫోన్ చేసేవారు. అమాయకులు ఫోన్ ఎత్తితే నా పేరు మహేందర్‌రెడ్డి, బాలగంగాధర్, చంద్రం, చంటిబాబు అని చెప్పేవారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటామని, తన ఖాతాలో 2 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఉన్నదని, ఇన్కమ్ టాక్స్ సమస్యలు వున్నాయని, బ్లాక్ మనీని వైట్‌గా మార్చాలనుకుంటున్నాను అని, రూ.10 లక్షలు ఇస్తే రూ.40 లక్షలు మీ ఖాతాలో వేస్తానని నమ్మించేవారు.

తాను చెప్పిన చోటుకు డబ్బులు తీసుకొని రావాలని కోరేవారు. నమ్మి చెప్పిన చోటకు వెళ్లే వ్యక్తులకు నమ్మకం కలిగించేలా మాట్లాడి, వారు తెచ్చిన సొమ్ము తీసుకు ని, నకిలీ నోట్లు వున్న బ్యాగును ఇచ్చి పంపేవారు. ఇంతలోనే ముఠాలోని ఒరిజినల్, నకిలీ పోలీసులు ముందే ఏర్పాటు చేసుకున్న కార్లలో వెళ్లి వారిని దొంగనోట్లు వ్యాపారం చేస్తున్నార ని బెదిరించి, దాడులు చేసి నగదు లాక్కొని వెళ్లేవారు. ఈ విధంగానే మోసపోయిన ప్రొద్దుటూరుకు చెందిన కుర్రా గంగాధర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. 

ప్రధాన సూత్రదారి ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందిన ఈద చంటి బాబుగా గుర్తించారు. అరెస్టయిన వారిలో 15వ బెటాలియన్ కానిస్టేబుల్ ముల్లగిరి వర్ధన్ (తుంబూరు, సత్తుపల్లి), బేరా కేశవరావు(టీజీఎస్పీ ఆర్‌ఎస్‌ఐ, 15వ బెటాలియన్ బేతుపల్లి గంగారాం, సత్తుపల్లి), మువ్వా సత్యనారాయణ(ఏలూరు జిల్లా, టీ.నర్సాపురం), మారుముడి మధు(క్యాబ్ డ్రైవర్, ఏలూరు), గోరంట్ల గౌతమ్ కుమార్(ఖమ్మం), కర్లపూడి నవీన్ (ఖమ్మం), నక్కా నాగరాజు(ఖమ్మం), సాగి సుబ్బరాజు కొడగట్టుపల్లి(అంబేద్కర్ కోనసీమ జిల్లా), కాపా శ్రీనివాస్ (ఏఎస్‌రావు నగర్, సికింద్రాబాద్), దుడుగురు కురబ గణేష్(కర్నూలు), ఉపేంద్రం జనార్ధన రాజు(సత్యసాయి జిల్లా) ఉన్నారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  నిందితుల నుంచి రూ.17.6 లక్షల నగదు, 3 కార్లు, ద్విచక్రవాహ నం, 16 సెల్ ఫోన్లు, పోలీస్ యూనిఫామ్, 500 రూపాయల కరెన్సీ 80 కట్టలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.