3 July, 2026 | 1:51 AM

నకిలీ వీసాలతో విదేశాలకు పయనం

03-07-2026 01:04 AM
  1. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టివేత
  2. ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కిన 20 మంది మహిళలు!
  3. వీరిది ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా
  4. నకిలీ వీసాలు అంటగట్టిన ఏజెంట్లు 

రంగారెడ్డి, జూలై 2 (విజయక్రాంతి): నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఏపీకి చెందిన 20 మంది మహిళలను గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకున్న పేద మహిళలను నమ్మించి, నకిలీ వీసాలు అంటగట్టి ఏజెంట్లు నిలువునా ముంచారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలు ఒమాన్ మీదుగా కువైట్‌కు (మస్కట్ వెళ్లే ఒమాన్ ఎయిర్లైన్స్ విమానంలో) వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారు విమానం ఎక్కేందుకు సిద్ధమవుతుండగా, బోర్డింగ్ పాస్ ఇచ్చే ముందు ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి పాస్‌పోర్టులు, వీసాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

వారు టూరిస్ట్ వీసాపై అక్కడికి వెళ్లి పని చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా, వారి వీసా స్టాంపులు, సంతకాలను నిశితంగా పరిశీలించగా అవి నకిలీవని తేలింది. ఇమ్మిగ్రేషన్ సిబ్బంది వారి ప్రయాణాన్ని రద్దు చేసి, 20 మందిని విమానాశ్రయ అవుట్‌పోస్టు పోలీసులకు అప్పగించారు. 

ఏజెంట్ చేతిలో మోసపోయాం: బాధితులు

ప్రస్తుతం ఎయిర్‌పోర్టు పోలీసులు విచారించగా బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ‘సొంత ఊళ్లలో ఆర్థిక ఇబ్బందుల వల్ల, గల్ఫ్ దేశాల్లో గృహ కార్మికులుగా పనిచేసి నాలుగు రాళ్లు సంపాదించుకుందామని బయలుదేరాం. ప్రైవేట్ ట్రావెల్ ఏజెంట్ మాకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించాడు.

ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి, చేతిలో నకిలీ వీసాలు పెట్టాడు. మేము మోసపోయామనే విషయం విమానాశ్రయానికి వచ్చేవరకు మాకు తెలియదు’ అని బాధితులు పోలీసుల ఎదుట వాపోయారు. బాధితుల నుంచి పాస్‌పోర్టులు, వీసాలను స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆర్జీఐఏ ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్  తెలిపారు.