3 July, 2026 | 2:18 AM

సవాళ్ల సమరం!

03-07-2026 01:35 AM

అప్పులు, అవినీతిపై చర్చకు తొడగొట్టి తోకముడిచారు 

మంత్రి జూపల్లికి ప్రత్యేక సీటు సిద్ధం చేశాం: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

  1. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత 
  2. గన్‌పార్క్ వద్ద మంత్రులతో చర్చకు బయలుదేరిన మాజీ మంత్రి హరీశ్‌రావు 
  3. అడ్డుకున్న పోలీసులు, తోపులాట.. హైటెన్షన్ 
  4. అదుపులోకి తీసుకొని కంచన్‌బాగ్ ఠాణాకు తరలింపు 
  5. పాలమూరు పౌరుషం ఉంటే జూపల్లి రాజీనామా చేయాలి: హరీశ్‌రావు

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి) : తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం, సవాళ్లు, ప్రతిసవాళ్లు పొలిటికల్  హీట్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయి. గురుకుల విద్యాశాఖలో అవినీతి, టెండర్ల నిర్వహణలో ఆరోపణలపై గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ మంత్రులు చర్చ కు సిద్ధమవడంతో హైదరాబాద్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అవినీతి, అప్పుల అంశాలపై చర్చించేందుకు గన్‌పార్క్‌కు బయల్దేరిన బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావును తెలంగాణ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని ముందుకు వెళ్లనివ్వలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొ న్నాయి. బీఆర్‌ఎస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చర్చకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుం టున్నారని, ప్రభుత్వం ఏ తప్పు చేయకపతే ఎందుకు ఆపుతున్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు.

తామేం కొట్లాటకు పోవట్లేదని, దయచేసి తమను ఆపొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు, దళితుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రజల గొంతుకుగా వెళ్తున్నానని స్పష్టం చేశారు. తమవద్ద కొండా సురేఖ లెటర్, హైకోర్డు ఆర్డర్లు, డ్రగ్స్ సప్లయర్లకు, బ్రోకర్లకు టెండర్లు ఇచ్చిన ఆధారాలు ఉన్నాయన్నారు. ముందుకు వెళ్లే ప్రయత్నంగా చేయగా వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. దీంతో హరీశ్‌రావు కాలినడకన గన్‌పార్క్ వెళ్లే ప్రయత్నం చేశారు.

పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో హరీశ్ రావు కిందపడిపోయారు.  తమ నేతను అడ్డుకోవడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఉద్రిక్తత నడుమ పోలీసులు హరీశ్‌రావుతోపాటు ఆయన వెంట గన్‌పార్క్‌కు బయలుదేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను, బీఆర్‌ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుకొని కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

మరోవైపు, గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలోని రూ. 7 లక్షల కోట్ల అప్పు లపై చర్చకు రావాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్ విసిరారు. కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరూ కలిసి గన్‌పార్క్‌కు రావాలని పిలుపునిచ్చారు. దీన్ని స్వీకరించిన బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మంత్రి కోసం కుర్చీ వేసి ఎదురుచూశారు. గన్‌పార్క్ వద్ద ముగ్గురు మంత్రులతో చర్చించేందుకు ఆయన సిద్ధపడగా పోలీసులు అడ్డుకున్నారు. 

బీజేపీ ఎందుకు నోరు మెదపడం లేదు?

రాష్ట్రంలో ‘ఆర్‌ఆర్ టాక్స్’ వసూలు చేస్తున్నారని స్వయంగా ప్రధానమంత్రి మాట్లా డినా, ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని బీజేపీని కేటీఆర్ ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై జరిగిన ఈడీ దాడుల విచారణ ఏమైందో బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. అమృత్ టెండర్లలో జరిగిన భారీ అవినీతిపై ఎందుకు విచారణ జరపడం లేదని, కాంగ్రెస్ సర్కారులో బీజేపీ ఎంపీలకు కాంట్రాక్టులు ఎలా దక్కుతున్నాయో సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కి రాజకీయాలు, చీకటి ఒప్పందాలు తెలంగాణ ప్రజలకు అర్థమయిపో యాయని కేటీఆర్ విరుచుకు పడ్డారు. నిన్న ఒకే వేదికపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పొంతన లేని గణాంకాలు చెప్పి అడ్డంగా దొరికిపోయారని ఎద్దేవా చేశారు. గతంలో నోట్లకట్టలతో దొరికిన రేవంత్‌కు రాష్ట్రంలో విశ్వసనీయతే లేదని కేటీఆర్ మండిపడ్డారు. కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.

పొంగులేటి కుమారుడు వట్టినాగుల పల్లిలో కంపెనీలపై పడి భూములను దోచుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. త్వర లోనే రైతు సంగ్రామ సదస్సులు, యువజన, విద్యార్థి సదస్సుల  ద్వారా కాంగ్రెస్ మోసాలను ఎక్కడికక్కడ నిలదీసి, ప్రజలను చైతన్య వంతం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

చెప్పుడేమో ఘనం.. చేతలేమో శూన్యం

బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022లో జీవో నెం.110 ప్రకారం బట్టలు, బూట్ల కొనుగోళ్లు లిడ్ క్యాప్ ద్వారా జరగాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఒక శాఖ మరో శాఖపై కోర్టుకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని, ఇదే స్కాంకు నిదర్శనమని చెప్పారు. లిడ్ క్యాప్ నుంచి ఆర్డర్లు లాక్కొని దళిత బిడ్డలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాం లో మాకే ఆర్డర్లు ఇచ్చేవారని లిడ్ క్యాప్ లేఖ రాసిందని, అలాంటప్పుడు స్కాం జరగలేదని అడ్లూరి లక్ష్మణ్ ఎలా చెబుతారని ప్రశ్నించారు.

శ్రీధర్‌బాబుకు కూడా లిడ్ క్యాప్ లేఖ రాసిందని, పీఎంయూ చైర్మన్‌కూ లేఖ రాసి దళిత బిడ్డల నోరు కొట్టొద్దని విజ్ఞ ప్తి చేసిందన్నారు. చివరకు దళిత బిడ్డలు హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని, హైకోర్టు చెప్పిన తర్వాతే 10 శాతం ఆర్డర్లు ఇచ్చారని తెలిపారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో ఎస్సీ, ఎస్టీలకు టెండర్లు, ప్రొక్యూర్‌మెంట్‌లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని, మీ ఎస్సీ, ఎస్టీ చేవెళ్ల డిక్లరేషన్ కాకి ఎత్తుకుపోయిందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

నోట్‌బుక్స్ కొనుగోళ్లలో రూ.150 కోట్ల కమిషన్ కోసం వాటర్ మార్క్ నిబంధన పెట్టారని, మేము బయటపెట్టడంతో టెండర్లు రద్దు చేశారని, ఇప్పటికీ పాఠశాలలకు నోట్ బుక్స్ అందలేదన్నారు.  ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వా న్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారని ఆయన భద్రతను తగ్గించారని, రిటైర్‌మెంట్‌కు ముందు ఆయ న భార్య లక్ష్మీభాయిని బదిలీ చేశారని విమర్శించారు. శ్రీధర్‌బాబు సతీమణి మా ప్రభు త్వంలో పనిచేశారని, మేము ఇలా చేశామా? అని ప్రశ్నించారు.  

రాష్ట్రంలో సర్కార్ నడుస్తుందా.. సర్కస్ నడుస్తుందా?: మాజీ మంత్రి తలసాని

రాష్ట్రంలో సర్కార్ నడుస్తుందా? లేక సర్కస్ నడుస్తున్నదా?. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి. వ్యవస్థలు శాశ్వతం అనేది పోలీసులు గుర్తుపెట్టుకోవాలని మా జీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నా రు. ఈ ప్రభుత్వంలో సీఎం, మంత్రుల మాటలకు పొంతన ఉండటం లేదు. మంత్రులు పిలిస్తేనే కదా హరీష్‌రావు గన్‌పార్క్ వద్దకు బయలుదేరింది.

ఆయనను అరెస్టు చేయడమేంటి.. అని మండిపడ్డారు. అప్పుల మీద, గురుకులాల మీద చర్చ అంటే ఎందుకు భయపడుతున్నారు. మం త్రులు చర్చకు రమ్మని పిలిచి పిరికిపందల్లా భయపడిపోయారని ధ్వజమెత్తారు. దమ్ముంటే అసెంబ్లీ పెట్టండి, చర్చ చేద్దాం. సవాళ్లకు మేము ఎప్పుడూ సిద్ధమే. 

మీలాగా పిరికిపందలం కాదు : ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ నుంచి కాంగ్రెస్ నాయకులు కేవలం 10 కిలో మీటర్ల దూరంలోనే ఉన్నారు. మీరు గన్‌పార్క్ దగ్గర ఉట్టి చేతులతో కూర్చొని డ్రామాలు చేసే బదులు మీ దగ్గర ఏమైనా ఆధారాలుంటే మేమంతా ఇక్కడే ఉన్నాం. ఆ ఆధారాలను తీసుకొని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు రండి. మేమెక్కడికి వెళ్లం. మీలాగా పిరికిపందలం కాదు. దొడ్డిదారిన పోయేటోళ్లం కాదు. అని బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.

కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసోళ్లను అడ్డం పెట్టి డ్రామాలాడాల్సిన అవసరం లేదు. మేం పోలీస్ కస్టడీలోనే ఉన్నాం. ఇక్కడే అందరిముందు డిబేట్ చేద్దాం అన్నారు. తెలంగాణను దోచుకోవడంలో బిజీగా ఉంటే దయచేసి మమ్మల్ని వాహనాల్లో ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లమని పోలీసోళ్లకు చెప్పండి. ఎలాంటి దుర్భాషలు కాని, ఎలాంటి అప్రజాస్వామికమైన భాష కానీ మేం మాట్లాడబోం అని పేర్కొన్నారు.

పాలమూరు పౌరుషం ఉంటే జూపల్లి రాజీనామా చేయాలి : హరీశ్‌రావు 

కాంగ్రెస్ ప్రభుత్వం సవాళ్లు చేసి చివరకు తోక ముడిచిందని, గోల్ కొడతామనుకుని సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. కేటీఆర్, నేను తెలంగాణ భవన్‌లో ఉంటే చర్చకు రాలేదని, చీమూ నెత్తురు ఉంటే, పాలమూరు పౌరుషం ఉంటే జూపల్లి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్న హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు.

గురుకుల టెండర్లలో అవకతవకలు జరిగాయని నేను, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్ ఆధారాలతో మాట్లాడామని గుర్తు చేశారు. అడ్లూరి లక్ష్మణ్ మొదట ప్రెస్‌క్లబ్‌కు వస్తానన్నారని, తర్వాత హరీశ్ రావే రావాలని షరతులు పెట్టారని తెలిపారు. మేం చర్చకు రావడానికి సిద్ధమైతే పోలీసులు అడ్డుకున్నారని, హిట్లర్‌ను ఆదర్శంగా చెప్పే సీఎం నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేమని ఎద్దేవా చేశారు.

అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్లకు ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేదని, టెండర్లలో అవినీతి జరిగిందని తేటతెల్లమైందన్నారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేదని, అవినీతి చేసినందుకే పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పించుకుందని విమర్శించారు. గురుకుల కిరాణా టెండర్లు రూ.800 కోట్లకు పిలిచారని, పత్రికల్లో రూ.200 కోట్ల గోల్‌మాల్ జరిగినట్లు వచ్చిందన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2017లో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు జీవో తీసుకొచ్చిందని, పోలీసు, పాఠశాల, గురుకుల యూనిఫాంల ఆర్డర్లు టెస్కోకే ఇవ్వాలనే నిబంధన ఉండేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించి పెద్ద కాంట్రాక్టర్లకు టెండర్లు ఇచ్చిందని ఆరోపించారు. దీనిపై కోర్టుకు వెళ్తే చేనేత కార్మికుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని ఆర్డర్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందన్నారు.

కొండా సురేఖ కూడా ముఖ్యమంత్రికి లేఖ రాశారని, వేలాది చేనేత కార్మికులు రోడ్డున పడతారని లేఖలో పేర్కొన్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డికి గుజరాత్ దళారులపై ఉన్న దయ.. చేనేత కార్మికులపై లేదని, ‘మఫత్ లాల్ ముద్దు... చేనేత వద్దు’ అన్నదే ప్రభుత్వ వైఖరి అని మండిపడ్డారు. 

తొడగొట్టి తోకముడిచారు : కేటీఆర్ 

అప్పులపై  చర్చకు సిద్ధమని సవాళ్లు విసిరిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు  తోకముడిచి పారిపోయారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తానే స్వయంగా తెలంగాణ భవన్‌కు వస్తున్నానని ప్రగల్భాలు పలికిన మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం ప్రత్యేకంగా కుర్చీ వేసి, శాలువాతో మూడు గంటల పాటు వేచి చూసినా రాలేదని మండిపడ్డారు. మంత్రి రాకుండా మొహం చాటేయడంతో పాటు మరో చోట డ్రామాకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పులపై చర్చించేందుకు తెలంగాణ భవన్‌కే వస్తానని మంత్రి జూపల్లి సవాల్ చేసిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు జూపల్లి కోసం ప్రత్యేకంగా ఒక సీటు సిద్ధం చేశారు. దానిపై ఆయన పేరు కూడా రాసి పెట్టారు. చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, తెలంగాణ భవన్ రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం కేటీఆర్ ఎదురుచూశారు. కానీ జూపల్లి తెలంగాణ భవన్ రాకపోవడంపై కేటీఆర్ స్పందిస్తూ మీడియాతో మా ట్లాడారు.

మేమంతా 10 గంటలకు తెలంగాణ భవన్‌కు వచి కూర్చున్నామని, మంత్రి జూపల్లి రాలేదని గన్ పార్క్‌కు బయలుదేరిన హరీశ్‌రావును,ఇతర నేతలను గేటు దాటక ముందే దుర్మార్గంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.  రాష్ట్ర ప్రజల ముందు అన్ని వాస్తవాలు ఉంచుతామని అనుకున్నామని, సవాళ్లు స్వీకరించే సత్తా ముఖ్యమంత్రి, మంత్రులకు లేదని మరోసారి తేలిపోయిందని విమర్శించారు.

ముఖ్యమంత్రికి, మంత్రులకు నిజంగానే చర్చించే దమ్ముంటే వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పా టు చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేళ్ల డొల్లతనాన్ని, అవినీతి బండారాన్ని బట్టబయలు చేస్తామని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖలో హోలోగ్రామ్ టెండర్లలో మంత్రి కొడుకు, సీఎం అల్లుడి పంచాయతీ భరించలేకే ఐఏఎస్ అధికారి రిజ్వీ రాజీనామా చేశారని,  బీర్ల కోసం తెచ్చిన జీఓపై జూపల్లికి కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు.

బీఆర్‌ఎస్ పాలనలో  కేవలం 2.80 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆర్బీఐ, కాగ్ లెక్కలు చెబుతుంటే, సీఎం, డిప్యూటీ సీఎంలు  పొంతన లేని కాకి లెక్కలతో ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. గురుకులాల టెండర్లలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తమ పార్టీ నాయకులను అరెస్టు చేయడంపై మండిపడ్డారు.