పినపాక కాంగ్రెస్ మండల అధ్యక్ష పదవి ఎవరికి...?
అధిష్ఠానం నిర్ణయంపై ఉత్కంఠ..
బీసీ, ఓసీ, ఎస్సీఎస్టీ వర్గాల్లో ఆశావహుల ఎదురుచూపులు.
పినపాక, జులై 2 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను అధిష్ఠానం ప్రకటించినప్పటికీ , పినపాక మండల అధ్యక్షుడి నియామకం మాత్రం ఇంకా ఖరారు కాకపోవడం పార్టీ శ్రేణుల్లో ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష పదవి ఎవరికి దక్కనుందనే అంశంపై వివిధ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.
మళ్లీ రామనాథంకే అవకాశం ?
గతంలో మండల అధ్యక్షుడిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత గొడిశాల రామనాథం మరోసారి బాధ్యతలు చేపట్టే అవకాశాలపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ కష్టకాలంలో కార్యకర్తలను సమన్వయం చేసి, కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలకంగా పనిచేసిన నాయకత్వానికి మరోసారి అవకాశం ఇవ్వాలని కొందరు కార్యకర్తలు, స్థానిక నాయకులు అభిప్రాయపడుతున్నారు.
మండల అధ్యక్ష పీఠం పైఓసి నేతల కన్ను...?
ఈసారి సామాజిక సమీకరణల్లో భాగంగా ఓసీ వర్గానికి అధ్యక్ష పదవి కేటాయిస్తే, జానంపేట, దుగినేపల్లి గ్రామపంచాయతీలకి చెందిన నాయకులు అధిస్థానం ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. ఐతే ఈ ఇద్దరు కూడా నియోజకవర్గ బాస్ కి అత్యంత సన్నిహితులు. చివరిగా ఈ అవకాశం జానంపేట నేతనే వరించేఅవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనివల్ల మండలంలో సమతుల్యత ఏర్పడుతుందని భావిస్తున్నారు.
ఎస్సీఎస్టీలకు అవకాశం అందని ద్రాక్షనా...?
ఇన్నేళ్లుగా అధ్యక్ష పదవి ప్రధానంగా ఇతర వర్గాలకే పరిమితమైందని, ఈసారి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అవకాశం కల్పిస్తే పార్టీకి మరింత బలం చేకూరుతుందని పలువురు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో దుగినేపల్లి గ్రామపంచాయతీకి చెందిన ఓ నాయకుడి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో విశ్వసనీయ సమాచారం వినిపిస్తోంది.
అధిష్ఠానం నిర్ణయమే కీలకం..
మండల అధ్యక్ష పదవి ఎవరికి దక్కినా, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు. పినపాక మండల కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.






