ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి
ఏఈఓ సౌజన్య
ఉండవెల్లి, జూలై 23 : ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని ఏఈఓ సౌజన్య సూచించారు. ఉండవెల్లి మండలంలోని మారమునగాల- రైతు వేదికలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై గురువారం అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు మారమునగాల 1, 2 సర్పంచులు వాలం రాంబాబు, సురేష్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఎలినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున.. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని మినుములు, జొన్నలు, సజ్జలు వంటి పంటలతో పాటు ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని సూచించారు.
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకొని నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. ఫలితంగా నష్టాలను తగ్గించుకొని మెరుగైన ఆదాయం పొందవచ్చని రైతులకు అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సులో వ్యవసాయ విస్తరణ అధికారి సౌజన్య, సర్పంచులు రాంబాబు, సురేష్ గౌడ్, ఆయా గ్రామాల ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.






