05-12-2025 08:18:42 PM
కరీంనగర్,(విజయక్రాంతి): ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా కరీంనగర్ జిల్లాకు చెందిన అంబటి జోజి రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దేవరాజన్ తెలిపారు. సభ్యత్వ నమోదు నుంచి పార్టీ పాఠశాల నిర్వహణ వరకు, అన్ని సంస్థాగత చర్యలు సమన్వయం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా జోజి రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు.
జిల్లాల మధ్య సమన్వయం, కార్యాచరణ వేగవంతం, పార్టీ సందేశాన్ని ప్రజలకు చేరవేయడం వంటి అంశాలు ఆయన పర్యవేక్షణలో కొనసాగుతాయి అని దేవరాజన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా ఎన్నికైన అంబటి జోజి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సభ్యత్వం, పార్టీ నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన నిరంతరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తన నియమాకానికి సహకరించిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జాతీయ కమిటీ సభ్యులకు, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలకు కృతజ్ఞతలు తెలిపారు.