14 April, 2026 | 1:46 PM

రాళ్లపేటలో ఘనంగా ప్రపంచ మృత్తికా దినోత్సవం

05-12-2025 08:37 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల దత్తత గ్రామమైన రాళ్లపేటలో ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని  అనే థీమ్‌తో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగమ్ మాట్లాడుతూ... పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న ఈ సమయంలో ఆరోగ్యకరమైన నేలలు పట్టణాల అభివృద్ధికి పునాది అవుతాయని, నేల ఆరోగ్య పరిరక్షణలో ప్రతి రైతు శాస్త్రీయ పద్ధతులను అవలంబించాలని సూచించారు.

తదుపరి వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ కె.బి. సునీతా దేవీ అర్బన్ ఫార్మింగ్ ప్రాముఖ్యత, నేల ఆరోగ్యం పట్టణ జీవన శైలిపై చూపే ప్రభావాన్ని వివరించారు. డా. ఆర్. సాయి కుమార్ జీవన ఎరువుల ప్రయోజనాలు, అవి నేల సారాన్ని పెంపొందించడంలో కలిగించే సానుకూల ప్రభావాన్ని వివరించారు. డా. పి. మాధవి భూసారం ప్రాముఖ్యత మరియు పంటల దిగుబడిపై దాని ప్రభావాన్ని తెలియజేశారు. డా. ఎం. సంపత్ కుమార్ పచ్చిరొట్ట పంటల సాగు ద్వారా నేల సార పెంపుదలకు ఉపయోగపడే పద్ధతులను రైతులకు వివరించారు. డా. టీ. అరుణ్ బాబు సమగ్ర పోషణ యాజమాన్య పద్ధతులు, ఖర్చులను తగ్గించే శాస్త్రీయ విధానాలపై అవగాహన కల్పించారు. శ్రీమతి యశశ్విని ట్రైకోడెర్మా వినియోగం మరియు నేల వ్యాధి నియంత్రణలో దాని ప్రభావం గురించి వివరించారు.

ఐ ఎఫ్ ఎఫ్ సి ఓ ఏరియా మేనేజర్ నరేష్ నానో ఎరువుల వినియోగం, వాటి ప్రయోజనాలపై రైతులకు వివరించారు. అనంతరం అతిథులు రైతులకు భూసార పరీక్ష పత్రాలను అందజేశారు. తర్వాత ఏ ఈ ఎల్ పి విద్యార్థులు రూపొందించిన వర్మీ కంపోస్టు, నేల ఆరోగ్యానికి సంబంధించిన ప్రదర్శనను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎం ఏ ఓసంజీవ్, సాయికిరణ్, ఏ ఈ ఓ అనుష, ఏ ఈ ఎల్ పి విద్యార్థులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.