కేసీఆర్‌పై అక్కసుతో అంబేద్కర్‌కు సంకెళ్లు
- బీఆర్‌ఎస్ హెచ్చరికతో ఈసారి ఏర్పాట్లు
- ఆర్టికల్ 3 లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు
- ‘అంబేద్కర్ అభయహస్తం’ అమలు చేయకుండా అవమానం
- మే, జూన్‌లో ఎస్సీ, ఎస్టీల కోసం సభలు
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): 125 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ నిర్మాణం చేశారన్న అక్కసు, కోపంతో ఆ మహానుభావుణ్ణి సంకెళ్లలో పెట్టి, ఎవరినీ వెళ్లనివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బంధించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈసారి కూడా అంబేదర్క్‌ను మళ్లీ బందీ చేసి పెడితే, వందలు, వేలాదిగా వచ్చి ఆ సంకెళ్లు బద్దలు కొడతామని బీఆర్‌ఎస్ విద్యార్థి విభా గం ద్వారా చేసిన హెచ్చరిక ఫలించి ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేసిందన్నారు.
మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకలను తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ నివాళి అర్పించారు. అనంత రం తెలంగాణ భవన్ నుంచి వెళ్లి హుస్సేన్ సా గర్ తీరాన ఉన్న 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 లేకపోతే తెలంగా ణ రాష్ట్రమే లేదన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం 1000 గురుకుల పాఠశాలలు పెట్టి 6.5 లక్షల మంది పిల్లలకు, ఏటా ఒక్కొక్కరిపై రూ.1.25 లక్షల చొప్పున ఖర్చు చేస్తూ వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేయా లని సంకల్పించిందని, కానీ ఇవాళ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వాటిని సరిగ్గా నిర్వహించలేకపోతోందని విమర్శించారు.
కాంగ్రెస్ ఎప్పుడూ అంబేద్కర్‌ను రాజకీయ అవసరాల కోసం వాడుకుందే తప్ప గౌరవించలేదని, 1952, 1954లో ఆయన పార్లమెంటుకు రాకుండా కుట్రలు చేసి కాంగ్రెస్ ఓడించిందని గుర్తుచేశా రు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ కాలంలో ఆయనకు భారతరత్న ఇవ్వలేదని విమర్శించారు. చివరకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన ఫొటో పెట్టడానికి కూడా కాంగ్రెస్ ఒప్పుకోలేదన్నారు.
డిక్లరేషన్ల పేరిట కాంగ్రెస్ మోసం
కేసీఆర్ దళితబంధు కింద రూ.10 లక్షలు ఇస్తే, తాము 12 లక్షలు ఇస్తామని చెప్పి ఆ స్కీమ్‌కు ‘అంబేద్కర్ అభయహస్తం’ అని పేరు పెట్టి.. ఆ పథకాన్ని అమలు చేయకుండా అం బేద్కర్‌ను కాంగ్రెస్ అవమానిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. దళితబంధు, రైతుబంధు లాం టి పథకాలు తేవాలంటే నాయకుడికి ‘ఖలేజా’ ఉండాలని, ఆ ఖలేజా ఉన్న నాయకుడు మా కేసీఆర్ అని స్పష్టంచేశారు.
చేవెళ్ళలో మల్లికార్జున ఖర్గేను పిలిచి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఇందిరమ్మ ఇంటికి రూ.6 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు జాగ లేకపోతే జాగ కూడా ప్రభుత్వమే ఇస్తదని చెప్పారని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పది పాస్ అయితే రూ.10 వేలు, ఇంటర్ పాస్ అయితే రూ.15 వేలు, పీజీ పాస్ అయితే రూ.లక్ష, పీహెచ్‌డీ పాస్ అయితే రూ. 5 లక్షలు ఇస్తామని నమ్మ బలికి మోసం చేశారని మండిపడ్డారు.
రెండున్నరేళ్ల కాలంలో రూ.లక్షన్నర కోట్ల కాంట్రాక్టులు సీఎం రేవంత్‌రెడ్డి పిలిచారని, మరి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంట్రాక్టుల్లో 72 శాతం వచ్చాయా అని ప్రశ్నించారు. రేపో మాపో మూసీ ప్రాజెక్టుకు కాంట్రాక్టర్లను పిలుస్తారని, అందులో 72 శాతం కాంట్రాక్టులు ఇస్తారా అని నిలదీశారు.
ఆనాడు కేసీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్‌ను మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరిట మైనారిటీ పిల్లలకు, మహాత్మా జ్యోతిబా ఫూలే పేరిట బీసీ పిల్లలకు, స్వామి వివేకానంద పేరిట అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా రూ.20 లక్షల స్కాలర్‌షిప్‌ను అందజేశారని గుర్తుచేశారు. తాము వచ్చాక ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఆ పిల్లలకు ఒక్క రూపాయి ఇవ్వకుండా వాళ్ల విద్య మధ్యలోనే ఆగిపోయేలా అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మే, జూన్‌లో ఎస్సీ, ఎస్టీల కోసం సభలు
కాంగ్రెస్ చేసిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ మోసాన్ని ప్రతి గిరిజన తండాకు, ప్రతి దళిత వాడకు తెలిసేలా చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం, జగిత్యాలలో బహిరంగ సభ తర్వాత మే, జూన్ నెలల్లో ఎక్కడో ఒక దగ్గర ఎస్సీ, ఎస్టీల కోసం సభలు ప్రారంభిద్దామని స్పష్టం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ల డిక్లరేషన్, వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యువజన డిక్లరేషన్, ఇక్కడ విద్యార్థి డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్.. ఇలా ప్రతి దాని మీద కాంగ్రెస్ చేసిన హామీలపై మనం పకడ్బందీగా పోరాడాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసే వరకు అంబేద్కర్ స్ఫూర్తితో తమ పోరాటం ఆగదని స్పష్టంచేశా రు. అంబేర్కర్ పేరును సెక్రటేరియట్‌కు పెట్టడంతోపాటు పార్లమెంట్ కొత్త భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని స్పష్టంచేశారు.
కార్యక్రమంలో మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, పార్టీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.






