దళితోద్యమాలకు దిక్సూచి అంబేద్కర్
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు ఆంధ్రప్రదేశ్‌లో దళిత ఉద్యమానికి నిరంతర స్ఫూర్తినిస్తున్నాయి. గౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం సాగిన సుదీర్ఘ పోరాట చరిత్రను ఈ ఉద్యమం ప్రతిబింబిస్తుంది. దళితులలో ఆత్మగౌరవ భావం ఒక్కసారిగా పుట్టుకురాలేదు. దశాబ్దాల సామాజిక సంస్కరణలు, రాజకీయ చైతన్యం, సిద్ధాంత పరమైన మార్పుల ఫలితంగా ఇది అభివృద్ధి చెందింది.
పూర్వ హైదరాబాద్ రాష్ర్టంలో ప్రారంభమైన ఈ చైతన్యానికి భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి వంటి సంస్కర్తలు నాయకత్వం వహించారు. బొజ్జా తారకం, కత్తి పద్మారావు వంటి నేతలు నిరసనలను సమీకరించడంలో కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వంటి వేదికలను నిర్మించి ఉద్యమాన్ని బలోపేతం చేశారు. ఈ దశలో దళిత ఉద్యమం సిద్ధాంతపరంగా కొత్త పుంతలు తొక్కింది. కులం, వర్గం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి కార్యకర్తలు కషి చేశారు.
కారంచేడు సంఘటన నేపథ్యంలో దళిత, రాడికల్, ప్రగతిశీల సంస్థలు కలిసి ఆల్ ఇండియా దళిత్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశాయి. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ వైపు ‘చలో అసెంబ్లీ’ ర్యాలీ నిర్వహించారు. రాష్ర్టం నలుమూలల నుంచి సుమారు ఐదు లక్షల మంది ఈ మహా ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రముఖ దళిత నాయకులు, మానవ హక్కుల కార్యకర్తలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ భారీ నిరసన ప్రభావంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం దిగివచ్చింది. శాసనసభలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. దళితులపై దాడులను ప్రభుత్వం అంగీకరించి విచారణ కోసం న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 1985 సెప్టెంబర్ 1న జరిగిన ‘చలో చీరాల’ సభ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచింది.
మూడు లక్షలకు పైగా దళితులు ఈ సభకు హాజరై తమ ఆవేదనను నినాదాల రూపంలో వినిపించారు. తమ తరఫున ఇతరులు మాట్లాడాల్సిన అవసరం లేదని వారు తెగేసి చెప్పారు. గద్దర్ ఈ సభను ప్రారంభించి సాంస్కృతిక బలాన్ని ఇచ్చారు. ఇలాంటి ఉద్యమాలన్నిటికీ బీఆర్ అంబేద్కర్ ఒక దిక్సూచి.
డాక్టర్ ముచ్చుకోట సురేష్‌బాబు




