30-07-2024 01:19:18 AM
మహేశ్వరం, జూలై 29: అమ్మా బైలెల్లినాదో..తల్లీ బైలెల్లినాదో అంటూ వినసొం పైన గీతాలు, డప్పు దరువులు, ధూంధాం నృత్యాల నడుమ అమ్మవారు అంబారీపై ఊరేగారు. మహంకాళి అమ్మవారి రూపాన్ని ప్రతిష్ఠించిన ఊరేగింపుతో వీధులన్నీ జనసంద్రమయ్యాయి. లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా సోమవారం అమ్మవారి ఘటా ల ఊరేగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఊరేగింపులో కళాకారుల నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం తో వీధులన్నీ జన సంద్రమయ్యాయి. కాగా, రాజ్‌భవన్‌లో జరిగిన బోనాల వేడుకల్లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు.
లాల్‌దర్వాజలో భవిష్యవాణి వినిపించిన అనురాధ..
లాల్‌దర్వాజ అమ్మవారి ఆలయం ముం దు ఏర్పాటు చేసిన పచ్చికుండపై నిల్చొని అమ్మవారి భక్తురాలు అనురాధ భవిష్యవాణి వినిపించారు. పిల్లలకు ఎన్ని కష్టాలు వచ్చినా కాపాడుకుంటానని అన్నారు. భక్తిశ్రద్ధలతో ఆరు వారాలు తనకు సాక పెట్టాలని కోరారు. బస్తీలో బొడ్రాయి పూజలు నిర్వహించాలని, ఐదో వారం నిండుకుండతో బోనం సమర్పించాలని కోరారు. కరోనా వంటి విష జ్వరాలు ఎన్ని వచ్చినా ప్రజలను కాపాడడానికి నేనున్నానని భరోసా ఇచ్చా రు. ఆలయాన్ని విస్తరించాలని ప్రతి ఏడాది చెబుతున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదని భవిష్యవాణి వినిపించారు.
ఊరేగింపును ప్రారంభించిన సీపీ..
హరిబౌలీ శ్రీ అక్కన్న మాదన్న ఆలయంలో అమ్మవారిని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం జెండా ఊపి ఘటాల ఊరేగింపు వేడుకలను ప్రారంభించారు.
ముషీరాబాద్‌లో..
ముషీరాబాద్: లోయర్ ట్యాంక్‌బండ్‌లోని శ్రీ కనకాల కట్టమైసమ్మ ఆలయంలో ఘటాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహంకాళి ఆలయ ప్రాంగణంలో పచ్చికుండపై అమ్మవారి పూనకంతో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రజలను చల్లంగా చూస్తానని అన్నారు. ప్రతి పౌర్ణమి నాడు హోమం నిర్వహించాలని కోరారు.