22 March, 2026 | 2:34 AM

అభివృద్ధికి నమూనా ఏమిటి?

22-03-2026 01:06 AM

ప్రజామోదం, ప్రజల భాగస్వామ్యం ఉండాలి

* మూసీ ప్రాజెక్ట్ ఖర్చుపై విభిన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మొదట సుమారు రూ. 16,000 కోట్లుగా ఉన్న అంచనాలు, తర్వాత రూ. 1.5 లక్షల కోట్ల వరకు పెరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భారీ వ్యత్యాసం ప్రజల్లో అనుమానాలను రేకెత్తించడంతోపాటు ఇది అభివృద్ధి ప్రాజెక్టా? లేక అవినీతి అవకాశాల వేదికా? అన్న ప్రశ్నల్ని ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి.

* ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కేవలం నిర్మాణాలు, ప్రాజెక్టులకే పరిమితం కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం వంటి అంశాలను కూడా కలిగిఉండాలి. ప్రజల విశ్వాసం లేకుండా జరిగే అభివృద్ధి ఎప్పటికీ పూర్తి విజయాన్ని సాధించదు. ప్రజలను భాగస్వాములుగా చేసుకుని ముందుకు సాగినప్పుడే అభివృద్ధి సమాజానికి ఉపయోగపడుతుంది. 

కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఆయా ప్రభుత్వాలు భారీస్థాయిలో అభివృద్ధి పేరిట అనేక కార్యక్రమా లను చేపట్టడం సహజం. కొత్త రహదారులు, ఫ్లైఓవర్లు, పరిశ్రమలు, నదుల అభి వృద్ధికి ప్రాజెక్టులు, పట్టణ మౌలిక సదుపాయాల విస్తరణ వంటి కార్యక్రమాలను అమలు చేస్తుంటాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధిస్తామని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ ఈ ప్రాజెక్టులు అమలులోకి వచ్చేసరికి ప్రజల నుంచి వ్యతి రేకత ఎదురవుతున్నది.

అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజామోదం కంటే అభ్యంతరాలే ఎక్కువగా కనిపించడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. తెలంగాణలో ఇటీవల ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. మౌలిక సదుపాయాల విస్తరణ, నగరాభివృద్ధి, పరిశ్రమల ప్రో త్సాహం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను ప్రకటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టులు అమలులోకి వచ్చినప్పుడల్లా స్థానిక ప్రజల నుంచి అభ్యంతరాలు, నిరసనలు వినిపిస్తున్నాయి.

దీంతో అభివృద్ధి అంటే నిజంగా ప్రజలందరికీ లాభం చేకూర్చేదేనా? లేక కొంతమందికే ప్రయోజన మా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఈ సందర్భంగా అభివృద్ధికి అనుసరిస్తున్న నమునాలేమిటి అన్న ప్రశ్న కూడా తలెత్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాం శంగా మారిన మూడు ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు.. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్, ఇండస్ట్రియల్ కారిడార్లు, రీజినల్ రింగ్ రోడ్. ఈ మూడు ప్రాజెక్టుల చుట్టూ అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల వంటి అంశాలపై చర్చ నడుస్తోంది. 

ఆశలు, ఆందోళనలు..

హైదరాబాద్ నగరం మధ్యగా ప్రవహించే మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ను ప్రభుత్వం నగర అభివృద్ధిలో కీలక కార్యక్రమంగా భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా నది శుద్ధి, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, పర్యాటక అవకాశాల విస్తరణ వంటి లక్ష్యాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ మరోవైపు ఈ ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ నగరానికి జీవనాడిగా ఉన్న మూ సీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో, ప్రజావర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

ఒకవైపు ప్రభుత్వం దీన్ని నగర భవిష్యత్తుకు కీలక ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తుండగా, మరోవైపు భారీ ఖర్చు లు, పారదర్శకత లోపం, అవినీతి ఆరోపణలు వంటి అంశాలు వివాదాలకు కారణ మవుతున్నాయి. మూసీ ప్రాజెక్ట్ ఖర్చుపై విభిన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రా రంభంలో సుమారు రూ. 16,000 కోట్లు గా ఉన్న అంచనాలు, తర్వాత రూ. 1.5 లక్షల కోట్ల వరకూ పెరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ భారీ వ్యత్యాసం ప్రజల్లో అనుమానాలను రేకెత్తించడంతోపాటు ఇది అభివృద్ధి ప్రాజెక్టా? లేక భారీ అవినీతి అవకాశాల వేదికా? అన్న ప్రశ్నలు ప్రతిపక్షాలు, పౌరసంఘాలు లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వ కపోతే, ఇది రాజకీయంగా ప్రతికూలంగా మారే అవకాశముందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూసీ ప్రాజెక్ట్‌పై వివాదాలు ఉన్నప్పటికీ, దీనికి ప్రజా కో ణంలో ఒక స్పష్టమైన అవసరం ఉంది. నగరంలో పెరుగుతున్న కాలుష్యం, వరదల ప్రమాదం కారణంగా ఈ ప్రాజెక్టు అవసరం లేదని ఎవరూ చెప్పడం లేదు.

కానీ ఎలా అమలు చేస్తారన్నదే అసలు ప్ర శ్నగా మారింది. డీపీఆర్‌ను పబ్లిక్ డొమైన్‌లో ఉంచడంతోపాటు ప్రజల నుంచి, నిపుణుల నుంచి సూచనలు తీసుకోవాలి. ఇలా చేయకుండా నేరుగా టెండర్లు పిలిస్తే అనుమానాలు పెరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీనితోపాటు ఎన్ని కుటుంబాలు ప్రభావితమవుతాయి, వారికి పున రావాసం వంటి వివరాలు డీపీఆర్‌లో పొందుపర్చాలి.

ప్రాజెక్ట్‌ను ఒకేసారి భారీగా అమలు చేయడం కంటే దశలవారీగా అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంచనాలను అసాధారణంగా పెంచడం, కొంద రు సంస్థలకు అనుకూలంగా అర్హతలు రూపొందించడం, తక్కువ బిడ్డర్లతో టెండర్లు, కార్టెల్ వ్యవస్థ వంటి లూటిఫికేషన్‌కు దారితీస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. అయితే మూసీ ప్రాజెక్టు అభివృద్ధి పేరుతో చేసే ఖర్చా? లేక ప్రజల కోసం చేసే మార్పా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

మరో రెండు వివాదాలు.. 

తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అనేక ఇండస్ట్రియల్ కారిడార్లను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఇవి కీలకమని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమల స్థాపన జరిగితే స్థానిక యువతకు ఉద్యోగాలు వస్తాయని, ప్రాంతీయ అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే పరిశ్రమల కోసం అవసరమైన భూములు సేకరించాల్సి రావడంతో రైతుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

భూమి కోల్పోయిన తర్వాత తమ జీవనోపాధి ఎలా కొనసాగించాలని, ప్రభుత్వం పరిహారం ఇస్తున్నప్పటికీ అది భవిష్యత్తుకు సరిపోదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు భూముల స్వాధీనం ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నిరసనలు కూడా చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టూ అభివృద్ధిని విస్తరించేందుకు ప్రభుత్వం చేపట్టిన మరో కీలక ప్రాజెక్టు రీజినల్ రింగ్ రోడ్డు.

ఈ రహదారి ద్వారా నగరంపై ఉన్న ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని, చుట్టుపక్కల జిల్లాల్లో అభివృద్ధి వేగవంతమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ రహదారి పూర్తయితే పరిశ్రమలు, లాజిస్టిక్స్ హబ్‌లు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి వేగంగా జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు కూడా భూసేకరణే సమస్యగా మారింది. పరిహారం, పునరావాసం అంశాలపై స్పష్టత లేకపోవడం వల్ల  రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 

ప్రాజెక్టుల ప్రారంభం నుంచే..

ప్రస్తుతం రాష్ట్రంలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభ దశ నుంచే వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నాయి. ప్రభు త్వం ప్రకటించే ప్రతీ పెద్ద ప్రాజెక్టుకు ఒకవైపు మద్దతు లభిస్తుండగా, మరోవైపు అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్థాని క ప్రజలు, పర్యావరణ కార్యకర్తలు, సామాజిక సంస్థలు, రాజకీయ పార్టీలు వంటి వర్గాలు ప్రాజెక్టులపై వివిధ కోణాల్లో ప్రశ్న లు లేవనెత్తుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ అభ్యంతరాలు నిరసనలుగా మారుతున్నాయి.

మరికొన్ని సందర్భాల్లో కోర్టుల్లో కేసులు కూడా నమోదవుతున్నాయి. దీంతో ప్రాజెక్టుల అమలు ఆలస్యం కావడం లేదా మార్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అభివృద్ధి ప్రాజెక్టుల చుట్టూ తిరిగే ప్రధాన వివాదం భూముల స్వాధీనం. పరిశ్రమలు, రహదారులు, నగర విస్తరణ ప్రాజెక్టులు అమలు చేయాలంటే విస్తారమైన భూములు అవసరం అవుతాయి.

ఈ క్రమంలో రైతుల భూములు, గ్రామాల పరిసర ప్రాంతాలు ప్రభుత్వ అవసరాల కోసం స్వాధీనం చేసుకోవాల్సి వస్తోంది. భూమి కోల్పోయిన తర్వాత తమ జీవనోపాధి ఏమవుతుందో అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు భూమి కోల్పోవడం అంటే కేవలం ఆస్తి కోల్పోవడం మాత్రమే కాదు, జీవనాధారం కోల్పోవడమే అని రైతులు చెబుతున్నారు. పరిహారంతోపాటు దీర్ఘకాలిక భద్రత కల్పించే విధంగా పునరావాస పథకాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. 

రాజకీయ అంశాలుగా..

అభివృద్ధి ప్రాజెక్టులు రాజకీయంగా కూడా చర్చకు వస్తుంటాయి. అధికార పార్టీ ఈ ప్రాజెక్టులను తమ పాలన విజయంగా చూపించడానికి ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్ష పార్టీలు మాత్రం వాటిలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రజా సమస్యలు నిజంగానే ఉన్నప్పటికీ, అవి రాజకీ యంగా కూడా వాడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో అసలు సమస్యలపై స్పష్టమైన చర్చ జరగ కుండా రాజకీయ వాదోపవాదాలుగా మారిపోతున్నాయి.

ప్రస్తు తం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నప్పటికీ, మరోవైపు సామాజిక, పర్యా వరణ సమస్యలను కూడా తెరపైకి తీసుకొస్తున్నాయి. అందుకే అభివృద్ధి కేవలం నిర్మాణాలు, ప్రాజెక్టులకే పరిమితం కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం వంటి అంశాలను కూడా కలిగిఉండాలి. ప్రజల విశ్వాసం లేకుండా జరిగే అభివృద్ధి ఎప్పటికీ పూర్తి విజయాన్ని సాధించదు. ప్రజలను భాగస్వాములుగా చేసుకుని ముందుకు సాగినప్పుడే అభివృద్ధి సమాజానికి ఉపయోగపడుతుంది. 

అభివృద్ధి ఫలాలు ఎవరికి?.. 

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితం ఎవరికి దక్కుతున్నదనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ ప్రాజెక్టుల వల్ల నిజంగా లాభపడేది ఎవరు? ప్రభుత్వాలు చెబుతున్నట్లుగా సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? లేకపోతే కొంతమంది వ్యాపార వర్గాలు, పెట్టుబడిదారులకే ఎక్కువ ప్రయోజనం జరుగుతోందా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి వల్ల నగరాల విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తుంది. పెట్టుబడులు పెరుగుతాయి.

అయితే అదే సమయంలో భూములు కోల్పోయిన ప్రజలు కొత్త జీవనోపాధి కోసం పోరాడాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల భూముల ధరలు పెరిగి కొంతమంది లాభపడుతున్నా, భూమి కోల్పోయిన రైతులు మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్ద ప్రాజెక్టులు ప్రకటించినప్పుడు ప్రభుత్వం వాటిని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచే కార్యక్రమాలుగా ప్రదర్శిస్తుంది.

రోడ్లు, ఫ్లైఓవర్లు, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు వంటి కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అవసరమని చెబుతుంది. కానీ ప్రాజెక్టులు అమలు దశకు చేరుకునే సరికి స్థానిక ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. భూముల స్వాధీనం, పునరావాస సమస్యలు, పర్యావరణ ప్రభావం, పారదర్శకత లోపం వంటి అంశాలు ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. చాలాసార్లు ప్రాజెక్టు గురించి పూర్తి సమాచారం ప్రజలకు ముందుగా ఇవ్వకపోవడం వల్లే అనుమానాలు మరింత పెరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

పారదర్శకత లోపం.

అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రజల్లో అనుమానాలు పెరగడానికి మరో కారణం పారదర్శకత లోపం. చాలా సందర్భాల్లో ప్రాజెక్టు వివరాలు, వ్యయ అంచనాలు, భూముల అవసరం, పర్యావరణ ప్రభావం వంటి అంశాలు పూర్తిగా ప్రజలకు తెలియడం లేదు. ప్రాజెక్టు అమలు ప్రారంభమైన తర్వాతే చాలా విషయాలు బయటకు రావడం వల్ల ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. అభివృద్ధి ప్రాజెక్టులపై వస్తున్న అభ్యంతరాలకు ప్రధాన పరిష్కారం ప్రజల భాగస్వామ్యమే అని నిపుణులు చెబుతున్నారు.

ప్రాజెక్టు ప్రణాళిక దశలోనే స్థానిక ప్రజలు, నిపుణులు, పౌరసంఘాలతో చర్చలు జరిపితే సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టు రూపకల్పన చేయడం, నష్టపోయేవారికి సరైన పునరావాసం కల్పించడం, పారదర్శకంగా సమాచారం ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల మద్దతు పెరుగుతుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. 

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి