calender_icon.png 8 December, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌కు జైకొట్టిన అమ్రాద్ తండా గ్రామం

08-12-2025 12:04:19 AM

  1. సర్పంచ్‌గా నందిని, ఉప సర్పంచ్‌గా సంతోష్‌లతో పాటు 8 వార్డులూ ఏకగ్రీవం 

గిరిజన తండాల్లో వెలుగులు నింపింది కేసీఆరే

కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత 

బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 

మాక్లూర్, డిసెంబర్7 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గం పరిధిలోని మాక్లూర్ మండలం అమ్రాద్ తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కు జై కొట్టింది. గులాబీ పార్టీకి కంచుకోటలాగా పరిగణించే అమ్రాద్ తండా వాసులంతా ఏకతాటిపైకొచ్చి బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసేలా చేశారు. సర్పంచ్ గా నందిని, ఉప సర్పంచ్ గా సంతోష్ లతో పాటు ఎనిమిది వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం అమ్రాద్ తండాలో పర్యటించిన బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి విజేతలను అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ 2014లో తన రాజకీయ ప్రస్థానం అమ్రాద్ తండా నుంచే ప్రారంభమైందన్నారు. తాను పోటీ చేసిన ప్రతీసారి అమ్రాద్ తండా అండగా నిలిచిందన్నారు.

ఇప్పుడు గ్రామపంచాయతీ కూడా గంపగుత్తగా బీఆర్‌ఎస్ పరం కావడం తనకు సంతోషంగా ఉందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనులకు కేసీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. తండాలను, గూడాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దన్నారు. గిరిజనుల జనాభా పెరిగిన దృష్ట్యా వారికి 10 శాతం రిజర్వేషన్లను కల్పించే విధంగా కృషి చేశారని,  గిరిజనులు సాగు చేస్తున్న పోడు  భూములకు హక్కు పత్రాలు ఇచ్చి వాటికి రైతుబందు పథకాన్ని వర్తింపజేసిన కేసీఆర్ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.

గిరిజన విద్యార్థుల కోసం గురుకులాలు, సీఎం ఎస్టీఈఐ పథకం, గిరి వికాస్, గిరి పోషణ, హైదరాబాద్ నడిబొడ్డున ఆత్మగౌరవ భవనాల నిర్మాణం వంటి వినూత్నమైన కార్యక్రమాలు గిరిజనులకు మేలు చేశాయన్నారు. ఈ విధంగా ఎన్నో ఏండ్ల గిరిజన కలలను సాకారం చేసిన స్వాప్నికుడు కేసీఆర్ సేవలను ఈరోజు గిరిజన జాతి గుర్తుపెట్టుకుంది కాబట్టే అమ్రా తండాల్లాంటి ఎన్నో గిరిజన పల్లెలు బీఆర్‌ఎస్ కు అండగా నిలుస్తున్నాయన్నారు.  ఇదిలా ఉండగా పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన తెలంగాణ రాష్ట్రానికిస్వర్ణ యుగంగా జీవన్ రెడ్డి అభివర్ణించారు.

కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. అబద్దాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఆరు గ్యారెంటీలు, 420 హామీలకు ఉప్పు పాతరేసి ప్రజలను వంచించారని ఆయన మండిపడ్డారు. రైతు బంధు కు రాం రాం పలికారని, దళిత బంధు జైభీమ్ అయిందని, కళ్యాణ లక్ష్మీ, షాఫీముబారక్ కింద తులం చొప్పున బంగారం ఇస్తామన్న హామీ అటకెక్కిందని ఆయన విమర్శించారు. కేసీఆర్ రైతుల కోసం పాటుపడ్డారన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా  వంటి పధకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని ఆయన తెలిపారు.

రెండేళ్లలో ఆర్మూరు నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమిటో కాంగ్రెస్ నేతలు, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, తాను పదేళ్లు ఆర్మూరు నియోజక వర్గ ప్రజల కోసం జీతగాడిలా పని చేసానని జీవన్ రెడ్డి అన్నారు. అమ్రా తండా దుర్గామాత ఆశీస్సులతో ఇక ముందు కూడా ఆర్మూరు జనం కోసం జీతగాడిలా పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. మళ్లీ కారు,  సారు, కేసీఆరే రావాలని అన్ని గ్రామాలు నినదిస్తున్నాయన్నారు. కేసీఆర్ నాయకత్వం బలపడితేనే తెలంగాణ  సేఫ్ అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.