ఒక సామ్రాజ్య పతనం!
* కేసీఆర్ చుట్టూ చేరిన కోటరీలోని వారంతా వారి సొంత అవసరాల కోసం కేసీఆర్‌ను ముఖస్తుతి చేయటం మొదలుపెట్టారు. ప్రజలకు మేలు చేయాల్సిందిపోయి సొంత లాభాలు చూసుకొన్నారు. కేసీఆర్ కూడా తెలంగాణ కోసం త్యాగాలు చేసినవారిని పూర్తిగా మర్చిపోయారు. కాంట్రాక్టులు, రియల్‌ఎస్టేట్, వ్యాపారాలు.. ఇలా అన్నీ ఆంధ్రా పెత్తందారులకే అప్పజెప్పారు.
* కేసీఆర్ మాటకారితనం, వాగ్ధాటితో ఎలాంటి పరిస్థితులనైనా తనకు అనుకూ లంగా మార్చుకోగలరు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఆయనే స్టార్ క్యాంపెయినర్. కానీ, ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలే కేసీఆర్‌కు చెడ్డపేరు తెచ్చిపెట్టారు. ప్రజలెవ రైనా ఏదైనా పనికోసం ఎమ్మెల్యేల వద్దకు వెళ్తే.. ‘మా చేతుల్లో ఏమీ లేదు. అధికా రాలు, డబ్బు అంతా కేసీఆర్ చుట్టూ ఉన్న ఆరుగురి చేతుల్లోనే ఉన్నది’ అని చెప్తూ కేసీఆర్‌ను మరింత బద్నాం చేశారు.
* సాక్షాత్తూ కేసీఆరే తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దల సమావేశంలో ‘దళితబంధులో లబ్ధిదారుల నుంచి ఏ ఎమ్మెల్యే ఎంత కమీషన్ తీసుకొన్నారో నా దగ్గర సమాచారమంతా ఉన్నది. కొందరు రెండు మూడు లక్షలు వసూలు చేసినట్టు నాకు తెలిసింది’ అని ప్రకటించారు. దీన్నిబట్టే పథకాల అమలు ఎంత గొప్పగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
* లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్ వ్యూహాల లోపం, నిధుల కొరతతో ఒక్క సీటు కూడా గెలువలేకపోయింది. పదేండ్లు ప్రభుత్వాన్ని నడిపిన పార్టీ ఆరు నెలల్లోనే కేవలం 16 శాతం ఓట్లతో ఏకంగా మూడో స్థానానికి పరిమితమైంది. ఇదంతా కేసీఆర్ సెల్ఫ్‌గోల్ మాత్రమే. ఇప్పుడు పార్టీని మళ్లీ మొదటి నుంచి పునర్నిర్మించే అవకాశం కేటీఆర్ చేతిలో ఉన్నది.
సామ్రాజ్య నిర్మాతలే దాని పతనానికి కూడా కారకులవు తారన్నది చరిత్ర సత్యం. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరిగింది. తెలంగాణలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఓటమి ఉన్నదా? అని ఆరేడు నెలల కిందటివరకు అందరూ అనుకొనేవారు. తెలంగాణ ఉద్యమ సారధిగా, ముఖ్యమంత్రిగా ఆయనకు ఉన్న పరపతి అలాంటిది. నిజానికి కేసీఆర్‌కు తెలంగాణలోని ప్రతి ఇంచు తెలుసు. అత్యంత మారుమూల ప్రజల నాడి కూడా పట్టగలడు. రాష్ట్రంలోని ప్రతి ప్రజా సంస్థ గురించి ఆయనకు కొట్టిన పిండే.
అందుకే ఉద్యమకాలంలో రైతులు, విద్యార్థులు, సామాన్యులు, కళాకారులు, ఉద్యోగులు, యువత, వృద్ధులు, ఎన్జీవోలు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను ఒక్క త్రాటిపైకి తేగలిగారు. అందరినీ కలుపుకుపోయి ఉద్యమం నిర్మించి ప్రత్యేక రాష్ట్రాన్ని తేగలిగారు. కొత్తరాష్ట్రానికి పదేండ్లు సీఎంగా సారధ్యం కూడా వహించారు. ఇంత చేసిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు? తాజాగా పార్లమెంటు ఎన్నికల్లో మరింత దారుణంగా ఒక్క సీటు కూడా గెలువలేక.. కేవలం 16 శాతం ఓట్లకే ఎందుకు పడిపోయారు. దీనికంతకటికీ కేసీఆర్ స్వయంకృతమే కారణం.
మారిపోయిన కేసీఆర్
తెలంగాణ ఉద్యమం నడుస్తున్నంత కాలం ప్రజా నాయకుడిగా, ఉద్యమ నాయకుడిగా ప్రజలతో మమేకమైన కేసీఆర్.. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారో అప్పుడే పూర్తిగా మారిపోయారు. తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. అప్పటివరకు ఉద్యమకారులను వెంటేసుకొని తిరిగిన ఆయన.. సీఎం కాగానే వారిని దూరం పెట్టారు. తన చుట్టూ స్వార్థపరులైన కోటరీని చేర్చుకొన్నారు. వారు ఎన్నడూ ఉద్యమంలో పాల్గొన్నవారు కూడా కాదు. ఎవరి దోపిడీకి వ్యతిరేకంగానైతే పోరాడి స్వరాష్ట్రం సాధించుకొన్నామో.. అదే ఆంధ్రా పెత్తందారులను అక్కున చేర్చుకొన్నారు. దానికి ‘తెలంగాణ పునర్నిర్మాణం’ అని అందమైన అబద్ధపు పేరు పెట్టారు.
ఉద్యమకాలంలో నడపటం తనవల్ల కాదని వదిలేసిన నమస్తే తెలంగాణ దినపత్రికను, ఆయన సీఎం కాగానే తిరిగి తీసేసుకొన్నారు. ఉద్యమ సమయంలో నాటి సమైఖ్య పాలకులకు ఎదురు నిలిచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని పత్రికను నిలబెట్టినవారికి మళ్లీ దానిని సొంతం చేసుకొన్న సమయంలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. తెలంగాణలో మాట తప్పటం కన్నా పెద్ద నేరం మరేదీ ఉండదు. కేసీఆర్ చుట్టూ చేరిన కోటరీలోని వారంతా వారి సొంత అవసరాల కోసం కేసీఆర్‌ను ముఖస్తుతి చేయటం మొదలుపెట్టారు. ప్రజలకు మేలు చేయాల్సిందిపోయి సొంత లాభాలు చూసుకొన్నారు. కేసీఆర్ కూడా తెలంగాణ కోసం త్యాగాలు చేసినవారిని పూర్తిగా మర్చిపోయారు. కాంట్రాక్టులు, రియల్‌ఎస్టేట్, వ్యాపారాలు.. ఇలా అన్నీ ఆంధ్రా పెత్తందారులకే అప్పజెప్పారు.
పెరిగిపోయిన అహంకారం
అధికారం కేసీఆర్‌లో అహంకారం పెంచిందని ఆయన వ్యవహార శైలి చూస్తేనే అర్థమవుతుంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎనాడూ తెలంగాణ ఉద్యమకారులను కలువలేదు. బీఆర్‌ఎస్‌లోని ఉద్యమకారులైన ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా పక్కనబెట్టి ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినవారికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇదేమిటని అడిగితే ‘రాజకీయ పునరేకీకరణ’ అని మరో అబద్ధం చెప్పారు. ప్రజలు ఆయనకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చినా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కోవటంతో తెలంగాణ ప్రజల్లో ఆయన మరింత పలుచన అయిపోయారు.
మరోవైపు బీఆర్‌ఎస్ (టీఆర్‌ఎస్)లో పాతవారు, కొత్త వారి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. కేసీఆర్ రాజకీయ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పుల్లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోవటం కూడా ఒకటి. ఆ ఘటనతో కాంగ్రెస్ బలం 6 ఎమ్మెల్యేలకు పడిపోవటంతోపాటు ఆ పార్టీ బలహీనపడింది. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న బీజేపీ వెంటనే అందివచ్చిన అవకాశాన్ని గట్టిగా ఒడిసిపట్టింది. క్రమంగా బీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ మారిపోయింది.
ధనిక రాష్ట్రం అంటూనే అప్పుల పాలు
కేసీఆర్ పదేండ్ల పాలనలో ప్రభుత్వపరంగా ఎన్నడూ ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్టుగా కనిపించలేదు. పేరుకోసం వెనుకాముందూ చూసుకోకుండా పథకాలు ప్రకటించటం, వాటికి నిధుల కోసం అప్పులు చేయటమే ప్రభుత్వం పని అయిపోయింది. అంతేకాకుండా గతంలో ఎన్నడూ చూడని విధంగా రెవెన్యూ, పోలీస్ అధికారాలన్నీ ఎమ్మెల్యేల చేతిలో పెట్టేశారు. దీంతో ఎమ్మెల్యేలు చెలరేగిపోయారు. ఆ అధికారాలను ప్రజా సమస్యల పరిష్కారానికి వాడాల్సిన ఎమ్మెల్యేలు.. భూ కబ్జాలు, నేరాలు మొదలుపెట్టారు. ఇసుక, లిక్కర్ మాఫియాకు తెరలేపారు.
దీంతో ప్రజల విశ్వాసం కోల్పోయారు. చివరకు కేసీఆర్ చుట్టూ మచ్చుకు కూడా ఒక్క నిజాయితీపరుడు లేకుండా పోయాడు. పార్టీని పట్టించుకోవటం మానేశారు. ఆయన చుట్టూ చేరినవారంతా కోట్లకు పడగలెత్తారు. కేసీఆర్‌కు, పార్టీకి కావాల్సినంత చెడ్డపేరు తెచ్చిపెట్టారు. మరోవైపు కేసీఆర్ ప్రగతి భవన్‌లో స్వీయ నిర్బంధం విధించుకొన్నారు. ప్రజలనే కాదు.. బీఆర్‌ఎస్ కీలక నేతలను కూడా కలువటం మానేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా సీఎం అపాయింట్‌మెంట్ కోసం నెలలపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. మంత్రులే ఆయన పిలుపుకోసం నెలల తరబడి ఎదురుచూసేవారు. అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రమే ఆయన బయటకు వచ్చారు.
సొంతవాళ్లే ముంచారు
కేసీఆర్ మాటకారితనం, వాగ్ధాటితో ఎలాంటి పరిస్థితులనైనా తనకు అనుకూలంగా మార్చుకోగలరు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఆయనే స్టార్ క్యాంపెయినర్. కానీ, ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలే కేసీఆర్‌కు చెడ్డపేరు తెచ్చిపెట్టారు. ప్రజలెవరైనా ఏదైనా పనికోసం ఎమ్మెల్యేల వద్దకు వెళ్తే.. ‘మా చేతుల్లో ఏమీ లేదు. అధికారాలు, డబ్బు అంతా కేసీఆర్ చుట్టూ ఉన్న ఆరుగురి చేతుల్లోనే ఉన్నది’ అని చెప్తూ కేసీఆర్‌ను మరింత బద్నాం చేశారు. ఎమ్మెల్యేలంతా అవినీతి అక్రమాల్లో మునిగి తేలుతున్నారని తెలిసినా అసెంబ్లీ ఎన్నికల్లో వారికే టికెట్లు ఇవ్వటం కూడా ప్రజలకు కోపం తెప్పించింది.
కనీసం 20 చోట్ల అభ్యర్థులను మార్చినా ఫలితం వేరేలా ఉండేది. అభ్యర్థులను మార్చకపోవటం ఆయన చేసిన మరో పెద్ద తప్పు. కేవలం డబ్బుతో ఓట్లు కొనుక్కోవచ్చని, అలా దశాబ్దాలపాటు తెలంగాణను ఏలవచ్చని బీఆర్‌ఎస్ భావించింది. కానీ, ఆశ్చర్యకరంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనూహ్యంగా పుంజుకొన్న కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్‌ఎస్‌తో పోటీపడి డబ్బు ఖర్చు పెట్టింది. ఆ పార్టీకి ప్రజలే స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వ్యాపారాలు, రాజకీయాల్లో ఒకే కులానికి ప్రాధాన్యం ఇవ్వటం కూడా కేసీఆర్ చేసిన తప్పుల్లో ఒకటి.
ప్రజలకు చేరని పథకాలు
ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని కేసీఆర్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొన్నది. తన పత్రిక నమస్తే తెలంగాణలో అలాగే ఊదరగొట్టింది. కానీ, ఆ పత్రికలోని ఏ సమాచారాన్నీ ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వాస్తవం వేరేలా ఉన్నది. దళితబంధు, బీసీబంధు, డబుల్‌బెడ్రూం ఇండ్లు వంటి పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరలేదు. వందలమంది దళితులున్న గ్రామంలో ఒక్కరికో ఇద్దరికో దళిత బంధు ఇచ్చారు. అది కూడా బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలకే ఇచ్చారు.
దీంతో నిజమైన లబ్ధిదారులంతా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఏకమయ్యారు. సాక్షాత్తూ కేసీఆరే తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దల సమావేశంలో ‘దళితబంధులో లబ్ధిదారుల నుంచి ఏ ఎమ్మెల్యే ఎంత కమీషన్ తీసుకొన్నారో నా దగ్గర సమాచారమంతా ఉన్నది. కొందరు రెండు మూడు లక్షలు వసూలు చేసినట్టు నాకు తెలిసింది’ అని ప్రకటించారు. దీన్నిబట్టే పథకాల అమలు ఎంత గొప్పగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అలా డబ్బులు వసూలు చేసిన ఎమ్మెల్యేలను తర్వాత ఎన్నికల్లో పక్కనబెట్టారా అంటే అదీ లేదు. మళ్లీ వారికే టికెట్లు ఇచ్చి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు.
దేవుడు కూడా కాపాడలే..
కేసీఆర్ తప్పులను ప్రజలే కాదు.. చివరకు ప్రకృతి, దైవం కూడా మన్నించలేదు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల అని ప్రభుత్వం ఊదర గొట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ బరాజ్ ఒక్కసారిగా కుంగిపోయింది. దీన్నిబట్టే ఆయనకు పంచభూతాల్లో భాగమైన భూమి, నీరు కూడా సహకరించలేదని అర్థమవుతుంది.
ఎన్నికల ప్రచారంలో ఆయన వాడిన హెలికాప్టర్ తరుచూ మొరాయించింది. ఎన్నికల ప్రచారం జరుగుతుండగానే ఆయన మూడు రోజులు రాజశ్యామల యాగం చేశారు. ఈ యాగ దీక్ష స్వీకరించినవారు యాగం పూర్తయ్యేవకు యాగశాల వదిలి వెల్లకూడదు. కానీ, కేసీఆర్ అగ్నిదేవుడిని ఒంటరిగా వదిలేసి ప్రతిరోజూ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఆ అపచారం ఆయనకు ఎన్నికల ఫలితాల్లో కనిపించింది.
పార్టీ ఫండ్ మింగేసిన ఎమ్మెల్యేలు
విశ్వసనీయ సమాచారం ప్రకారం అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందే కేసీఆర్ ప్రతి ఎమ్మెల్యేకు పార్టీ ఫండ్ పంపించారు. ఎన్నికలు సమీపించిన తర్వాత మరికొంత పంపుతానని హామీ ఇచ్చారు. అయితే, మొదట అందిన పార్టీ ఫండ్‌ను ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేయకుండా తమ సొంతానికి వాడేసుకొన్నారు. తీరా ఎన్నికలు దగ్గరపడిన తర్వాత రెండోసారి పంపుతానన్న నిధులను కేసీఆర్ పంపలేదు. దీంతో కిందిస్థాయి వరకు డబ్బు వెళ్లక పార్టీ క్యాడర్ నైతికంగా బలహీనపడింది. ఎమ్మెల్యేలు కూడా ఎలాగూ ఓడిపోతున్నాం.. ఉన్న డబ్బు కూడా ఖర్చుచేయటం ఎందుకు అనుకొని కార్యకర్తలకు పైసా ఇవ్వలేదు.
ఎన్నికల ప్రచారంలో ‘కేసీఆర్ ఓడితే తెలంగాణ ప్రజలు ఓడిట్టే. ఓడితే నాకు పోయేదేమీ లేదు. ఫాంహౌస్‌లో కూర్చుంటా’ అని బీఆర్‌ఎస్ అధినేత పదేపదే ప్రకటించారు. అదే సమయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన శక్తిమంతమైన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకొన్నారు. భారీగా నిధులు సమీకరించి ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికంటే అద్భుతమైన పథకాలు ప్రకటించి ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్ వ్యూహాల లోపం, నిధుల కొరతతో ఒక్క సీటు కూడా గెలువలేకపోయింది.
పదేండ్లు ప్రభుత్వాన్ని నడిపిన పార్టీ ఆరు నెలల్లోనే కేవలం 16 శాతం ఓట్లతో ఏకంగా మూడో స్థానానికి పరిమితమైంది. ఇదంతా కేసీఆర్ సెల్ఫ్‌గోల్ మాత్రమే. ఇప్పుడు పార్టీని మళ్లీ మొదటి నుంచి పునర్నిర్మించే అవకాశం కేటీఆర్ చేతిలో ఉన్నది. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడగలదో లేదో చూడాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమర్థుడే అయినప్పటికీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలాగా రాష్ట్రంలో పథకాలను సమర్థంగా అమలు చేసి సుపరిపాలన అందించాల్సి ఉంటుంది. బీఆర్‌ఎస్ తన తప్పులను తెలుసుకొని సరిదిద్దుకోగలిగితే వచ్చే నాలుగేండ్లలో మళ్లీ పూర్వవైభవం సంపాదించుకోగలదు. అయితే, ఆ పార్టీ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది.
సి.ఎల్.రాజం
చైర్మన్, విజయక్రాంతి






