21-11-2024 02:02:40 AM
మస్క్‌తో కలిసి హెవీ రాకెట్ ప్రయోగం వీక్షణ
సాంకేతిక సమస్యతో పేలిపోయిన స్టార్‌షిప్ రాకెట్
టెక్సాస్, నవంబర్ 20: అంగారకుడిపైకి ఫెర్రీ క్రూను, చంద్రుడిపైకి వ్యోమగాములను చేర్చేందుకు వీలుగా స్పేస్‌ఎక్స్ తన ఆరో స్టార్‌షిప్ టెస్ట్ రాకెట్‌ను ప్రయోగించింది. దాదాపు 400 అడుగుల ఎత్తున భారీ రాకెట్ టెక్సాస్ వేదికగా బుధవారం నింగిలోకి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రయో గంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం రాకెట్‌లోని బూస్టర్ తిరిగి భూమ్మీదకు వస్తే లాంచ్‌ప్యాడ్ వద్ద ఉండే మెకానికల్ ఆర్మ్స్ దాన్ని పట్టుకోవాలి.
అయితే సాంకేతిక సమ స్య ఎదురవ్వడంతో ౪నిమిషాలకే ‘బూస్టర్ క్యాచ్’ ప్రక్రియను స్పేస్‌ఎక్స్ నిలిపివేసింది. దీంతో రాకెట్‌లోని బూస్టర్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో జలాల్లో కుప్పకూలింది. స్టార్‌షిప్ వాహకనౌక మాత్రం దాదాపు 90 నిమిషాల పాటు భూమి చుట్టూ తిరిగి హిందూ మహాసముద్రంలో సేఫ్‌గా ల్యాండ్ అయింది.
మస్క్‌తో కలిసి
స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగాన్ని ఎలన్ మస్క్‌తో కలిసి డొనాల్డ్‌ట్రంప్ ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రయోగానికి ముందు తాను స్పేస్‌ఎక్స్ రాకెట్ ప్రయోగాన్ని విక్షించేందుకు వెళ్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ట్రంప్ వెల్లడించారు. ’నేను గ్రేట్ స్టేట్ ఆఫ్ టెక్సాస్‌లో స్పేస్‌ఎక్స్ సంస్థ ప్రయోగిస్తున్న రాకెట్ ప్రయోగాన్ని చూడటానికి వెళ్తున్నా. మస్క్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ఈ ప్రయోగాన్ని డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌తోపాటు మరికొందరు రిపబ్లికన్ నేతలు ప్రత్యక్షంగా చూశారు.
అంతరిక్షంలోకి అరటిపండు
స్పేస్‌ఎక్స్ సంస్థ తన స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగంలో జీరో గ్రావిటీ ఇండికేటర్‌గా అరటిపండును ఉపయోగించింది. సాధారణంగా జీరో గ్రావిటీలోకి ప్రవేశించిందీ లేనిది తేలికగా గుర్తించడానికి శాస్త్రవేత్తలు ఓ చిన్న వస్తువును ఉపయోగిస్తారు. స్పేస్‌ఎక్స్ అరటిపండును ఉపయోగించింది.