calender_icon.png 27 January, 2026 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూపీఐ ఎన్నో దేశాలకు అందించాం

21-11-2024 01:50:51 AM

క్యారికామ్ దేశాలు కూడా వాడాలి

ప్రధాని నరేంద్రమోదీ

గయానా, నవంబర్ 20: భారత్ డిజిటల్ పేమెంట్స్ రంగంలో ఎంతో వృద్ధి సాధించిందని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, శ్రీలంక, నేపాల్, మారిషస్ వంటి దేశాలు కూడా భారత పేమెంట్స్ వ్యవస్థ యూపీఐని ఉపయోగిస్తున్నాయని చెప్పారు. గయానా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ బుధవారం ఇండియా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్యారికామ్ దేశాలు కూడా డిజిటల్ పేమెంట్స్ వైపు అడుగులు వేయాలి.

భారత యూపీఐ విధానాన్ని అందిపుచ్చుకోవాలి. సామాన్య ప్రజలు ఉపయోగించేందుకు వీలుగా డిజిలాకర్ వంటి క్లౌడ్ స్టోరేజీ ప్లాట్‌ఫామ్‌ను సైతం తెచ్చాం. దీన్ని క్యారికామ్ దేశాల్లో పైలట్ ప్రాజెక్టుగా లాంచ్ చేయగలం. ప్రజలకు సులభమైన, పారదర్శకమైన పాలన అందించేదుకు డిజిటలైజేషన్ ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు. క్యారికామ్‌లో ఆంగ్ల పదం సీ అంటే క్రికెట్, కల్చర్ అని మోదీ అన్నారు. అది 1983 ప్రపంచకప్ లేదా ఐపీఎల్ అయినా వెస్టిండీస్ క్రికెటర్లకు భారత్‌లో ఏంతో క్రేజ్ ఉందని చెప్పారు. ఈసారి వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను భారత్ అందుకోవడం గర్వకారణంగా భావిస్తున్నట్లు చెప్పారు.      

గయానాతో 10 ఒప్పందాలు

దక్షిణ అమెరికా దేశం గయానాలో భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య 10 ఒప్పందాలు కుదిరాయి. హైడ్రోకార్బన్‌లు, డిజిటల్ పేమెంట్ సిస్టమ్, ఫార్మాస్యూటికల్‌తోపాటు రక్షణ వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు వీలుగా రెండు దేశాలు అంగీకరించాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..ఇండియా ఎనర్జీ సెక్యూరిటీలో గయానా కీలక పాత్ర పోషించబోతున్నట్టు పేర్కొన్నారు.

అంతేకాకుండా ఈ రంగంలో రెండు దేశాల మధ్య సుదీర్ఘ సంబంధాలు కొనసాగేందుకు కృషి చేస్తాం అని పేర్కొన్నారు. గయానాలో జన్ ఔషధి కేంద్రాలను స్థాపిస్తామని చర్చల్లో భాగంగా భారత్ అంగీకరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరగా మోదీ బుధవారం గయానా చేరుకున్నారు. గత 56ఏళ్లలో ఆ దేశంలో పర్యటించిన మొట్టమొదటి భారత ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారు.

ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ప్రధానికి గయానా అధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్ అలీతో సహా ఆయన 12 మంది మంత్రులు ఘన స్వాగతం పలికారు. మోదీ గయానా పర్యటన సందర్భంగా ఆ దేశం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.