calender_icon.png 18 November, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐబొమ్మ వెనుక అంతర్జాతీయ ముఠా!

18-11-2025 12:42:40 AM

-పైరసీ ముసుగులో వేల కోట్ల దందా?

-రూ.20 వేల కోట్ల సంపాదన..

-50 లక్షల మంది డేటా చోరీ, డార్క్ వెబ్‌లో విక్రయం

-సీబీఐ, ఈడీలకు కేసు బదిలీకి రంగం సిద్ధం

-పోలీసులపై మీమ్స్ చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ 

-మా కుటుంబంలోనూ సైబర్ బాధితులున్నారు: నాగార్జున 

-పోలీసులకు సెల్యూట్ చేసిన చిరంజీవి, రాజమౌళి

-ప్రజలారా మమ్మల్ని క్షమించండి: ఐ-బొమ్మ

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 17 (విజయక్రాంతి): తెలుగు సినీ పరిశ్రమకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పైరసీ భూతంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కేవలం సిని మా పైరసీకే పరిమితం కాకుండా, దాని ముసుగులో అంతర్జాతీయ స్థాయిలో బెట్టిం గ్ దందా, డేటా చోరీకి పాల్పడుతూ వేల కోట్లు కొల్లగొడుతున్న అతిపెద్ద నెట్‌వర్క్‌ను ఛేదించారు. దమ్ముంటే పట్టుకోండి అంటూ గతంలో పోలీసులకే సవాల్ విసిరిన ‘ఐబొమ్మ’ పైరసీ సామ్రాజ్యపు కింగ్‌పిన్ ఇమ్మడి రవిని (39) అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. సోమవారం ఉదయం సీపీ సజ్జనార్‌ను తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, చిరంజీవి, నాగార్జున, రాజమౌళి తదితర సీనీ పెద్దలు కలిశారు. 

ఈ సందర్భగా మీడియాతో మాట్లాడిన సజ్జనార్.. ఇమ్మడి రవిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో మొత్తం ఐదు కేసులు నమోదు చేసిన ట్లు వెల్లడించారు. గత ఆగస్టు 30న తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టామని ఈక్రమంలో ఇమ్మడి రవిని అరె స్టు చేసి ఐటీ యాక్ట్, కాపీ రైట్ చట్టాల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు. అంతకు ముందు పైరసీ కేసులో శివరాజ్, ప్రశాంత్ అనే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి పైరసీకి సంబంధించిన పలు కీలక వివరాలు సేకరించామన్నారు. ఈ కేసులో అంతర్జాతీయ సంబంధాలు ఉన్నందున, దర్యాప్తు కోసం సీబీఐ, ఈడీలను అప్రమత్తం చేశాం అని సజ్జనార్ స్పష్టం చేశారు. రవి అరెస్ట్‌పై సోషల్ మీడియాలో పోలీసులను కించపరిచేలా రవిని హీరోగా చిత్రీకరిస్తూ మీమ్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. 

కాగా రవిని అతడి భార్యే పోలీసులకు పట్టించిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సజ్జనార్ ఖండించారు. అందులో వాస్తవం లేదని చెప్పారు. హైదరాబాద్ పోలీసులకు దశాబ్దాలుగా సొంత నెట్‌వర్క్ ఉన్నదని, విచారణలో భాగంగానే రవి అరెస్ట్ అయ్యాడ ని స్పష్టం చేశారు. ‘ఇమ్మడి రవి వెనుక అంతర్జాతీయ నెట్‌వర్క్ ఉంది. ఐబొమ్మ వంటి 65 మిర్రర్ వెబ్‌సైట్లను నడుపుతూ, ఒకదాన్ని బ్లాక్ చేస్తే మరొ కదాన్ని సృష్టిస్తూ పోలీసులతో దోబూచులాడాడు. అతని హార్డ్ డిస్క్ లో 1972 నాటి ‘గాడ్ ఫాదర్’ నుంచి, ఇంకా విడుదల కాని 21 వేల సినిమాలు లభించాయని తెలిపారు.

తప్పించుకునేందుకు విదేశీ పౌరసత్వం

భారత చట్టాల నుంచి తప్పించుకోవడానికి, రవి తన భారత పౌరసత్వాన్ని వదులు కుని, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వం పొందాడు. తన సర్వర్లను నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో ఏర్పాటు చేసి, విదేశాల నుంచి ఈ పైరసీ నెట్‌వర్క్‌ను నడిపిం చాడు. దీంతో అతని కార్యకలాపాలను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. అయినప్పటికీ, వివిధ డొమైన్ సర్వీస్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సాంకేతిక సమాచారాన్ని విశ్లేషించిన సైబర్ క్రైమ్ పోలీసులు, కూకట్‌పల్లిలోని గ్రీన్ హిల్స్ రోడ్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌లో రవిని చాకచక్యంగా పట్టుకున్నారు. అతని నుంచి 21,000 సినిమాలతో నిండిన 15 హార్డ్ డిస్కులు, 3 ల్యాప్‌టాప్‌లు, 6 సీపీయూలు, 34 డెబిట్/క్రెడిట్ కార్డులతో పాటు, అతని బ్యాంకు ఖాతాల్లోని రూ.3 కోట్లను ఫ్రీజ్ చేశారు. 

ఎన్నో ఏళ్లుగా పైరసీతో పోరాడుతున్నాం: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పైరసీతో పోరాడుతున్నాం. ఇది కేవలం హీరోలు, నిర్మాతలకు సంబంధించిన సమస్య కాదు, చిత్ర పరిశ్రమపై చాలా మంది ఆధారపడ్డారని వారి కష్టాన్ని అప్పనంగా దోచుకుంటే బాధగా ఉందన్నారు. కేవలం పెద్ద హీరోలు, ప్రొడ్యూసర్ లే కాకుండా గేట్ మ్యాన్ నుండి లైట్ బాయ్ వరకు ప్రతిఒక్క రూ నష్టపోతున్నారని చెప్పారు. అందరి సహకారంతో పైరసీ నుంచి బయపడుతామని ధీమా వ్యక్తం చేశారు.

దోచుకోవాలనే కుట్ర: నాగార్జున

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ‘ఇది ఉచిత సినిమా కాదు, దీని వెనుక వేల కోట్లు దోచుకోవాలనే పెద్ద కుట్ర ఉంది. మా కుటుంబంలోనే ఒకరు డిజిటల్ అరెస్ట్ బాధితులుగా రెండు రోజులు నరకం అనుభవించారు. 50 లక్షల మంది డేటా ఐబొమ్మ నిర్వహకుడి వద్ద ఉందని, కేవలం రూ.20 కోట్ల కోసం నిందితులు ఇందంతా చేయడం లేదని రూ. వేల కోట్లు దోచుకోవాలనే పెద్ద ప్లాన్ దీని వెనుక ఉందన్నారు. 

పైరసీ ఒక క్యాన్సర్: రాజమౌళి

దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘పైరసీ అనేది ఒక క్యాన్సర్. దానిని అంతం చేయడానికి మేమంతా పోలీసులకు అండగా ఉంటాం. ఎంతోమంది కష్టాన్ని ఉచితంగా దోచుకోవడం సబబు కాదు. సినిమా రంగం ఎన్నో కష్టనష్టాలకోర్చి చిత్రాలు తీస్తోంది. పైరసీ కట్టడికి పోలీసులు ఎంతో శ్రమించారు’ అన్నారు.

ఎవరీ ఇమ్మడి రవి? ఎలా ఎదిగాడు?

విశాఖపట్నంకు చెందిన రవి.. హైదరాబాద్‌లో ఈఆర్ ఇన్ఫోటెక్ పేరుతో వెబ్ సర్వీసెస్ సంస్థను స్థాపించాడు. ఇంటర్నె ట్ వినియోగం పెరగడం, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ఆదరణ పెరగడాన్ని గమనించి 2019లో ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్‌ను సృష్టించాడు. కోవిడ్ లాక్‌డౌన్ సమయం లో థియేటర్లు మూతపడటంతో కొత్త సినిమాలను హెచ్‌డీ క్వాలిటీతో ఉచితంగా అందించడం ద్వారా ఐబొమ్మ అనతికాలంలోనే నెలకు 5 మిలియన్ల యూజర్లతో అత్యంత ప్రజాదరణ పొందింది.

అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో రవి చేతులు కలిపాడు. తన వెబ్‌సైట్‌కు వచ్చే యూజర్ల ను పాప్-అప్ యాడ్స్, హిడెన్ స్క్రిప్ట్‌ల ద్వారా బలవంతంగా ఈ బెట్టింగ్ సైట్‌లకు మళ్లించేవాడు. దీని ద్వారా అఫిలియేట్ కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయలు సంపాదించాడు. యూజర్లను ప్రమాదకరమైన ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయమని ప్రోత్స హించడం ద్వారా, వారి ఫోన్లు, కంప్యూటర్లలోకి మాల్‌వేర్‌ను చొప్పించేవాడు. 

ఈ మాల్‌వేర్ ద్వారా యూజర్ల వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, ఫోటోలు, ఓటీపీలను చోరీ చేసి, వాటిని ‘డిజిటల్ అరెస్ట్’, ‘ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్’ వంటి నేరాలకు పాల్పడే సైబర్ నేరగాళ్లకు అమ్ముకునేవాడు. ఇలా ఐబొమ్మను సందర్శించిన సుమారు 50 లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను రవి చోరీ సైబర్ నేరగాళ్లకు, డార్క్ వెబ్‌లో అమ్ముకున్నాడని సీపీ సజ్జనార్ వెల్లడించారు. 

క్షమాపణలు కోరుతున్నాం: ఐ-బొమ్మ

సినిమాలను పైరసీ చేయడంతోపాటు ప్రజల డేటాను సేకరించినందుకు తమను క్షమించాలని ఐబొమ్మ నిర్వాహకులు కోరినట్టు తెలిసింది. వెబ్‌సైట్లను మూసివేశా మని, ఇక మీదట ఎలాంటి పైరసీలకు పాల్పడబోమని చెప్పారు.

రవికి తల్లి బుద్ధులే వచ్చాయి: తండ్రి అప్పారావు

ఇమ్మడి రవి అరెస్ట్ వ్యవహారంలో అత ని తండ్రి అప్పారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు చేసిన పనికి సిగ్గు తో తలదించుకుంటున్నానని, వాడికి తన తల్లి బుద్ధులే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి నేర ప్రవృత్తికి అత ని తల్లే కారణమని చెప్పారు. రవి తల్లి ప్రవర్తన వల్లే తాను ఆమెతో విడిపోయానని తెలిపారు. ఆమెకున్న క్రిమినల్ బ్రెయినే రవి కి వచ్చినట్టుందన్నారు. కుటుంబంలో సమస్యల వల్ల రవి ఇబ్బంది పడ్డాడని, 15 ఏళ్ల క్రితం ఇంటి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయాడని చెప్పారు. అప్పటి నుంచి తనను ఎప్పుడూ డబ్బులు అడగలేదని, తనకూ ఇవ్వలేదని చెప్పారు. ప్రేమ పెళ్లి చేసుకుని, ఎందుకు విడిపోయారో కూడా తెలియదన్నారు. తన కుమారుడు చేసిన పనిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.