calender_icon.png 1 August, 2025 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్పత్రుల్లో అరాచకాలు

31-07-2025 12:14:58 AM

కామిడి సతీష్‌రెడ్డి :

* ‘సృష్టి’ వంటి కొన్ని ఆస్పత్రులు అరాచకాలు చేస్తూ.. వైద్య రంగానికి మాయనిమచ్చలా మారుతున్నాయి. అప్పట్లో వైజాగ్ సిటీలోని యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి అక్రమంగా శిశువుల విక్రయాలకు పాల్పడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఇదే సృష్టి తాజాగా ఐవీఎఫ్ పేరిట చైైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడటం పోలీసులను షాక్‌కి గురిచేసింది. సృష్టి ఆస్పత్రి సాగించిన అనైతిక విధానం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని బడా ఆస్పత్రుల్లోనూ సాగుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఆస్పత్రుల మాఫియా ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా పనులను చక్కబెట్టుకునే స్థితి నుంచి నేడు సర్కార్‌నే సవాల్ చేసే స్థాయికి ఈ మాఫియా చేరుకుంది. రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే అక్రమ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లతో పాటు అడ్డా కూలీలపై కొత్త వ్యాక్సిన్ల ప్రయోగం ఏండ్లుగా జరుగుతోంది. ఇదే సమయంలో అక్రమంగా లింగనిర్ధ్దారణ పరీక్షలు, అక్రమ సరోగసీల తంతు కొనసాగుతోంది.

తాజాగా ‘సృషి’్ట ఆస్పత్రిలో ఐవీఎఫ్ పేర ‘చైల్డ్ ట్రాఫికింగ్’ కూడా వెలుగుచూడడం సంచలనం సృష్టించింది. శాస్త్ర, సాంకేతిక రంగంలో అనేక ఆవిష్కరణలకు నిలయంగా మారి సైన్స్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ వైద్య రంగంలో తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించే నగరంగా కూడా పేరుగాంచింది. ఇప్పటికే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది.

జంట నగరాలయిన సికింద్రాబాద్, హైదరాబాద్‌లలో పేరుగాంచిన ఆస్పత్రులెన్నో ఉన్నాయి.  విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ఇదే సమయంలో ఆస్పత్రుల మాఫియా ఆగడాల గురించి ఎంతచెప్పినా తక్కువేనన్న చందంగా మారింది.

ఇప్పటికే అక్రమ కిడ్నీ మార్పిడుల రాకెట్ ఇరురాష్ట్రాల పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. హైదరాబాద్‌లో అలకనంద ఆస్పత్రిలో వెలుగుచూసిన అక్రమకిడ్నీ ఆపరేషన్ల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దేశంలోని అనేక నగరాలకు చెందిన ప్రముఖ వైద్యులు ఈ స్కాంలో అరెస్టయ్యారు. 

ఐవీఎఫ్‌తో అవాక్కయ్యేలా..  

ప్రస్తుత రోజుల్లో అనేక మంది దంపతులకు పిల్లల్ని కనే విషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటువంటి వారు ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనేందుకు మొగ్గుచూపుతున్నారు. దంపతుల పిల్లల ఆశలను ఆసరాగా చేసుకుని కొన్ని ఆస్పత్రులు అక్రమార్జనకు తెరలేపాయి. ‘సృష్టి’ వంటి కొన్ని ఆస్పత్రులు అరాచకాలు చేస్తూ.. వైద్య రంగానికి మాయనిమచ్చలా మారుతున్నాయి.

అప్పట్లో వైజాగ్ సిటీలోని యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి అక్రమంగా శిశువుల విక్రయాలకు పాల్పడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఇదే సృష్టి తాజాగా ఐవీఎఫ్ పేరిట చైైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడటం పోలీసులను షాక్‌కి గురిచేసింది. సృష్టి ఆస్పత్రి సాగించిన అనైతిక విధానం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని బడా ఆస్పత్రుల్లోనూ సాగుతున్నట్టు పోలీసులు అను మానిస్తున్నారు.

అప్పట్లో వైజాగ్‌లో గ ర్భంతో ఉన్న ఓ వితంతువు ప్రసవించాక తనకు పుట్టిన మగబిడ్డను ఆస్పత్రి యాజమాన్యానికి ఇచ్చేసి ఒంటరిగా ఇంటికి రావడంతో శిశువు విషయమై ఆరా తీసిన కుటుంబ సభ్యులు అసలు విషయం తెలుసుకుని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఆ ఫిర్యాదుతో సృష్టి ఆస్పత్రి గోల్‌మా ల్ వ్యవహారం గుట్టురట్టయ్యింది. తాజాగా ఇదే ఆస్పత్రిలో మరో దారుణం వెలుగుచూసింది.

నానాటికీ పెరుగుతున్న ఆస్పత్రి మాఫియా ఆగడాలు

‘సృష్టి’ లాంటి ఐవీఎఫ్ సెంటర్లు ఎన్నో రోజులుగా దారుణాలు చేస్తున్నా బయటపడలేదు. తాజాగా ‘సృష్టి’ బండారం బట్టబయలైంది. ఇదే సృష్టి ఆస్పత్రి రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో 76 మంది శిశువులను పిల్లలులేని దంపతులకు అమ్మినట్లు తేలింది. ఇప్పుడు తాజాగా అద్దె గర్భం కోసం ముప్పు లక్షల రూపాయలు చెల్లించి మోసపోయిన దంపతుల ఉదంతం వెలుగుచూసింది.

పెళ్లయి చాలా కాలం అవుతున్నా పిల్లలు కలగకపోవడంతో రాజస్థాన్‌కు చెందిన దంపతులు హైదరాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను సంప్రదించారు. డాక్టర్ పలురకాల పరీక్షలు నిర్వహించి ఐవీఎఫ్ సాధ్యం కాదని చెప్పి.. దంపతుల చేత సరోగసీకి ఒప్పించింది. సరోగసీ కోసం వైజాగ్‌కు చెందిన దంపతులను ఒప్పించానని కూడా సదరు డాక్టర్ దంపతులను నమ్మించింది.

సరోగసీకి ఒప్పుకున్న దంపతులు రూ. 5 లక్షలు అడుగుతున్నారని రాజస్థాన్ దంపతుల నుంచి డాక్టర్ వసూలు చేసింది. వారి నుంచి అండం, వీర్యం తీసుకుని సరోగసీ మొదలుపెట్టామని అన్నారు. దంపతులను మరింత నమ్మించేందుకు వైజాగ్‌కు చెందిన ఓ గర్భిణీని సరోగసీ తల్లిగా చూపించారు. కొన్ని రోజుల తర్వాత డాక్టర్ ఆ దంపతులకు ఓ శిశువును కట్టబెట్టారు.

సరోగసీ మదర్ మరిన్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆ దంపతుల వద్ద మరిన్ని డబ్బులు వసూలు చేశారు. చివరికి తనకు సంతానం వద్దనుకున్న అస్సాంకు చెందిన ఓ మహిళకు పుట్టిన సంతానాన్ని ఈ దంపతులకు అంటగట్టారు. కొన్ని రోజుల అనంతరం వివిధ పరిణామాల తర్వాత సదరు డాక్టర్ చేసిన మోసం బట్టబయలైంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆ మహిళా డాక్టర్‌ను కటకటాల్లోకి నెట్టారు. 

ఇంకా అనేక రకాలు.. 

ఆస్పత్రుల్లో ప్రతినిత్యం అనేక రకాల స్కామ్‌లు జరుగుతున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో యువకుల మంచి వీర్య కణాలు, యువతుల నుంచి అండాలను అక్రమంగా సేకరిస్తూ వాటిని ఫ్రీజ్ చేస్తూ.. ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కనాలని తమ వద్దకు వచ్చే దంపతుల కోసం ఇవి వాడుతున్నట్లు పోలీసులు తేల్చారు.

విభిన్న టెస్టుల పేరుతో ప్రజలను మోసం చేయడం, అవసరం లేని స్కాన్‌లు, బ్లడ్ టెస్టులు చేయించడం, మందుల కంపెనీలతో కుమ్మక్కు ఎక్కువ ఖరీదు చేసే మందులను అంటగట్టడం, ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక బిల్లులు వసూలు చేయడం చేస్తున్నారు. రాష్ర్టవ్యాప్తంగా గైనకాలజిస్టులు నిబంధనలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఎన్నో రోజుల నుంచి వినవస్తున్నాయి.  

వ్యాసకర్త సెల్: 9848445134