25 April, 2026 | 3:48 AM

చిన్నారుల అభివృద్ధికి పునాదిగా అంగన్వాడి కేంద్రాలు

25-04-2026 02:12 AM

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఏప్రిల్ 24 (విజయక్రాంతి): అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల అభివృద్ధికి పునాది వేస్తూ ‘అమ్మ ఒడి మొదటి బడి’గా నిలుస్తున్నాయని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. 

శుక్రవారం జిల్లా కేంద్రంలో  మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భూపాలపల్లి డివిజన్ అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందించారు. ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడి కేంద్రాల జాబితాను సమర్పించాలని, వాటికి స్థలాలు కేటాయించి నిధులు మంజూరు చేసి భవనాల నిర్మాణం చేపడతామని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడిల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు గ్రామ స్థాయిలో సేవలందించే సైనికులని పేర్కొంటూ, గర్భిణీలు ఆరోగ్యంగా ఉండేందుకు వారి సేవలు ఎంతో దోహదపడు తున్నాయన్నారు. ప్రతి బిడ్డకు కనీసం ఆరు నెలలు తల్లిపాలు అందేలా చూడాలని, పోషకాహారం తీసుకునేలా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులను చైతన్యపరచాలని సూచించారు.

అంగన్వాడి సేవలను మరింత పారదర్శకంగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగా స్మార్ట్ఫోన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్వహిస్తున్న వివిధ సర్వేల్లో అంగన్వాడి సిబ్బంది భాగస్వాములు అవుతూ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. భూపాలపల్లి డివిజన్లోని 418 మంది అంగన్వాడి సిబ్బందికి స్మార్ట్ఫోన్లు అందజేసినట్లు తెలిపారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా పోషణ మాసం నిర్వహించినట్లు పేర్కొన్నారు.

అనంతరం చిన్నారులకు ప్రోగ్రెస్ రిపోరట్స్ అందచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గ్రంధాలయ సంస్థల ఛైర్మన్ రాజబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మహిళా శిశు సంక్షేమ అధికారి మల్లీశ్వరి, కౌన్సిలర్లు, ఆర్టీఐ సభ్యులు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.