28 August, 2026 | 1:30 AM

అంగన్‌వాడీ కేంద్రానికి తాళం

28-08-2026 12:16 AM

చిన్నారుల భద్రత, ఆహారంపై తల్లిదండ్రుల ఆందోళన

హత్నూర ఆగస్టు 28: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొన్యాల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం అధ్వాన పరిస్థితుల కు చేరింది. కేంద్ర భవనం తలుపులు చెదలు పట్టి దెబ్బతినడంతో తాళం వేసే పరిస్థితి లేకుండా పోయిందని గ్రామస్తులు చెబుతున్నారు.

దీంతో అంగన్వాడీ కేంద్రం కుక్కలు, పందులకు ఆవాసంగా మారిందని, చిన్నారులకు అందాల్సిన సేవలు, సురక్షిత వాతావరణం ప్రశ్నార్థకంగా మారాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ప్రతిరోజూ పౌష్టికాహారం, ఇతర పోషకాహార సేవలు అందించాల్సి ఉండగా, కేంద్రం పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొనడంతో ఆహార పదార్థాల భద్రతపై కూడా తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారుల ఆరోగ్యానికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. అంగన్వాడీ కేంద్ర భవనం పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ సంబంధిత సిబ్బంది, అధికారులు పట్టించుకోకపోవడం పట్ల గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పరిశుభ్రత, చిన్నారుల భద్రతపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడిందని వారు ఆరోపిస్తున్నారు.

*తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్

కొన్యాల అంగన్వాడీ కేంద్రాన్ని సంబంధిత మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సీడీపీఓ, అంగన్వాడీ సూపర్వైజర్ క్షేత్రస్థాయిలో పరిశీలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. దెబ్బతిన్న తలుపులను వెంటనే మరమ్మతు చేసి తాళం ఏర్పాటు చేయడంతో పాటు కేంద్రాన్ని పూర్తిగా శుభ్రపరిచి, చిన్నారులకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన అంశం కావడంతో అధికారులు ఇకనైనా స్పందించి అంగన్వాడీ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.