calender_icon.png 22 November, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా ఆంక్షారెడ్డి నియామకం

22-11-2025 11:02:31 PM

- ఖరారు చేసిన అధిష్టానం

- సిద్దిపేట కాంగ్రెస్ లో ఊహించని పరిణామం

- పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా.. -ఆంక్షారెడ్డి

గజ్వేల్: పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ అధ్యక్షురాలిగా ఆంక్షారెడ్డిని అధిష్టానం ఖరారు చేసింది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి కూతురు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు తూముకుంట ఆంక్షారెడ్డి తనదైన శైలిలో పార్టీని పార్టీ సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఎంతో శ్రమించారు. ఎంతోమంది రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు డీసీసీ అధ్యక్ష పదవికి పోటీలో ఉండగా, ఎవరు ఊహించని రీతిలో ఆంక్షారెడ్డిని అధిష్టానం అధ్యక్షురాలుగా నియమించడం పార్టీకి తండ్రి తూముకుంట నర్సారెడ్డి చేసిన సేవలతో పాటు, యువజన కాంగ్రెస్ ద్వారా ఆంక్షారెడ్డి చేసిన సేవలకు గుర్తింపు ఇచ్చినట్లుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సీనియర్ నాయకులు ఎంతో మంది పోటీలో ఉన్నా జాతీయస్థాయిలో నర్సారెడ్డికి పార్టీలో ఉన్న పలుకుబడిని, గుర్తింపును ఆంక్షారెడ్డి నియామకంతో ఏ స్థాయిలో ఉందో మరోసారి వెల్లడించినట్లు అయింది.

గ్రామస్థాయి నుండి నర్సారెడ్డి జిల్లా స్థాయి వరకు పార్టీకి విశేష సేవలు అందించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా ముందు నిలబడడం, ఆయన కూతురు  ఆంక్షారెడ్డి కూడా అదే బాటలో కొనసాగుతుండడం డీసీసీ అధ్యక్షురాలిగా ఆంక్షారెడ్డి నియామకానికి బలం చేకూర్చింది. అలాగే రాష్ట్రంలో రాహుల్ గాంధీ నిర్వహించిన జోడో యాత్రతో పాటు, తానే స్వయంగా గ్రామ గ్రామానికి పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాల గురించి పల్లె పల్లెకు ప్రచారం చేశారు. కాగా సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలిగా ఎంపికైన సందర్భంగా ఆంక్షారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి అధిష్టానం ఎంపిక చేయడం ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చిందన్నారు. తన తండ్రి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిసిసి అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి  బాటలోనే కొనసాగుతూ మరింత గొప్పగా కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు, ప్రజలకు  సేవలందిస్తానని తెలిపారు. తన నియామకానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.