22-11-2025 10:40:25 PM
పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రెండవసారి రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కే అప్పగించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల అధ్యక్ష నియామకమును శనివారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల డీసీసీ అధ్యక్ష పదవులకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నామినేషన్ల ప్రక్రియ చేపట్టగా... శనివారం రాత్రి పార్టీ నాయకత్వం ఆయా జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ను రెండవసారి నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.
దీంతో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీలో సమర్థులైన అభ్యర్థులను పరిశీలించి ఈ నియామకం చేపట్టినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించారు. కాగా, తనకు జిల్లా పదవి బాధ్యతల అప్పగించిన ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పార్టీ సీనియర్ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.