మన్నె క్రిశాంక్‌పై మరో కేసు
- జూబ్లీహిల్స్ శ్మశానవాటిక కేటాయింపును ప్రశ్నించినందుకు 26వ కేసు నమోదు
- నాపై రౌడీషీట్ తెరిచేందుకు కుట్ర: క్రిశాంక్
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 7 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ సోషల్ మీడి యా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై మరో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ, శ్మశానవాటిక కేటాయింపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని ఆయనపై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోడ్ ప్రకటించడానికి 48 గం టల ముందు, కాంగ్రెస్ ప్రభుత్వం హుటాహుటిన అల్కాపురి కాలనీలో 2500 గజాల భూమిని ముస్లింల శ్మశానవాటిక కోసం కేటాయించింది.
ఆ తర్వాత ఆర్మీ అధికారులు రంగంలోకి దిగి ఆ భూమి రక్షణ శాఖ కు చెందినదని స్పష్టం చేసి, దాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ పరిణామంపై మన్నె క్రిశాంక్ సోషల్ మీడియా వేదికగా స్పంది స్తూ, ఇది జూబ్లీహిల్స్‌లో ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆడిన డ్రామా, అని విమర్శించారు. ఈ పోస్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ నాయకులు బోరబండ పోలీస్ స్టేషన్‌లో క్రిశాంక్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది పోలీసుల కుట్ర: క్రిశాంక్
ఈ ఫిర్యాదుపై క్రిశాంక్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది తనపై నమోదైన 26వ కేసు అని క్రిశాంక్ చెప్పారు. ఈ ఫిర్యాదు తనపై కక్షపూరితంగా పోలీసులే స్వయంగా తయారు చేశారని ఆరోపించారు. తనపై రౌడీషీట్ తెరిచేందుకు పోలీసులే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.




