17-08-2025 12:51:08 AM
-అన్ని రకాల ధరలు భారీగా పెంచిన సర్కారు
-ఇకపై సాధారణ నంబర్లు కూడా సామాన్యులకు దొరకని పరిస్థితి
-9999 నంబర్ ప్లేట్ ఖరీదు రూ.1,50,000
-ప్రత్యేక సంఖ్యలకు రూ. 40 వేలు వసూలు
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాం తి): ఫ్యాన్సీ నంబర్లు.. వాహనాలు ఉన్న వారికి వీటిపై ఎంతో మోజు. ఎలాగైనా తమ కారుకు ఆకర్షణీయమైన నంబర్ ప్లేట్ బిగించుకునాలని ఉబలాటపడే వాహనదారులు ఎందరో. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్యాన్సీ నంబర్ల ధరలు పెంచేందుకు కసరత్తు సిద్ధం చేస్తూ బుధవారం ప్రజాభిప్రాయ సేకరణకు కూడా సిద్ధమైంది.
అయితే ప్రభుత్వం ఫ్యాన్సీ నంబర్ల ధరలు పెంచేందుకు సిద్ధమైనా... సాధారణ నంబర్లకు కూడా భారీగా ధరలు పెంచేందుకు నిర్ణయించడంపై వాహనదారులు మండిపడుతున్నారు. ఫ్యాన్సీ అంటే 9999, 6666, 3333, 1, 3, 9 లాంటి నంబర్లు మాత్రమే అని భావించేవారు. అం దుకే వాటికే ఎప్పటి నుంచో భారీ డిమాండ్ ఉంటోంది. 6669, 9996, 3339, 4445 వంటి నంబర్లకు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. అందుకే వీటిని చాలా తక్కువ ధరతో సొంతం చేసుకునేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ సాధారణ నంబర్లకు కూడా భారీగానే ధరలు నిర్ణయించారు.
ఇలా ఉండేది..
2006లో తీసుకువచ్చిన జీఓ ఎంఎస్ నం.175 ప్రకారం ప్రస్తుతం ఫ్యాన్సీ ధరలు నడుస్తున్నాయి. రూ. 50వేలకు అత్యంత ఫ్యాన్సీ నంబర్లున 1, 9, 999, 9999 వంటి నంబర్లను దక్కించుకునేందుకు అవకాశం ఉండేది. ఇక రూ. 30వేలు చెల్లించి 99, 333, 555, 666, 777, 888, 2222, 3333, 4444, 5555, 6666, 7777, 8888 తరహా నంబర్లు... రూ. 20వేలు చెల్లిస్తే 123, 222, 369, 444, 567, 786, 1111, 3366, 3456, 4455 వంటి నంబర్లు లభించేవి. ఇక రూ. 10వేలు చెల్లిస్తే 3, 5, 6, 7, 111, 234, 306, 405, 789, 818, 909, 1188, 1234, 1314, 1818, 1899, 2277, 2772, 2345, 2727, 2799, 3636 తరహా నం బర్లు ఇచ్చేవారు. రూ. 5 వేలు చెల్లిస్తే కార్లకు పైన లేని నంబర్ల కాకుండా మిగతా నంబర్లు కేటాయించేవారు. ఇక బైక్‌ల విషయానికి వస్తే రూ.2వేలు చెల్లించి ఫ్యాన్సీ నంబర్లలో చివరి వరుసలో ఉండే వాటిని తీసుకునేందుకు ఛాన్స్ ఉండేది.
ఇలా పెంచేశారు..
కొత్తగా తీసుకువచ్చిన ధరల పట్టిక చూస్తే కళ్లు తిరుగుతాయి. అయితే ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎగబడే ధనవంతులను చూస్తే పోనీలే బాగానే పెంచారు అని అందరూ అంటున్నా.. సా మాన్యులకు కూడా కాస్తో కూస్తో ఉన్న ఫ్యాన్సీ నంబర్ల చివరి శ్రేణిని కూడా లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందని వాపోతున్నారు. గతంలో ప్రారంభ ఛార్జీనే రూ. 50వేలు ఉంటే ఆ స్థానంలో మోస్ట్ ఫ్యాన్సీ నంబర్ 9999 కోసం రూ.1,50,000, 1, 9, 6666 వంటి ప్రత్యేక సంఖ్యలకు రూ.1,00,000 అంటూ రెండు కొత్త స్లాబులను తీసుకువచ్చారు. వీటితో పాటు 99, 999, 3333, 4444 వంటి నంబర్లకు రూ.50,000గా నిర్ణయించారు. ఒకే నంబర్ కోసం అనేక దరఖాస్తులు వచ్చిన సందర్భంలో బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా అత్యధిక మొత్తం నమోదు అయిన దరఖాస్తుదారునికి నంబర్ కేటాయిస్తారు.
ప్రత్యేక సంఖ్యలకు రూ.40,000
ఇక్కడివరకు బాగానే ఉన్నా ఇతర ప్రత్యేక సంఖ్యలకు రూ.40,000 వరకు వసూలు చేస్తామని చెప్పడమే మధ్యతరగతి వాహనదారులకు రుచించడం లేదు. గతంలో ఇది రూ. 10వేలకు లభించేది. దీన్ని ఏకంగా రూ. 40వేలు చేశారు. అలాగే సాధారణ సంఖ్యలకు అంటూ మరో స్లాబ్ రూ.6 వేలుగా నిర్ణయించారు. ఇందులో టూ వీలర్లకు రూ.3వేలుగా పేర్కొన్నారు. ఇతర ప్రత్యేక సంఖ్యలకు రూ. 40వేలు వసూలు చేయడం వల్ల మధ్యతరగతి ప్రజలు ఇక ఫ్యాన్సీ నంబర్ల ఆలోచనే చేయబోరని రవాణా శాఖకు చెందిన ఓ అధికారి వాపోయారు. ధనవంతులకే ఫ్యాన్సీ నంబర్లా... సాధారణ ప్రజలకు మోస్ట్ ఫ్యాన్సీ నంబర్ కాకున్నా ఓ మోస్తరు ఫ్యాన్సీ నంబర్ అయినా అందకుండా చేస్తారా అని వాహనదారులు మండిపడుతున్నారు.