17-08-2025 09:31:24 AM
కేరళ: కేరళ(Kerala)లోని కోజికోడ్ జిల్లాలో తొమ్మిదేళ్ల బాలిక మరణం అమీబిక్ ఎన్సెఫాలిటిస్(Amebic Encephalitis) అనే అరుదైన మెదడు వాపు వ్యాధి కారణంగా జరిగిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ధృవీకరించారు. కలుషిత నీటిలో కనిపించే అరుదైన "అమీబా" వల్ల ఈ వ్యాధి సంభవిస్తుందని వైద్య నిపుణులు వెల్లడించారు. కోజికోడ్ జిల్లాలోని తమరస్సేరీకి చెందిన బాలిక జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతుండగా ఈ నెల 13న ఆమె కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు.
మరుసటి రోజు ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో, ఆమెను కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు బాలిక మరణించింది. మైక్రోబయాలజీ పరీక్షలలో అమీబిక్ ఎన్సెఫాలిటిస్ కారణంగా బాలిక మరణించిందని వైద్యులు నిర్ధారించారు. కాగా, ఈ సంవత్సరం జిల్లాలో ఈ వ్యాధికి మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయని వైద్యులు వెల్లడించారు. మరోవైపు, ఇన్ఫెక్షన్‌కు కారణమైన అమీబా కోసం వెతకడానికి వైద్య నిపుణుల సలహా మేరకు అధికారులు బాలిక నివాసం సమీపంలోని కాలువలు, చెరువులను పరిశీలిస్తున్నారు.