17-08-2025 01:19:51 AM
ఎరువుల కోసం తండ్లాట
-మహబూబాబాద్ జిల్లాలో రైతుల పడిగాపులు.. అధికారులతో వాగ్వాదం
-సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో
- ఆగస్టు వరకు రాష్ట్రానికి యూరియా కేటాయింపులు 8.30 లక్షల మెట్రిక్ టన్నులు
- కానీ వచ్చింది మాత్రం 5.12 లక్షల మెట్రిక్ టన్నులే
- రాష్ట్రంలో ప్రస్తుతం నిల్వ ఉన్నది 0.76 లక్షల మెట్రిక్ టన్నులే
- సరఫరాలో 40 శాతం పైగా కోత
- తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నదాతలు
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): తెలంగాణలో వరినాట్లు ప్రారం భమై నెల రోజులు గడుస్తోంది. వానాకాలం పంటల సాగు దాదాపు 69శాతం పూర్తయింది. కానీ పంటల సాగుకు సరిపడా యూరియా లేక రాష్ట్రంలోని రైతు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎరువులు దొరకక అన్నదాతలు కంటనీరు పెడుతున్న ఘటనలు నిత్యకృత్యమ వుతున్నాయి. పంట పొలాల్లో నాట్లు వేస్తూనో.. కలుపు తీస్తూనో ఉండాల్సిన రైతులు యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద, ఫర్టిలైజర్ దుకాణాల వద్ద గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వర్షాలను సైతం లెక్కజేయకుండా లైన్‌లలో పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం లైన్‌లో చెప్పులు పెడుతున్న సన్నివేశాలు మళ్లీ పాత రోజులను గుర్తుచేస్తున్నాయి. ఆధార్‌కార్డుపై ఒక్కటే యూరియా బస్తా ఇస్తున్నారని రైతులు వాపోవడం పరిస్థితికి అద్దం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అంటే 2025, ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయించింది. ఇందులో ఇప్పటివరకు 5.18 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేసింది.
ఫలితంగా 3.12 లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడింది. గతంలో కేటాయించిన యూరియాను రైతులకు ఇవ్వగా, అంటే ఏప్రిల్ నెల వరకు మిగిలిన 1.92 మెట్రిక్ టన్నుల యూరియాతో కలిసి ప్రస్తుతం కేంద్రం సరఫరా చేసిన దానిని పరిగణనలోకి తీసుకోగా మొత్తం 7.04 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరఫరా చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభు త్వం వద్ద కేవలం 0.76 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉంది. కాగా తెలంగాణ ప్రభుత్వం వద్ద యూరియా సమృద్ధిగా ఉందని కేంద్ర ఎరువుల శాఖామంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంట్‌లో వెల్లడించారు. 2024 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు 20.20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, 22.15 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా అయిందని, వీటిలో 20.08 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకం జరిగిందని, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం వద్ద 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు యూరియా మిగులు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
69 శాతం పంటలసాగు..
ఈ సీజన్‌లో మొత్తం 1.32 కోట్ల ఎకరాల సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, అందులో ఇప్పటివరకు 91.52 లక్షల ఎకరాల్లో రైతులు వరితో పాటు వివిధ పంటలు వేశారు. వరిపంట సాగు లక్ష్యం 62.47 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 40 లక్షల ఎకరాలకు పైగా నాట్లు పూర్తయ్యాయి. పత్తి పంట లక్ష్యం 48.93 లక్షల ఎకరాలు ఉండగా, 43.70 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. ఇక మొక్కజొన్నకు నిర్ణయించిన 5.21 లక్షల ఎకరాల సాగు లక్ష్యం కంటే అధికంగా 5.52 లక్షల ఎకరాలల్లో (106 శాతం) సాగు చేశారు. సోయాబిన్ పంటకు 4.20 లక్షల ఎకరాలకు గానూ 3.55 లక్షల ఎకరాల్లో (84 శాతం) సాగు పూర్తయ్యింది. కందులు పంట లక్ష్యం 6.69 లక్షల ఎకరాలు కాగా, 4.43 లక్షల ఎకరాల్లో (66 శాతం) పంటలు వేశారు. సూర్యాపేట, వనపర్తి, మేడ్చల్ జిల్లాల్లో పంటల సాగు 50 శాతం కంటే తక్కువ విస్తీర్ణంలో సాగిందని, మిగిలినని జిల్లాల్లో 50 శాతానికి పైగా పంటలు వేశారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నం దున ఈ వారం రోజుల్లో లోటు భర్తీ అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
యూరియా తప్పనిసరి..
పంటలు సమృద్ధిగా పండాలంటే మొక్కలకు యూరియా చాలా అవసరమని, ఈ అవసరాలను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యూరియాను ఎక్కువగా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వానాకాలం సీజన్ సగం అయిపో తున్నా ఇప్పటివరకు సరిపోను యూరియా ఇవ్వడం లేదని రైతులు మండిపడుతున్నారు.