17-08-2025 01:00:03 AM
ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగడం తప్పనిసరి. ఆ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ‘ఎన్నికల సంఘం’ అంతకన్నా ముఖ్యం. మన రాజ్యాంగం కూడా దేశ ఎన్నికల కమిషన్‌పై గురుతర బాధ్యత పెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని కాపాడే క్రమంలో బాధ్యతలను నిర్వర్తించడానికి ఎన్నో అధికారాలను ఇచ్చింది. 1950 జనవరి 26న భారత్ గణతంత్ర దేశంగా అవతరించిన తర్వాత ఎన్నోసార్లు పార్లమెంట్ సహా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఘనత ఈసీ సొంతం.
రాజ్యాంగబద్ధ సంస్థగా గుర్తింపు పొందిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్ఠ రోజురోజుకు మసకబారుతోంది. కొంతకాలంగా తన చర్యలతో ఎన్నికల సంఘం తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అధికార పార్టీలకు ఈసీ కొమ్ము కాస్తుందంటూ ప్రతిపక్షాల ఆరోపణలు, బీజేపీ కోసం ఈసీ భారీగా ఓట్ల చోరీకి పాల్పడిదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బయపెట్టడం, బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ వివాదం ఇలా ఈసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే వస్తున్నాయి.
తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈసీకి చివాట్లు పెట్టింది. బీహార్‌లో ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం దాదాపు 65 లక్షల ఓట్లను తొలగించడంపై సుప్రీం అభ్యంతరం చెప్పింది. ఈ నెల 19 వరకు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన 65లక్షల మంది ఓటర్ల గుర్తింపును బహిర్గతం చేయాలని ఆదేశించింది.
ఎవరీ శేషన్?
ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం పార్టీలకు తొత్తులుగా మారి రాజ్యాంగ విలువలను మరిచిపోయి పనిచేస్తున్నాయని ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. వరుస ఆరోపణలతో కుంచించుకుపోతున్న ఈసీకి తిరిగి పునర్వైభవం రావాలంటే 90వ దశకంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన టీఎన్ శేషన్ లాంటి వ్యక్తులు మళ్లీ రావాల్సిందే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. పని రాక్షసుడిగా ముద్ర పడినా శేషన్ ఎన్నికల నిర్వహణలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు.