calender_icon.png 31 July, 2025 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తగా మరో డిస్కం

31-07-2025 12:26:43 AM

  1. రాష్ర్టమంతా ఒకే యూనిట్‌గా పరిధి 
  2. ఆ సంస్థకు విద్యుత్ సబ్సిడీల బాధ్యతలు 
  3. పాత డిస్కంలకు వాణిజ్య కార్యకలాపాల బాధ్యతలు 
  4. ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లలో సోలార్ వినియోగం
  5. సచివాలయంలో సోలార్ రూఫ్‌టాప్: రేవంత్‌రెడ్డి ఆదేశం
  6. డిప్యూటీ సీఎం భట్టితో కలిసి ఇంధనశాఖపై సమీక్ష

హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): ఎన్‌పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్‌తో పాటు రాష్ర్టంలో  కొత్తగా మరో డిస్కంను ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ ఉచిత విద్యుత్, 200 యూనిట్ల ఉచిత గృహవిద్యుత్, స్కూళ్లు, కాలేజీలకు ఉచిత విద్యుత్ పథకాలను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకు రా వాలని రేవంత్‌రెడ్డి సూచించారు.

రాష్ర్టంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలన్నారు. డిస్కంల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు సంస్కర ణలు తప్పనిసరని సీఎం స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రాష్ర్టంలో  కొత్తగా మరో డిస్కం ఏర్పాటు చేయాలని సూచించారు.  సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఇంధనశాఖపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సమీక్ష నిర్వహించారు.

రాష్ర్టమంతా ఒకే యూనిట్‌గా కొత్త డిస్కమ్ పరిధి ఉండాలని, దీంతో ఇప్పుడున్న డిస్కంల పనితీరు మెరుగుపడుతుందని, జాతీయస్థాయిలో రేటింగ్ పెరుగుతుందని సీఎం పేర్కొన్నారు. ఎన్‌పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంస్థలు వాణిజ్య విద్యుత్ కార్యకలాపాలు చేపడుతాయని, కొత్త డిస్కం ప్రభుత్వ సబ్సిడీపై అందించే విద్యుత్ నిర్వహణకు వీలుగా విభజన చేయాలని సీఎం  సూచించారు

డిస్కంలపై రుణభారం తగ్గించాలి

డిస్కంల పునరవ్యవస్తీకరణ తో పాటు విద్యుత్ సంస్థల పై ఇప్పుడు ఉన్న రుణ భారం తగ్గించాలని సీంఎ అధికారులకు సూచించారు. రుణాలపై వడ్డీ భారం తగ్గించేందుకు వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలని అదేశించారు. 10 శాతం వరకు వడ్డీపై తీసుకున్న రుణాలతో డిస్కంలు డీలా పడ్డాయని.. ఈ రుణాలను 6 శాతం వరకు తక్కువ వడ్డీ ఉండేలా రీ స్ట్రక్చర్ చేసుకోవాలని అదేశించారు.

రాష్ర్టవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సీఎం సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని, జిల్లాల వారీగా అనువైన భవనాలను గుర్తించే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు బాధ్యత అప్పగించాలన్నారు. యుద్ధప్రాతిపదికన అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. 

సచివాలయంలో సోలార్ రూప్‌టాప్  

రాష్ర్ట సచివాలయానికి సౌర విద్యుత్ అందించాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వెంటనే చేయాలని సీఎం ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ, విద్యుత్ శాఖ సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎండాకాలంలో సచివాలయంలో వాహనాల పార్కింగ్ ఇబ్బందిగా మారిన నేపథ్యంలో సోలార్ రూఫ్ టాప్ షెడ్స్ ఏర్పాటు చేయాలని, వాహనాల పార్కింగ్‌కు అనువుగా ఉండేలా సోలార్ రూఫ్ టాప్‌ను డిజైన్ చేయాలన్నారు.

విద్యుత్ అవసరాలతో పాటు పార్కింగ్ ఇబ్బందులు తొలిగిపోయేలా సచివాలయం చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలన్నారు. ఇందిర సోలార్ గిరి జలవికాసం పథకాన్ని రాష్ర్టంలోని అన్ని గిరిజన, ఆదివాసీ తండాలు, ఏజెన్సీ ఏరియాల్లో యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ఆదేశించారు. మూడేళ్లలో 2లక్షల 10వేల మంది ఎస్టీ రైతులకు ఈ పథకం వర్తింపజేయాలని, 6లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ పంపుసెట్లను అందించి లక్ష్యాన్ని చేరుకోవాలని సీఎం సూచించారు.