15-12-2025 01:06:32 AM
రాష్ట్రానికి జాతీయ ఇంధన సంరక్షణ అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న ఇంధనశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్
హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి) : ఇంధన సంరక్షణ, సమర్థత రంగంలో తెలంగాణ రాష్ర్టం మరోసారి దేశవ్యాప్తంగా ప్రతిభను చాటుకుంది. భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘జాతీయ ఇంధన సంరక్షణ అవార్డులు(ఎన్‌ఈసీఏ)-2025’ లో రాష్ర్ట ప్రదర్శన విభాగంలో తెలంగాణకు రెండో బహుమతి లభించింది.
ఈ అవార్డును తెలంగాణ రాష్ర్ట నూతన, పునరుత్పా దక ఇంధన అభివృద్ధి సంస్థ(టీజీరెడ్‌కో), రాష్ర్ట నియమిత సంస్థ(ఎస్‌డీఏ)గా సమర్థవంతంగా అమలు చేసిన కార్యక్రమాల ఫలితంగా రాష్ర్టం అందుకుంది. ఈ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో భారత రాష్ర్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అదుకున్నారు. తెలంగాణలో రెడ్ కో ద్వారా అమలు చేసిన కూల్ రూఫ్ ప్రాజెక్టులు, ఇంధన పొదుపు చర్యలు, స్వచ్ఛ ఇంధన కార్యక్రమాలతో రాష్ట్రానికి ఈ గుర్తింపు వచ్చింది. కార్యక్రమంలో రెడ్‌కో వైస్ చైర్మన్, ఎండీ వీ.అనిల, జనరల్ మేనేజర్ జీ.ఎస్.వీ ప్రసాద్, డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటరమణ పాల్గొన్నారు.