14 July, 2026 | 4:53 AM

అమరుల స్థూప స్థలం కోసం మరో అడుగు..

14-07-2026 12:41 AM

సీలింగ్ భూములపై విచారణకు డిమాండ్

హుస్నాబాద్, జూలై 13:హుస్నాబాద్లో అమరుల స్మృతి వనం నిర్మాణం కోసం కొనసాగుతున్న స్థల సాధన ఉద్యమం మరో కీలక దశకు చేరుకుంది. హుస్నాబాద్ అమరుల స్థూప స్థల సాధన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్లకు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు.ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రీఫామ్స్ సీలింగ్ యాక్ట్1973 ప్రకారం సర్వే నంబర్లు 1189, 275లోని అదనపు భూముల కేటాయింపులపై సమగ్ర విచారణ చేపట్టాలని కమిటీ ఆర్డీఓను కోరింది.

ఆయా సర్వే నంబర్లలో ఉన్న మొత్తం భూమి విస్తీర్ణం, సీలింగ్ పరిధిలోకి వచ్చిన భూమి, పేదలకు పంపిణీ చేసిన భూమి వివరాలు, వాటి హద్దులు, సీలింగ్ భూములు తిరిగి ఇతరుల ఆధీనంలోకి ఎలా వెళ్లాయనే అంశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. నాటి అమరుల స్థూప స్థలాన్ని ఆక్రమణల నుంచి రక్షించి, అక్కడ అమరుల స్మృతి వనం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కమిటీ కోరింది. ఈ స్థలం కేవలం భూమి సమస్య కాదని, మావోయిస్టు అమరుల త్యాగాలకు గుర్తుగా నిలిచే చారిత్రక స్థలమని పేర్కొంది.

అనంతరం మున్సిపల్ కమిషనర్కు సమర్పించిన వినతిపత్రంలో సర్వే నంబర్ 1189/బిలో ముత్తినేని రాజేశ్వర్ రెడ్డి స్థూపం ముందు అక్రమ నిర్మాణం జరుగుతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై గతంలో మున్సిపాలిటీ అధికారులు మొదటి నోటీసు ఇచ్చిన విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా, నిబంధనల ప్రకారం రెండో నోటీసు జారీ చేసి తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి, కో-చైర్మన్లు, ప్రధాన కార్యదర్శి మేకల వీరన్న యాదవ్తో పాటు పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.