మంత్రి వాకిటి శ్రీహరి రాజీనామా చేయాలి
గంగపుత్ర చైతన్య సమితి డిమాండ్
ముషీరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే రాజీనామా చేయాలని గంగపుత్ర చైతన్య సమితి డిమాండ్ చేసింది. సోమవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో గంగపుత్ర చైతన్య సమితి ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మంగిళిపల్లి శంకర్ గంగపుత్ర మాట్లాడారు. మంత్రి వాకిటి శ్రీహరి గంగపుత్రులను అవమానించేలా వ్యవహరించారని ఆరోపించారు.
కోహెడ ఎక్స్పోర్ట్ చేపల మార్కెట్ ప్రారంభోత్సవంలో గంగపుత్రుల ప్రస్తావన లేకుండా మాట్లాడటంతో పాటు, ఫిషరీస్ చైర్మన్గా పనిచేసిన గంగపుత్ర ప్రతినిధికి అన్యాయం చేశారని ఆరోపిస్తూ మంత్రి క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గంగపుత్రులకు ఎమ్మెల్సీ, మత్స్యశాఖ మంత్రి పదవి ఇవ్వాలని, సంప్రదాయ మత్స్యకారులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. మత్స్యకారులకు బీమా, చేపపిల్లల పంపిణీలో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే సీఎం నివాసం, ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పూస సత్యనారాయణ, చింతకింది రవి, ఎర్ర సునీల్, పూస రవి, కుంటా ప్రవీణ్, దుంపల సత్యనారాయణ, సందిరి కోటేష్, వడ్డెబోయిన సతీష్, చెర్క బాలు తదితరులు పాల్గొన్నారు.






