calender_icon.png 3 December, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ యోగా దినోత్సవం... భారతావనికి దక్కిన గౌరవం: పవన్ కళ్యాణ్

21-06-2025 11:33:14 AM

విశాఖపట్నం: ప్రపంచ యోగా దినోత్సవం(International Yoga Day 2025) భారతావనికి దక్కిన గౌరవమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy Chief Minister Pawan Kalyan) పేర్కొన్నారు. రుగ్వేదం యోగా విశిష్టతను, గొప్పదనాన్ని చెబితే ... దానిని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వవ్యాప్తం చేశారని తెలిపారు. యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, విశ్వ నరుడు నరేంద్ర మోదీ పిలుపు మేరకు యోగా దినోత్సవాన్ని ‘‘యోగా.. ఒకే భూమి, ఒకే ఆరోగ్యం’’ అనే థీమ్ ను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం విశాఖపట్నం సాగర తీరంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... “యోగా భారతీయ జీవన విధానంలో ఒక ముఖ్య భాగం. భారతీయ సనాతన ధర్మం యావత్ మానవాళికి అందించిన వరం అన్నారు. ఇది శరీరం.. మనసు మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ యోగా క్రియకు ఆది యోగి పరమ శివుడు ఆద్యుడు అయితే.. ఆ మహా యోగాన్ని ఆది శేషుడి అంశగా పతంజలి మహర్షి యోగ శాస్త్రం రూపంలో మనందరికీ అందించారని చెప్పారు. 

నరేంద్ర మోదీ నిలువెత్తు నిదర్శనం 

యోగా మన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం. సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా ఖండాంతరాలకు చేర్చిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందని పేర్కొన్నారు. యోగా సాధకులు ఎంతటి దృఢ చిత్తాన్ని కలిగి ఉంటారో... ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారో అన్నదానికి మోదీ నిలువెత్తు ఉదాహరణ అన్నారు. యోగా డే(Yoga Day) విషయమై మోదీ ప్రతిపాదనకు 177 దేశాలు ఆమోదం తెలిపాయి. ఆయన చొరవతోనే ప్రతి ఏడాది జూన్‌ 21న ప్రపంచ దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని సూచించారు. మోదీ పిలుపు మేరకు మన విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయిందన్నారు. ప్రధాని మోదీ సమక్షంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచిందని వెల్లడించారు.

విశాఖ వేదికగా గిన్నిస్ రికార్డు 

విశాఖ వేదికగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర(Yogandhra) కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్(Guinness World Records)లో స్థానం సంపాదించింది. ఈ విశిష్ట కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీతోపాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, క్రీడాకారులు, యోగా సంఘాలు, నౌకాదళం, కోస్ట్ గార్డు సభ్యులు, పారిశ్రామికవేత్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వీరంతా విశాఖ ఆర్కే బీచ్‌ నుంచి భోగాపురం వరకు దాదాపు మూడు లక్షల మంది ప్రజలు సామూహిక యోగా ప్రదర్శనలు చేశారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దాదాపు 2 లక్షల మంది ఆసనాలు వేశారు. సముద్రంలో యుద్ధ నౌకలపై నేవీ సిబ్బంది, వారి కుటుంబాలు వేసిన యోగసనాలు అందరినీ ఆకర్షించాయి. అంతకు ముందు ప్రధాని మోదీ  యోగా స్మారక పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేశారు.